జగనన్న విద్యా దీవెన: 'ఇకపై తల్లుల ఖాతాల్లో బోధన రుసుములను జమ చేయడానికి వీల్లేదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, HC.AP.NIC.IN
కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును 40% మంది కళాశాలలకు చెల్లించలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. లేదా? మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా? అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని గుర్తు చేసింది. లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని వెల్లడించింది.
తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించింది. కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తే విద్యార్థులు మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. తద్వారా పథకం ఉద్దేశం నెరవేరదని తెలిపింది.
అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఈ మేరకు తీర్పు ఇచ్చారని ఈ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
12 హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మందిని ఒకేసారి ఎంపిక
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఒకేసారి ఎంపిక చేసిందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ ఏడాది ఆగస్టు 25న, ఈ నెల 1న జరిగిన సమావేశాల్లో 112 మంది అభ్యర్థుల పేర్లను కొలీజియం పరిశీలించింది. వీరిలో బార్ నుంచి 82 మంది, జ్యుడీషియల్ సర్వీస్ నుంచి 31 మంది పేర్లపై చర్చించి.. చివరకు 68 మందిని ఎంపిక చేసింది.
ఈ 68 మందిలో 44 మంది బార్ నుంచి, 24 మంది జ్యుడీషియల్ సర్వీస్ నుంచి ఉన్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారిలో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరిలో మిజోరం నుంచి షెడ్యూలు తెగకు చెందిన మహిళా న్యాయాధికారి మర్లీ వంకుంగ్‌కు జ్యుడీషియల్ సర్వీస్ నుంచి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేశారు.
కొలీజియం సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే.. మిజోరం నుంచి హైకోర్టు జడ్జిగా నియమితులైన తొలి మహిళగా కూడా వంకుంగ్ రికార్డుల్లోకెక్కనున్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారు అలహాబాద్, రాజస్థాన్, కలకత్తా, జార్ఘండ్, జమ్ము కశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, హరియాణా, కేరళ, ఛత్తీస్‌గఢ్, అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా, ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను, సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను ఎంపిక చేసిన తర్వాత మరోసారి ఇంత పెద్దసంఖ్యలో నియామకాలు జరపడం ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ లతో కూడిన కొలీజియం మరోసారి సంచలనం సృష్టించినట్లయిందని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRA PRADESH CM
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన జగన్
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని సాక్షి పత్రిక పేర్కొంది.
ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయని, వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఎంఎస్‌ఎంఈ, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్స్‌కు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కష్టకాలంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటి మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు. 12 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఎంఎస్‌ఎంఈలకు నేరుగా దాదాపు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్ మిల్స్ వారి ఖాతాల్లోకి మరో రూ.230 కోట్లు వెళ్తాయన్నారు. టెక్స్‌టైల్ మిల్లులకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల విద్యుత్ చార్జీ రీయింబర్స్‌మెంట్‌ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల్లో రిబేటు ఇచ్చేలా చేస్తున్నామని స్పష్టం చేశారని ఈ వార్తలో రాశారు.

'ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తాం'.. సజ్జనార్
నష్టాల బాటలో ఉన్న టీఎస్‌ఆర్టీసీని గట్టెక్కించి, సంస్థకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని టీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారని నమస్తే తెలంగాణ పత్రిక తెలిపింది.
బస్‌భవన్‌లో శుక్రవారం ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ స్వావలంబన, ప్రయాణికుల సంతృప్తి, ఉద్యోగుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్‌ఆర్టీసీకి కరోనా పరిస్థితులు, పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలు శరాఘాతంగా మారాయని, దీంతో రోజుకు రూ.8 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లించేందుకు తనవంతు కృషి చేస్తానని సజ్జనార్ చెప్పారు.
వర్క్‌ఫ్లేస్‌లో మహిళా అధికారుల వేధింపులకు పరిష్కారంగా అంతర్గతంగా ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్గో, పార్శిల్ సేవలతోపాటు ప్రధాన ఆదాయ వనరు అయిన టికెటింగ్ ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. కాగా, నూతన ఎండీ సజ్జనార్‌కు బస్‌భవన్‌లో భారీ కటౌట్లతో పూల బొకేలతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి:
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ
- నసీరుద్దీన్ షా: తాలిబాన్లపై కామెంట్, మండిపడుతున్న ముస్లింలు
- మీ పీఎఫ్ వడ్డీపై ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా? కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- 413 టెస్టు వికెట్లు తీసిన అశ్విన్ తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు?
- తాలిబాన్లు ఇకపై భారత్ దృష్టిలో తీవ్రవాదులు కారా
- ‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’
- తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఇవే..
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








