వనమా రాఘవేంద్రపై రామకృష్ణ ఆరోపణ: ‘డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని, కానీ నా భార్యను పంపించమన్నాడు... అందుకే’ - ప్రెస్ రివ్యూ

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర కారణంగానే చనిపోతుననట్లు లేఖ రాసి భార్య, పిల్లలు సహా ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణ తన మరణానికి ముందు రికార్డ్ చేసిన వీడియో వెలుగుచూసిందని 'ఈనాడు' కథనం రాసింది. తన సమస్యలు పరిష్కరించాలంటే భార్యను అప్పగించాలని రాఘవేంద్ర కోరాడంటూ రామకృష్ణ ఆ వీడియోలో ఆరోపించారు.
"సమస్య తీరాలంటే నా భార్యను తీసుకురమ్మన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ..?" కుటుంబసమేతంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన పాల్వంచ వాసి రామకృష్ణ ఆవేదనాభరితంగా పలికిన ఆఖరు మాటలివి.
'నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. వేరే కుటుంబాలు పాడవకుండా ఇలాంటి దుర్మార్గుల్ని మాత్రం ఎదగనివ్వకండి' అంటూ ఆయన విన్నవించారు. ఓవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూనే ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈనెల 3న తెల్లవారుజామున కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, వనమా రాఘవేంద్రరావు అరాచకాలు వివరిస్తూ నాగ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో గురువారం వైరల్ అయ్యింది. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే.
''మా కుటుంబ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకొన్న వనమా రాఘవేంద్రరావు.. ఏ భర్తా తన చెవితో వినగూడని మాట నా చెవిలో వేశారు. కాదు ఆర్డర్ చేశారు. నీ సమస్య తీరాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్ రా అన్నారు. అదీ పిల్లలు లేకుండా? ఆ తర్వాతే నేను నీ సంగతి చూస్తా. అప్పటి వరకు నీ సమస్య పరిష్కారం కాదు.
ఎవడి దగ్గరికి వెళ్లినా ఎవడూ ఏమీ చేయలేడు. నీ భార్యను నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకొస్తావో ఆ తర్వాతే పరిష్కారం జరుగుతుందే తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకొన్నా.. ఏం చేసుకున్నా మీ ఆస్తిలో నయాపైసా కూడా రాదు.
నేను చెప్పిన పనిచేస్తే నీకు ఏం కావాలో అది చేస్తానన్నాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలండీ..! ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనమయ్యాయి. కొన్ని బయటకు వచ్చాయి. మరికొన్ని బహిర్గతం రాలేదు. నేను అభియోగం చేస్తున్నానని అనుకోవచ్చు.. వీటికి రికార్డింగులు లేవు. ఫొటోలు తీసి పెట్టలేదు. ఇవన్నీ రాఘవేంద్రరావు చీకటి కోణాలు. ఎదుటి మనిషికి సాయం చేయాలంటే ఆ వ్యక్తి ద్వారా ఆయన ఏం లబ్ధి పొందగలరు అనేది ముందు చూసుకుంటారు. అలా నన్ను ఈ రకమైన సంక్షోభంలో పెట్టి నా భార్యను తనవద్దకు పంపితే తప్ప నా సమస్య పరిష్కారం చేయనని చెప్పాడు.
కనీసం తను డబ్బు రూపంలో ఏమన్నా అడిగినా నేను ఇచ్చేవాణ్ని. మనిషిని కోరుకున్నాడండీ. నా భార్యను కోరుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేను. నా భార్యకు ఇంకా తెలియదు. ఇంకో భయం ఏమిటంటే నేను వీళ్లతో పోరాటం చేసే పరిస్థితుల్లో లేను. వాళ్ల ఆర్థిక, రాజకీయ అండదండల ముందు నా స్థాయి సరిపోదు. కాబట్టి నేను ఒక్కడిని ఏమైనా చేసుకుంటే నా భార్య పరిస్థితి ఏంటి? నా భార్యను అసలు వీళ్లు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లే. పిల్లలు ఏమైపోతారో అర్థం కావట్లే. అందుకే నాతోపాటే వాళ్లను తీసుకెళ్తా. దయచేసి నా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. అందరినీ నేను విన్నవించుకునేది ఒకటే. నాకు సహకరించిన వాళ్లకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూడండి. థాంక్యూ'' అని రామకృష్ణ ముగించారు. పొరపొచ్చాలు లేకుండా సాగిన తమ సంసారజీవితం, కుటుంబ ఆర్థిక సమస్యల గురించీ రామకృష్ణ ఈ వీడియోలో వివరించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ysrcp
'చేయగలిగినంత చేస్తాం.. పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన': సీఎం జగన్
ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారని 'సాక్షి' కథనం రాసింది.
''ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. పీఆర్సీపై చర్చించేందుకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాలుగా మేలు చేసే ప్రయత్నాలు చేస్తామని, రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులకు మంచి చేస్తూ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల పెరుగుదల, ఆదాయం తగ్గుతున్న తీరును ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరించారు'' అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో సోషల్ మీడియాపై పోలీసు నిఘా
సోషల్ మీడియాలో ఇతరుల గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ పోలీసులు అడుగులు వేస్తున్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''ఫేస్ బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ఇష్టానుసారం పొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి అడ్డగోలు వ్యాఖ్యలతో పరువుకు నష్టం కలిగించేవారిపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
సీఎం కేసీఆర్‌పై గత డిసెంబర్ 29న అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తొలుత వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబరు 8న చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనపై మరో కేసు నమోదైంది.
రెండు రోజుల కిందట పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఎంపీ అర్వింద్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఏ హోదాలో ఉన్నవారైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపినట్లయింది.
సీఎం కేసీఆర్‌తో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో అవమానకరంగా ప్రచారం చేసినా కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TeluguDesamParty
రెండేళ్లలో వస్తా.. రెట్టింపు హింసిస్తా వైసీపీ నేతలూ ఖబడ్దార్
వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను చాలారకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని... రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తాను.. 20 రెట్లు ఎక్కువగా హింసిస్తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారని 'ఆంధ్రజ్యోతి' కథనం రాసింది.
''తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం కుప్పం, రామకుప్పం మండలాల్లోని 8 గ్రామాల్లో పర్యటించారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఇప్పుడే. టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.
గురువారం అర్ధరాత్రి వరకు రోడ్ షోలు నిర్వహించారు.
'అమ్మకు అన్నం పెట్టని.. చెల్లిని అవసరానికి ఉపయోగించుకుని వదిలేసిన వ్యక్తి జగన్. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎన్నో విధ్వంసాలు సృష్టించారు. విభజన కంటే ఆయన సీఎం కావడం వల్లే రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగింది. రాజధాని అమరావతిని కాపాడుకుంటే రూ.2 లక్షల కోట్ల సంపదను కాపాడుకున్నట్లే' అని ఈ సందర్భంగా తెలిపారని
ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












