అంతరిక్ష పరిశోధన: విశ్వానికి కొత్త ‘అట్లాస్’... 30 లక్షల కొత్త గెలాక్సీలను గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

ఈ కొత్త టెలిస్కోప్ ఇప్పటికే పది లక్షల కొత్త గెలాక్సీల మ్యాప్ రూపొందించింది

ఫొటో సోర్స్, CSIRO

ఫొటో క్యాప్షన్, ఈ కొత్త టెలిస్కోప్ ఇప్పటికే పది లక్షల కొత్త గెలాక్సీల మ్యాప్ రూపొందించింది

ఎడారిలో ఏర్పాటు చేసిన ఓ అధునాతన టెలిస్కోప్ ద్వారా లక్షలాది కొత్త గెలాక్సీల (నక్షత్ర మండలాలను) మ్యాప్‌ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

విశ్వానికి సంబంధించి తాము కొత్త ‘అట్లాస్‌’ రూపొందించామని, లోతైన వివరాలతో రికార్డు సమయంలో ఈ పని చేశామని ఆస్ట్రేలియా జాతీయ శాస్త్రీయ పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ఓ తెలిపింది.

మొత్తంగా 30 లక్షల గెలాక్సీలను తాము మ్యాప్ చేశామని, వాటిని ఇదివరకటి సర్వేలతో పోల్చితే రెండింతలు మెరుగ్గా కనిపించేలా చిత్రాలు తీశామని ప్రకటించింది.

విశ్వంలో కొత్త విషయాలను ఆవిష్కరించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదివరకటి సర్వేలు ఏళ్లపాటు చేసిన పనిని, తాము అధునాతన టెలిస్కోప్‌తో 300 గంటల్లో పూర్తి చేశామని సీఎస్ఐఆర్ఓ తెలిపింది.

ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనాలు చేయొచ్చని ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన డాక్టర్ డేవిడ్ మెక్‌కానెల్ తెలిపారు. నక్షత్రాల పుట్టుక నుంచి గెలాక్సీలు ఏర్పడే విధానం, భారీ కృష్ణబిలాలు రూపుదిద్దుకునే క్రమం, వాటి మధ్య జరిగే చర్యలు... ఇలా అన్నింటిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన సమాచారం వీటిలో ఉంటుందని ఆయన అన్నారు.

భవిష్యతులో నిర్వహించబోయే సర్వేల్లో కోట్ల సంఖ్యలో మరిన్ని కొత్త గెలాక్సీలను కనుగొంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారి అంతటా 36 డిష్‌ల సమాహారంతో ఈ అస్కాప్ టెలిస్కోప్‌‌ను రూపొందించారు

ఫొటో సోర్స్, CSIRO

ఫొటో క్యాప్షన్, పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారి అంతటా 36 డిష్‌ల సమాహారంతో ఈ అస్కాప్ టెలిస్కోప్‌‌ను రూపొందించారు

ఈ టెలిస్కోప్ ప్రత్యేకత ఏంటి?

36 డిష్ యాంటెన్నాలను కలిపి ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అరే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ) అనే టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాంటెన్నాలన్నీ కలిసి ఆకాశాన్ని విస్తృతంగా చిత్రిస్తాయి.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని సీఎస్ఐఆర్‌ఓ ముర్చిసన్ అబ్జర్వేటరీలో ఆరు కి.మీ.ల విస్తీర్ణంలో ఈ టెలిస్కోప్ వ్యవస్థ ఉంది.

ఈ డిష్ యాంటెన్నాలకు వచ్చే సంకేతాలన్నీ క్రోడీకరించుకుని నాణ్యమైన హై రెజల్యూషన్ చిత్రాలను ఈ టెలిస్కోప్ వ్యవస్థ రూపొందిస్తుందని, ఒకే భారీ యాంటెన్నాను ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చుతో పోల్చితే చాలా తక్కువ వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయొచ్చని సీఎస్ఐఆర్ఓ తెలిపింది.

ఆస్ట్రేలియా మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ కన్నా ఎక్కువ వేగంతో ఈ టెలిస్కోప్‌ నుంచి పెద్ద మొత్తంలో డేటా వస్తుంది. పెర్త్ నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ వ్యవస్థకు దీన్ని పంపి ప్రాసెస్ చేశాక, గెలాక్సీల చిత్రాలు రూపొందిస్తారు.

ఆస్కాప్ టెలిస్కోప్

ఫొటో సోర్స్, csiro

ఏం గుర్తించింది?

ఏఎస్‌కేఏపీ ఈ ఏడాదే తొలిసారిగా ఆకాశాన్ని సర్వే చేసింది. ఆకాశంలోని 83 శాతం పరిధిని చిత్రించి, 30 లక్షల గెలాక్సీలను గుర్తించింది.

లోతైన వివరాలున్న 903 చిత్రాలను కలిపి ఓ మ్యాప్‌గా రూపొందించింది.

ఇదివరకు ఇలాంటి సర్వే చేసేందుకు వేల సంఖ్యలో చిత్రాలు తీయాల్సి వచ్చేది.

ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ‘స్క్వేర్ కిలోమీటర్ అరే’ను దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీని కోసం ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే ఏఎస్‌కేఏపీని రూపొందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)