Thailand: నర్సరీలోని పసి పిల్లలపై మాజీ పోలీసు కాల్పులు, కత్తి పోట్లు.. 37 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
థాయ్‌లాండ్‌లో ఒక ప్రీస్కూల్ డే కేర్ సెంటర్‌లో ఓ మాజీ పోలీస్ అధికారి జరిపిన విచక్షణా రహిత కాల్పులు, కత్తిపోట్ల కారణంగా కనీసం 37 మంది మరణించారని ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
మరణించిన వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు.
థాయ్‌లాండ్‌లోని నాంగ్ బువా లాంఫు నగరంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.
నిందితుడిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించామని, అయితే.. అతడు తన భార్యను, కొడుకును కూడా చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్-ఓచా సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

షాట్ గన్, పిస్టోల్, కత్తి
నర్సరీలోని చిన్నారులు, సిబ్బందిపై దాడికి దిగినప్పుడు నిందితుడి వద్ద ఒక షాట్ గన్, పిస్టోల్, కత్తి ఉన్నాయని థాయ్‌లాండ్ ప్రభుత్వ టీవీ చానెల్ తెలిపింది.
వాహనంలో పారిపోతూ అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ వెళ్లాడని పేర్కొంది.
ఇంటికి వెళ్లిన తర్వాత తన భార్యను, కొడుకును కూడా నిందితుడు హతమార్చాడని, తర్వాత తన ప్రాణాలు కూడా తీసేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

మృతుల్లో రెండేళ్ల చిన్నారులు, ఎనిమిది నెలల గర్భిణి
జిల్లా అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం లంచ్ టైమ్ తర్వాత షూటర్ బిల్డింగులోకి వచ్చాడు.
అక్కడ 30 మంది చిన్నారులు ఉన్నారు.
తొలుత ప్రీ స్కూల్‌లోని సిబ్బందిపై కాల్పులు జరిపాడు. వీరిలో ఎనిమిది నెలల గర్భిణి అయిన ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు.
‘‘ఏవో టపాకాయలు పేలుతున్నాయి అని తొలుత అంతా అనుకున్నారు’’ అని జిల్లా అధికారులు తెలిపారు.
మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారుల వయసు రెండేళ్లేనని ఒక పోలీసు అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ఈ ఘటనలో మొత్తం 22 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో కొందరు నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. నిద్రలోనే వారు ప్రాణాలు కోల్పోయారు.

దాడికి ముందు డ్రగ్స్ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడు
ప్రీ స్కూల్‌పై డాదికి ముందు నిందితుడు డ్రగ్స్ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యాడని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
డ్రగ్స్ వాడుతున్నాడనే అభియోగంపైనే ఈ పోలీసు అధికారిని గతేడాది విధుల నుంచి డిస్మిస్ చేశారు.
ఈ కేసులో విచారణ పూర్తయ్యింది. శుక్రవారం తీర్పు వెలువడనుంది.

ఫొటో సోర్స్, Reuters

గన్‌మ్యాన్ ప్రీ స్కూల్‌కి ఎందుకు వచ్చాడంటే..
తన చిన్నారి కోసం నిందితుడు ప్రీ స్కూల్ (నర్సరీ)కి వచ్చాడని, అక్కడ తన బిడ్డ లేకపోవడంతో ఆగ్రహం చెందాడని పోలీసు అధికార ప్రతినిధి పైసన్ లుసెంబూన్ చెప్పారు.
వెంటనే అతడు కాల్పులు ప్రారంభించాడని, తన వాహనంతో అక్కడ ఉన్న వాళ్లందరినీ గుద్ది చంపాలని చూశాడని చెప్పారు.
నర్సరీపై దాడి చేసిన తర్వాత అతడు రోడ్డుపై ఉన్నవాళ్ల మీదకి కూడా తన వాహనాన్ని నడిపాడని, ఒక మోటారు బైక్‌ను గుద్దుకుంటూ వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షి పవీన పురిచన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఘటన బాధితుల్లో పెద్దవాళ్లతోపాటు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
పిల్లలు, పెద్దవాళ్ల మీద నిందితుడు కాల్పులు జరపడమే కాకుండా, వారిపై కత్తితో దాడికి కూడా పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
దాడికి వెనక కారణాలు ఇంకా తెలియరాలేదని వారు వెల్లడించారు. ఈ పోలీసు అధికారిని విధుల నుంచి గతేడాది డిస్మిస్ చేసినట్లు ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తోంది.
నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. 34 ఏళ్ల పాన్య కమ్రాబ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని వారు వెల్లడించారు.
కాల్పులు జరిపిన తర్వాత కమ్రాబ్ తన తెలుపు రంగు పికప్ ట్రక్ లో సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని వెల్లడించారు.
థాయ్‌లాండ్‌లో ఇలాంటి కాల్పులు అరుదు. 2020లో నఖోన్ రట్చసిమ నగరంలో ఒక సైనికుడు జరిపిన కాల్పుల్లో 29 మంది మరణించగా, డజన్ల మంది గాయాలపాలయ్యారు.

ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్‌లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













