కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్, డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి

కాన్పూర్ షూటౌట్ ఎన్ కౌంటర్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

కాన్పూర్‌లో గురువారం అర్థరాత్రి కొందరు నేరస్థులను పట్టుకోడానికి వెళ్లిన పోలీసు బృందంపై, దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు.

“కాన్పూర్‌కు చెందిన కరడుగట్టిన నేరస్థుడు, రౌడీ షీటర్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి పోలీసులు చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిక్రూ గ్రామం వెళ్లారు. వారిని అడ్డుకోడానికి అక్కడ ఒక జేసీబీని రోడ్డుకు అడ్డం పెట్టారు” అని రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవస్థి చెప్పారు.

“పోలీసు బృందాలు అక్కడికి చేరుకోగానే వారు మేడ మీద నుంచి కాల్పులు జరిపారు. అందులో 8 మంది పోలీసులు చనిపోయారు. వారిలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఏడీజీపీ ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. ఎస్ఎస్‌పి, ఐజీ అక్కడే ఉన్నారు. కాన్పూర్ ఫోరెన్సిక్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఎస్టీఎఫ్‌ను కూడా మోహరించారు” అన్నారు.

ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. వారిని కాన్పూర్‌ రిజెన్సీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

వికాస్ దూబేపై మొత్తం 60 కేసులు ఉన్నాయి. ఇటీవల రాహుల్ తివారీ అనే వ్యక్తి కాన్పూర్‌లో అతడిపై 307 కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి వికాస్ దూబేను అరెస్టు చేయడానికి పోలీసులు అతడి గ్రామం దిక్రూ వెళ్లినప్పుడు ఎదురుకాల్పులు జరిగాయి.

కాన్పూర్ షూటౌట్ ఎన్ కౌంటర్

ఫొటో సోర్స్, ANI

కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

గురువారం అర్థరాత్రి రౌడీ షీటర్, క్రిమినల్ వికాస్ దూబేను పట్టుకోడానికి వెళ్లిన పోలీస్ టీంపై దుండగులు కాల్పులు జరిపారని కాన్పూర్ ఐజీ మోహిత్ అగ్రవాల్ బీబీసీతో చెప్పారు.

“వారంతా మేడ మీది నుంచి పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆత్మరక్షణకు పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు చనిపోయారు” అన్నారు.

ఘటన గురించి తెలీగానే కాన్పూర్ పరిధి ఏడీజీపీ జయనారాయణ్ సింగ్, ఐజీ మోహిత్ అగ్రవాల్, ఎస్ఎస్‌పి సహా చాలామంది పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామం చుట్టూ పోలీసు దళాలను మోహరించారు. సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు.

వికాస్ దూబేతో కాంటాక్టులో ఉన్న వందకు పైగా మొబైల్ నంబర్లపై నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.

కాన్పూర్ సిటీలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను పిలిపించారు.

వికాస్ దూబేపై 2003లో జరిగిన లేబర్ కాంట్రాక్ట్ బోర్డ్ చైర్మన్ సంతోష్ శుక్ల హత్య ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఆ కేసు నుంచి అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు.

ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై తక్షణం నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

కాన్పూర్ షూటౌట్ ఎన్ కౌంటర్

ఫొటో సోర్స్, ANI

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)