జీఎస్టీ తగ్గింపు: నిత్యావసరాల ధరలు తగ్గుతాయా?

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద.వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

కొత్త రేట్ల ప్రకారం కిరాణా సరకులపై జీఎస్టీ తగ్గింది.

సామాన్యులకు ఇది దీపావళి బహుమతి అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

అయితే జీఎస్టీ తగ్గింపు నిజంగానే ప్రజల నెలవారీ బడ్జెట్ ఖర్చులను తగ్గించగలదా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టూత్‌పేస్ట్, జీఎస్టీ, సుంకాలు
ఫొటో క్యాప్షన్, ఇప్పటివరకు 18 శాతం, 12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న కొన్ని రకాల వస్తువులపై పన్ను 5 శాతానికి తగ్గించారు.

13 శాతం వరకు పన్ను తగ్గింపు

మనం రోజూ ఇంట్లో ఉపయోగించే వస్తువులు

  • హెయిర్ ఆయిల్
  • షాంపూ
  • టూత్‌పేస్ట్
  • టాయిలెట్ సోప్ బార్
  • టూత్ బ్రష్
  • షేవింగ్ క్రీమ్‌

పై వస్తువులపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇవన్నీ ప్రతి ఇంట్లో ప్రతి నెలా కొనే వస్తువులు.

ఉదాహరణకు, ఒక టూత్‌పేస్ట్‌ ధర ఇప్పటిదాకా జీఎస్టీతో కలిపి 100రూపాయలనుకుంటే, కొత్త రేట్ల అమలు తర్వాత దాని ధరను 13రూపాయలు తగ్గించాలి. అప్పుడు మాత్రమే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వంద శాతం ప్రజలకు చేరుతుంది.

కానీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో అది అన్నిసార్లూ జరగదని ఆర్థికవేత్త వి.నాగప్పన్ అంటున్నారు.

"కంపెనీలు కూడా కొంత లాభాన్ని ఆశిస్తాయి. ఇలా ఆశించడం సహజం. ప్రభుత్వానికి ఇది తెలుసు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పన్నును 10 శాతం తగ్గిస్తే కంపెనీలు తమ లాభం కోసం ఆ మొత్తాన్ని తీసుకుంటాయా లేదా దానిని ఎనిమిది శాతం తగ్గించి రెండు శాతం లాభం తీసుకుంటాయా అన్నది. పన్ను తగ్గింపు లాభం చాలా మంది ప్రజలకు చేరే విధంగా ధరలు నిర్ణయించాలి. ప్రభుత్వం దానిని పర్యవేక్షించాలి. లేకపోతే, ప్రభుత్వ లక్ష్యం విఫలమవుతుంది" అని ఆయన అన్నారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని ఆహార పదార్థాలపై 7 శాతం వరకు పన్ను తగ్గింపు

వండేవి, నేరుగా ఉపయోగించేవి

  • వెన్న
  • నెయ్యి
  • చీజ్
  • డైరీ స్ప్రెడ్
  • ప్యాక్ చేసిన స్నాక్స్

వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల ఉత్పత్తులపై 7 శాతం పన్ను తగ్గనుంది.

పిల్లల ఉత్పత్తులపై 7 శాతం పన్ను తగ్గింపు

ఒకటి లేదా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు ఉన్న ఇంట్లో, నెలవారీ బడ్జెట్‌లో డైపర్‌ల కోసం భారీగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం డైపర్‌లు సహా కొన్ని పిల్లల వస్తువులపై జీఎస్టీ తగ్గింది.

  • బేబీ ఫీడింగ్ బాటిళ్లు
  • నాప్కిన్లు
  • క్లినికల్ డైపర్లు

వీటిపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇన్‌కమ్‌ట్యాక్స్ విధానంలో వచ్చిన మార్పులు, జీఎస్టీ తగ్గింపులతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరగనుంది.

ప్రయోజనం దక్కుతుందా?

ఈ పన్ను తగ్గింపు ప్రత్యేకంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది.

‘‘ఆర్థికంగా బలహీన వర్గాల ప్రాథమిక అవసరాలను సాధారణంగా ప్రభుత్వం చూసుకుంటుంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించే సంపన్న వర్గాల ప్రజలకు కూడా వారి దైనందిన జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. అధిక పన్నుల వల్ల ఎక్కువగా నష్టపోయేది మధ్యతరగతి ప్రజలే. నెల జీతం కోసం కష్టపడేవారే ఎక్కువగా ప్రభావితమవుతారు. జీఎస్టీలో మార్పులు వారికి కొంత ఊరటనిస్తాయి" అని ఆర్థికవేత్త నాగప్పన్ అంటున్నారు.

సంవత్సరానికి 12 లక్షల 75 వేల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపు (కొన్ని షరతులతో కూడిన), ఇప్పుడు ప్రకటించిన జీఎస్టీ పన్ను తగ్గింపు మధ్యతరగతికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అంటున్నారు.

"సంవత్సరానికి సుమారు 12 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి ఆదాయపు పన్ను సవరణలతో కొంత శాతం, జీఎస్టీ తగ్గింపుతో 10 శాతం ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ప్రజలు ఎక్కువ ఖర్చు చేయడానికి వీలు కలుగుతుంది" అని వి. నాగప్పన్ అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

సున్నా శాతం జీఎస్టీ

జీఎస్టీ లేని ఆహార పదార్థాలు

  • ప్రాసెస్డ్ మిల్క్ (అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్)
  • పనీర్
  • చపాతీ, రోటీ, పరాఠాతో పాటు అన్ని రకాల బ్రెడ్లు.

ఈ వస్తువులపై ఇప్పటివరకు ఉన్న 5 శాతం జీఎస్టీ తొలగించారు.

జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన వస్తువులలో ఆరోగ్య బీమాను అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి.

ఇప్పటివరకు వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి.

"గతంలో చాలా మంది దీనిని విమర్శించారు. ఇప్పుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్నును తొలగించడంపై ఏకాభిప్రాయంతో ఉండడం స్వాగతించదగినది. దీని వల్ల సంవత్సరానికి సగటున 30,000రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు చెల్లించాల్సిన కుటుంబాలకు ప్రీమియం దాదాపు 4,000రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు తగ్గుతుంది. ఇది ప్రజలు బీమా వైపు మొగ్గు చూపేలా చేస్తుంది" అని నాగప్పన్ తెలిపారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సిగరెట్ల రేట్లు పెరుగుతాయి.

ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి?

  • పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా
  • కార్బొనేటేడ్ వాటర్, సోడా వంటి పానీయాలు
  • పెద్ద కార్లు

ఈ వస్తువులపై జీఎస్టీ రేటు 40 శాతం కానుంది. వీటిలో కొన్ని వస్తువులు ఇప్పటిదాకా 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నాయి

కారు

ఫొటో సోర్స్, Getty Images

కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం

కొత్త పన్ను నిబంధనలతో చిన్న కార్ల ధరలు తగ్గవచ్చు (లగ్జరీ కార్లపై జీఎస్టీ 40 శాతానికి పెరిగింది).

ఇలాంటి ప్రకటన ఉంటుందన్న వార్తలు రావడం మొదలైనప్పటి నుంచి.. అంటే గత రెండు మూడు వారాలుగా కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయని కోయంబత్తూరుకు చెందిన ఒక కార్ డీలర్ చెప్పారు.

"జీఎస్టీ తగ్గింపు వల్ల కార్ల ధరలు తగ్గుతాయనే అంచనా ఉండడంతో, కారు కొనుక్కోవాలనుకుంటున్నవారు కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు. అందువల్ల, కొన్ని వారాలుగా అమ్మకాలు మందగించాయి" అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం, 1200 సీసీ సామర్థ్యానికి మించని, 4,000 మిల్లీమీటర్ల పొడవుకు మించని పెట్రోల్, ఎల్‌పీజీ లేదా సీఎన్‌జీ-ఆధారిత కార్లపై.. 1500 సీసీ సామర్థ్యం మించని, 4,000 మి.మీ. మించని డీజిల్ కార్లపై పన్నులు 28 శాతం నుంచి 30 శాతం వరకు ఉన్నాయి.

"ఇప్పుడు వీటిని 18 శాతం జీఎస్టీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఈ రకమైన కార్లను కొనగలరు. కాబట్టి రాబోయే వారాల్లో కార్ల అమ్మకాలు పెరుగుతాయనుకుంటున్నాం'' అని ఆయన చెప్పారు.

జీఎస్టీ, సుంకాలు, నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఇది ట్రంప్ పన్నులను భర్తీ చేయడానికి సాయపడుతుందా?

అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాలతో భారత్‌లోని వస్త్ర పరిశ్రమ, వజ్రాల వ్యాపారం, లెదర్ సెక్టార్ వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

"ఈ పరిస్థితి మరో మూడు నెలలు కొనసాగితే ఉద్యోగాలు పోవడం మొదలవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, జీఎస్టీలో మార్పులు ప్రకటించారు. ఈ పన్ను తగ్గింపు స్థానిక వ్యాపారాలకు కొంత ప్రోత్సాహాన్నిస్తుందని ప్రభుత్వం ఆశించవచ్చు" అని నాగప్పన్ విశ్లేషించారు.

జీఎస్టీ మార్పుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి 93,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని, 40 శాతం స్లాబ్ వల్ల దాదాపు 45,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో ఇంకా నిర్ణయించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)