చందమామ మీద భూములిస్తా.. బంగాళాదుంపలు పండించుకోండని రైతులకు రాహుల్ గాంధీ చెప్పారా- BBC FACT CHECK

ఫొటో సోర్స్, Youtube/Rahul Gandhi
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతులకు పంటలు పండించుకోవడానికి చంద్రమండలం మీద భూమి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోలో రాహుల్, "ఇక్కడి వ్యవసాయ భూముల నుంచి మీరు డబ్బు సంపాదించలేరు. చంద్రునివైపు చూడండి. అక్కడ మీకు నేను భూములు ఇస్తాను. భవిష్యత్తులో మీరు అక్కడ బంగాళదుంపలు పండించుకోవచ్చు. అక్కడ నేను ఒక మెషిన్ ఏర్పాటు చేస్తా. అక్కడి నుంచి బంగాళ దుంపలను గుజరాత్‌కు ఎగుమతి చేసుకోవచ్చు" అని చెప్పినట్లుగా ఉంది.
"టీమ్ మోదీ 2019", "నమో అగైన్" వంటి బీజేపీ అనుకూల ఫేస్‌బుక్ పేజీలు ఈ వీడియోను, "ఎవరైనా ఆయనను ఆపండి. ఆయన చంద్రమండలం మీద పంట భూములు ఇస్తానని హామీ ఇస్తున్నారు" అనే వ్యాఖ్యతో షేర్ చేశాయి.
ఆ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్లలో వేలాది మంది షేర్ చేసుకుని చూశారు.

ఫొటో సోర్స్, FACEBOOK
ఈ 24 సెకండ్ల వీడియోలో రాహుల్ గాంధీ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ పంటలు పండించుకోవడానికి రైతులకు చంద్రుని మీద భూములు ఇస్తానని చెబుతున్నట్లుగా ఉంది.
అయితే, ఇది తప్పుదారి పట్టించే ప్రచారమని మేం గుర్తించాం.
రాహుల్ గాంధీ ఆ మాటలు అన్న మాట నిజమే. కానీ, అది వేరే సందర్భంలో. ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే క్లిప్‌గా మార్చి వైరల్ చేశారు.
నిజమైన వీడియో
రాహుల్ గాంధీ గుజరాత్‌లోని పటాన్‌లో ఏర్పాటు చేసిన యువ రోజ్‌గార్ ఖేదుత్ అధికార్ నవసర్జన్ యాత్రలో చేసిన ప్రసంగంలోని 24 సెకండ్ల ముక్కను తీసుకుని ఈ వీడియో తయారు చేశారు.
రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్ర ఎన్నికలకు ముందు 2017లో నవసర్జన్ యాత్రలో పాల్గొన్నారు.
ఆయన వాస్తవానికి ఏం చెప్పారు?
"నేను ఆచరణయోగ్యం కాని హామీలు ఇవ్వను. ఒక్కోసారి మీకు అది నచ్చకపోవచ్చు. కానీ, మోదీజీ ఏమంటున్నారు... ఇక్కడి పంట పొలాలతో మీరు డబ్బు సంపాదించుకోలేరు, అందుకే చంద్రుని వైపు చూడండి. అక్కడ మీకు పంట పొలాలు ఇస్తాను. భవిష్యత్తులో మీరు అక్కడ బంగాళాదుంపలు పండించి మళ్ళీ గుజరాత్‌కే ఎగుమతి చేయొచ్చని అంటున్నారు. ఇలాంటి వాగ్దానాలతో నేను పోటీ పడలేను. నేను వాస్తవాలు మాట్లాడతాను."
అంటే, రాహుల్ గాంధీ చెప్పిన ఆ మాటలు మోదీని ఉటంకిస్తూ చెప్పినవన్న మాట.
రాహుల్ ఆరోజు చేసిన ప్రసంగం పూర్తి వీడియో ఆయన అధికారిక యూట్యూబ్ పేజిలో ఉంది. అది 2017 నవంబర్ 12న పబ్లిష్ అయింది.
"బంగాళదుంపలు... బంగారం"
అదే ప్రసంగంలో రాహుల్ చెప్పిన చెప్పిన మరో మాట కూడా 2017-18లో వైరల్ అయింది.
ఆ వైరల్ వీడియోలో, "నేనొక యంత్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాను. అది ఎలాంటిదంటే, ఒకవైపు మీరు బంగాళ దుంపలు పెడితే మరో వైపు నుంచి అది మీకు బంగారాన్ని ఇస్తుంది. మీకు అప్పుడు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు వస్తుంది" అని రాహుల్ చెప్పినట్లుగా ఉంది.
ఆ వైరల్ వీడియో ఆయనను చూసి నవ్వుకునేలా చేసింది. ఆ అనుకరణలతో సోషల్ మీడియా ఆయన మీద పరోక్షంగా దాడి చేసింది.

ఫొటో సోర్స్, UGC
అయితే, అది కూడా నాటి గుజరాత్ యాత్రలో రాహుల్ చేసిన ప్రసంగంలోని ఒక శకలం మాత్రమే.
మొత్తంగా 17 నిమిషాల 50 సెకండ్లు ఉన్న అసలు వీడియోలో ఆయన ఏమన్నారో చూడండి: "ఆయన ఒక మిషన్ కూడా అక్కడ పెడతానన్నారు. అందులో ఒక వైపు బంగాళ దుంపలు వేస్తే, అది మరోవైపు నుంచి మీకు బంగారాన్ని ఇస్తుంది. మీకు బోలెడంత డబ్బు వస్తుంది. అంత డబ్బుతో ఏంచేయాలో కూడా మీకు పాలుపోదు. ఇవి నా మాటలు కాదు. నరేంద్ర మోదీ మాటలు. ఇదీ మోదీ, బీజేపీల నిజ స్వరూపం."
గుజరాత్‌లోని ఆదివాసీలకు రూ. 40,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన మోదీ వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, వరద బాధితులకు కూడా ఒక్క రూపాయి సాయం అందించలేదని రాహుల్ ఆ ప్రసంగంలో ఆరోపించారు.
అయితే, రాహుల్ చెబుతున్నట్లుగా మోదీ ఇచ్చిన అధికారిక ప్రకటన కానీ, వార్త కానీ, వీడియో కానీ మాకు లభ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: బీజేపీ ర్యాలీగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమేనా...
- తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ అధ్యక్షుడు
- ‘వైమానిక దాడి జరిగిన’ బాలాకోట్ నుంచి BBC Exclusive రిపోర్ట్
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఇలా జరిగింది
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









