‘దిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి ఇవ్వండి’.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించినట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
దిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడాన్‌ను ఏర్పాటు చేయాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఐపీఎస్ కేడర్‌పైన కేంద్ర ప్రభుత్వం సమీక్ష జరపాలని, రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద అదనపు నిధులు విడుదల చేయాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీని, హైదరాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఒక గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
అలాగే, న్యూదిల్లీలో ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక అధికారిక భవనం.. ‘తెలంగాణ భవన్’ను నిర్మించుకునేందుకుగాను భూమిని కేటాయించాలని ప్రధాన మంత్రి మోదీని కేసీఆర్ కోరారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ‘తెలంగాణ భవన్’కు భూమి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని మోదీని ఆహ్వానించారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలిపారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని మోదీ హామీ ఇచ్చారని సీఎంఓ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్
డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిసేపటి కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు.
ఈడీ అధికారులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు.
డ్రగ్స్, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఈడీ ఆమెను ప్రశ్నించనుంది.
ఈ కేసులో తెలుగు సినీరంగానికి చెందిన మొత్తం 12 మందికి ఈడీ నోటీసులిచ్చింది.
మనీలాండరింగ్ చట్టం కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు.
అందులో భాగంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు.
రకుల్ ప్రీత్ సింగ్ నిజానికి సెప్టెంబర్ 6న హాజరుకావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్ కారణంగా తాను ఆ రోజు హాజరుకాలేనని, గడువు కావాలని ఆమె కోరారు.
ఈడీ అధికారులు విచారణ వాయిదా వేయకుండా ముందుగానే హాజరు కావొచ్చని ఆమెకు సూచించడంతో శుక్రవారం(సెప్టెంబర్ 3) ఆమె ఈడీ కార్యాలయానికి వచ్చారు.
కాగా రకుల్ ప్రీత్ సింగ్ తరువాత రానా దగ్గుబాటి ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

పూరీని 10 గంటలు విచారించిన అధికారులు
ఈ కేసుకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్ మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరు కాగా అధికారులు 10 గంటల పాటు ఆయన్ను విచారించారు.
మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో పూరీ జగన్నాథ్.. తన సోదరుడు, కుమారుడు, ఛార్టర్డ్ అకౌంటెంట్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.
రాత్రి 8.30 గంటల వరకు వారు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి ఈడీ విచారణ జరిపింది.
ఈ విచారణలో భాగంగా మున్ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని పూరీ జగన్నాథ్‌కు ఈడీ అధికారులు సూచించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
మధ్యలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను కూడా విచారణకు పిలిచారేమోనని తొలుత భావించినప్పటికీ.. పూరీ జగన్నాథ్‌ను ఇంతసేపు ఎందుకు వదల్లేదో తెలుసుకోవాలని తానే వచ్చానని బండ్ల గణేశ్ మీడియాకు చెప్పారు. అధికారులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. విచారణలో ఉన్న పూరీ జగన్నాథ్‌ను బండ్ల గణేశ్ కలవలేదు.

ఫొటో సోర్స్, Getty Images
8న రానా, 9న రవితేజ
ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో ఇంకా 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకాబోతున్నారు.
2017లో హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు అప్పట్లో ఎక్సైజ్ విభాగం క్లీన్‌చీట్ ఇచ్చింది.
అయితే, అనంతరం వివాదాల నడుమ ఈ కేసును ఈడీ విచారణకు స్వీకరించింది. తాజాగా పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








