ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి!

‘మీలో ఎంతమంది ఆల్కహాల్ తాగితేనే నిజం చెప్పగలరు?’.. ఆ ప్రశ్న వింటూనే దిల్లీలోని కిట్టీ సూ అనే నైట్ క్లబ్‌లో జనాలు కాస్త కంగారు పడ్డారు.
కానీ కాసేపటికి ‘ట్రూత్ ఆర్ డేర్’ ఆట మొదలైంది. అందరి కంగారు మాయమైంది. ఎలాంటి భేషజాలు లేకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ నుంచి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల వరకూ అన్నీ పంచుకున్నారు.
ఆ తరవాత మ్యూజిక్ మొదలైంది. అందరూ చక్రాల కుర్చీల్లో డ్యాన్స్ ఫ్లోర్‌పైకి వెళ్లారు.
చక్రాల కుర్చీ ఏంటని అనుకుంటున్నారా? అక్కడున్న వాళ్లలో ఎక్కువమంది ఏదో ఒక రకమైన వైకల్యంతో బాధపడుతున్నవాళ్లే. అలాంటి వాళ్ల కోసం ‘ఇంక్లవ్’ అనే సంస్థ ఆ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.
‘‘గతంలో నేనోసారి కోల్‌కతాలో పబ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించా. కానీ నా వీల్ చెయిర్ వల్ల ఇతర అతిథులకు అసౌకర్యంగా ఉంటుందని నన్ను లోపలికి అనుమతించలేదు. కానీ ఇక్కడ ఆ సమస్య లేదు. ఇప్పటికే ‘ఇంక్లవ్’ ఏర్పాటు చేసిన 7-8 ఈవెంట్లకు నేను హాజరయ్యా’’ అని అక్కడికి వచ్చిన మనీష్ రాజ్ చెప్పారు.
వికలాంగుల కోసం ‘ఇంక్లవ్’ పేరుతో ఆ సంస్థ ఓ కొత్త డేటింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. పెళ్లిళ్లకు వైకల్యం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించారు.

భారత్‌లో వికలాంగులకు సౌకర్యాలు తక్కువనే భావన ఉంది. రోడ్లమీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఎక్కువగా కనిపించవు. తమ వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుందేమోనని తల్లిదండ్రులు వికలాంగులైన పిల్లలను కూడా ఎక్కువగా బయటకు తీసుకొని రారు. ఇక వారి పెళ్లిళ్ల విషయంలో అయితే చాలా సమస్యలే ఎదురవుతాయి.
అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే శంకర్, కల్యాణిలు ‘ఇంక్లవ్’ పేరుతో మ్యాచ్ మేకింగ్ యాప్‌ను తయారు చేశారు. మొదట ‘వాంటెడ్ అంబ్రెల్లా’ పేరుతో వికలాంగుల కోసం ఓ మ్యాట్రిమోనీ సంస్థను నెలకొల్పి, తరవాత వెబ్‌సైట్ ఆపైన యాప్‌ను అభివృద్ధి చేశారు.
‘దేశంలో ఉన్న దాదాపు 8 కోట్ల మంది వికలాంగులను కనెక్ట్ చేయాలంటే టెక్నాలజీతోనే సాధ్యమని మాకు అనిపించింది. అందుకే ఈ యాప్‌ను రూపొందించాం’ అంటారు శంకర్. కానీ దానికి సరిపడా సాంకేతికత గానీ, డబ్బుగానీ వాళ్ల దగ్గర లేవు. అందుకే క్రౌడ్ ఫండింగ్ క్యాంపైన్ నిర్వహించి, దాని సాయంతో రూ.6.15లక్షలు సేకరించారు.
ఆ తరవాత చాలామంది వికలాంగులతో మాట్లాడి వాళ్ల అవసరాలేంటో తెలుసుకొని, దానికి అనుగుణంగా యాప్ రూపొందించాలని నిర్ణయించారు. 2016లో ధృవీకరించుకున్న 100మంది వికలాంగుల ప్రొఫైల్‌తో ‘ఇంక్లవ్’ యాప్ మొదలైంది. తరవాత క్రమంగా విస్తరించడం మొదలుపెట్టింది.

తమ యాప్ ద్వారా వ్యక్తులు చాటింగ్ చేస్తున్నారు కానీ ఆ బంధం ముఖాముఖి పరిచయంగా మారట్లేదని శంకర్‌కు అనిపించింది. దాంతో ‘ఇంక్లవ్’ ద్వారా పరిచయమైనవాళ్లు నేరుగా కలుసుకోవడానికి కూడా వేదిక కల్పించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మొదట గురుగ్రామ్‌లో ఓ కెఫేలో ఐదుగురు వ్యక్తులతో తమ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ తరవాత ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్ లాంటి నగరాల్లో 50కిపైగా ఈవెంట్లను నిర్వహించి వికలాంగులను ఒక వేదికపైకి తీసుకొచ్చారు.
ఈ ఈవెంట్ల వల్ల కొన్ని సంస్థలు కూడా వికలాంగుల ప్రాధాన్యాన్ని గుర్తించడం మొదలుపెట్టాయి. ‘కిట్టీ సూ’ నైట్ క్లబ్‌నే తీసుకుంటే, దాని యజమానులు దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల్లో చక్రాల కుర్చీలు ప్రవేశించడానికి అనుగుణంగా మార్పులు చేశారు. వికలాంగులతో సున్నితంగా ఎలా వ్యవహరించాలనే అంశంపైన సిబ్బందికి శిక్షణనూ ఇప్పించారు.
‘ఇంక్లవ్’ తమ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని ఆ యాప్‌ను ఉపయోగించే చాలా మంది చెబుతున్నారు. ఇంక్లవ్ ఈవెంట్ల వల్ల తన ఆత్మవిశ్వాసం పెరిగిందని కృతికా బాలీ అనే యువతి అంటున్నారు.
‘ఈవెంట్లు బానే ఉన్నాయి కానీ, వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి కూడా ఇవి ఉపయోగపడేలా ఏవైనా మార్పులు చేయాలి’ అని శ్రేయ్ మార్వా అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. తక్కువ ఆదాయం ఉండే వికలాంగులకు ఈ యాప్ ఉపయోగపడక పోవచ్చని ఆయన అంటున్నారు.
‘వికలాంగులను సాధారణ వ్యక్తులతో కలపడానికి కూడా ఇది ఉపయోగపడాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ నన్ను వింతగా చూస్తారు. ఆ పరిస్థితి మారాలంటే సామాన్యులకూ మమ్మల్ని ఈ యాప్ దగ్గర చేయగలగాలి. పరిచయాలు పెరిగితే, సంఖ్యా బలం పెరుగుతుంది. దానివల్ల భారీ స్థాయిలో వికలాంగుల జీవితాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉంటుంది’ అన్నది శ్రేయ్ మాట.

కానీ ‘ఇంక్లవ్’ ఉద్యమాలకు ఏమాత్రం కేంద్రంగా మారకూడదన్నది శంకర్ అభిప్రాయం.
‘సమస్యను పరిష్కరించడమే మా ఉద్దేశం. అంతేకానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే ఆలోచన మాకు లేదు. వ్యక్తుల ఆలోచనా ధోరణిపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. మా ఈవెంట్ల ద్వారా అందరిలో సానుకూల ఆలోచనలు తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని శంకర్ చెబుతున్నారు.
‘ఇక్కడ ఇదే సమస్య. వికలాంగులంతా ఉద్యమకారులుగా మారాలని ఎందుకనుకోవాలి? మైనార్టీలుగా ఉన్నవాళ్లంతా తమ సమస్యల కోసం తామే పోరాడాలని అనుకుంటారు. ఇతరులు వారికి సాయం చేయరు కాబట్టే ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఆ పద్ధతి మారాలి’ అని నిపున్ మల్హోత్రా అనే వికలాంగుల హక్కుల కార్యకర్త తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘ఎప్పుడూ సమస్యలేనా? ఒక్కోసారి కేవలం ఓ కప్పు కాఫీ కోసమే ఎదుటివాళ్లను కలిస్తే సరిపోదా?’ అంటారు నిపున్.
ఇవి కూడా చదవండి
- ట్రంప్ తడబడ్డారా? పొరబడ్డారా? మాట మార్చారా?
- డీప్ ఫేక్: పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- నిదా ఖాన్‌ను ఇస్లాం నుంచి ఎందుకు బహిష్కరించారు?
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- పాకిస్తాన్ ఎన్నికలు: హిందూ మహిళలకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు
- చిత్రమాలిక: మానసరోవర్ చూసొద్దాం రండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










