రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

ఫొటో సోర్స్, KCNA
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ సాధారణంగా తమ దేశంలో తనిఖీలు నిర్వహించడానికి వెళ్లినప్పుడు అధికారులను పొగడ్తలతో ముంచేస్తుంటారు. కానీ కొన్ని రోజులుగా ఆయన పద్ధతి మారుతోంది.
ఫ్యాక్టరీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పొలాలు, సైనిక శిబిరాల తనిఖీలకు వెళ్లినప్పుడు అందరి ముందే అధికారులను చెడామడా తిట్టేస్తున్నారు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలాగైన నిలబెట్టాలనే పట్టుదలతో కిమ్ ఉన్నారనీ, అందుకే అధికారుల విషయంలో కఠినంగా మారుతున్నారనీ స్థానిక మీడియో పేర్కొంటోంది.
గత కొన్ని రోజుల్లో కిమ్ తనిఖీలు చేసిన తొమ్మిది ప్రదేశాల గురించి స్థానిక మీడియా కొన్ని ఆసక్తికర విషయాల్ని ప్రచురించింది.
రెండు వారాల క్రితం సినిజు నగరంలోని ఫ్యాక్టరీలను కిమ్ సందర్శించారు. కార్మికుల సంక్షేమాన్ని అక్కడి నాయకులు గాలికొదిలేశారనీ, స్థానిక పేపర్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారనీ మండిపడ్డారు. కొందరిని బహిరంగంగా తిట్టడం ద్వారా మిగతా వారిలో మార్పు తేవడం కిమ్ ఉద్దేశం కావొచ్చని దక్షిణ కొరియా భావిస్తోంది.
2017లో అణ్వాయుధాల అభివృద్ధిపైనే దృష్టిపెట్టిన కిమ్, 2018లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంపైన దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తరచూ ప్రధాన సంస్థలకు వెళ్తూ అక్కడి బాధ్యులకు కొత్త లక్ష్యాలను విధిస్తున్నారు.

ఫొటో సోర్స్, KCNA
షోంగ్జిన్ నౌకా కేంద్రాన్ని సందర్శించిన కిమ్ అక్కడ కొత్త నౌకను నిర్మిస్తున్న కార్మికులను పొగడ్తలతో ముంచేశారు. కానీ ఆ తరవాత ఒరాంగ్చోన్ పవర్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన అధికారులకు తన కోపాన్ని రుచి చూపించారు. నిర్మాణం మొదలై 17ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ పవర్ స్టేషన్ పూర్తవలేదు. స్థానిక నాయకులు పట్టించుకోకపోవడం వల్లే అది పూర్తవలేదనీ, వాళ్లను అనడానికి మాటలు కూడా రావట్లేదనీ కిమ్ చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ఆపైన యోంబున్జిన్‌లోని ఓ హోటల్‌ను సందర్శించిన కిమ్, ఆరేళ్లయినా అక్కడ ప్లాస్టరింగ్ పనులు పూర్తవకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఓన్ఫో హాలిడే క్యాంపును సందర్శించిన కిమ్ అక్కడి బాత్రూమ్‌లు చేపల తొట్టెల కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
చోంగ్జిన్‌లోని బ్యాగ్ ఫ్యాక్టరీలో పర్యటించిన కిమ్, సొంత పార్టీ నేతలపైనే చికాకు ప్రదర్శించారు. వాళ్లలో బాధ్యత, పట్టుదల తగ్గిపోయాయని, ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల తీరు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఉత్తర కొరియా సుప్రీం లీడర్‌గా గత ఆరేళ్ల కాలంలో తమ నేతలపై కిమ్ చేసిన కఠినమైన విమర్శ ఇదేనని భావిస్తున్నారు.
ఎన్నడూ లేని విధంగా అధికారులపై కిమ్ మండిపడుతుండటం స్థానికంగా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక రోడంగ్ సిన్మన్, బుధవారంనాడు మొత్తం పత్రికలోని 12పేజీల్లో 9 పేజీలను కిమ్ పర్యటనలు, ఆయన కోపానికి సంబంధించిన ఘటనలకే కేటాయించింది.

ఫొటో సోర్స్, KCNA
ఉత్తర కొరియా సెంట్రల్ టీవీ కూడా రోజువారీ 20 నిమిషాల ఈవినింగ్ న్యూస్‌ను గంటకు మార్చి, ఒరంగ్చోన్ పవర్ స్టేషన్ వైఫల్యాల గురించే ప్రసారం చేసింది. మరోపక్క కిమ్ పాలనను ప్రతికూలంగా చూపకుండా ఉండేందుకు, గంటపాటు ఆయన హయాంలోని విజయాలను కూడా ప్రసారం చేసింది.
కొందరిని భయపెట్టడం ద్వారా ముఖ్య అధికారుల పనితీరులో మార్పు తేవాలని, ఫలితంగా ఆర్థికంగా లాభదాయకంగా మారే ప్రాజెక్టులు సక్రమంగా పనిచేస్తాయని కిమ్ భావిస్తున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన యోన్హాప్ న్యూస్ అంచనా వేస్తోంది.
‘ఆర్థికంగా అభివృద్ధి చెందాకే ఉత్తర కొరియా తమ విధానాల్లో పారదర్శకతను ప్రదర్శించే అవకాశం ఉంది. అప్పటిదాకా కిమ్ తమ దేశ పరిస్థితి గురించి దాగుడుమూతలు ఆడుతూనే ఉంటారు’ అని యాంగ్ మూ-జిన్ అనే విద్యావేత్త అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Rodong Sinmun
ఇటీవలి కాలంలో చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించిన అనంతరం, ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా ఎంత వెనకబడి ఉందనే విషయంలో కిమ్‌కు ఓ స్పష్టత వచ్చి ఉంటుందనీ, అందుకే ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిని గాడిలో పడేయడమే తన లక్ష్యంగా చేసుకున్నారని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వనరుల కొరత, ఆంక్షల కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలో తనదైన శైలిలో మార్పులు తెచ్చేందుకే ఇలా క్రమం తప్పకుండా దేశవ్యాప్తంగా కిమ్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్కడి మీడియాలో కూడా ఈ ఏడాదిలో మిలిటరీకి సంబంధించిన వార్తల బదులు ఫ్యాక్టరీలు, పచ్చని పొలాలు, సూపర్ మార్కెట్లకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి.
మొత్తంగా ఈ మధ్య కాలంలో ఉత్తర కొరియాలో అధికారుల పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. తప్పు చేసిన వాళ్లు తప్పించుకునే అవకాశం లేదనే సంకేతాలను కిమ్ పర్యటనలు అందిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- ట్రంప్ తడబడ్డారా? పొరబడ్డారా? మాట మార్చారా?
- డీప్ ఫేక్: పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- బీదర్‌లో హైదరాబాదీ హత్య: ‘అనుమానం వస్తే ఇంత దారుణంగా కొట్టి చంపేస్తారా?’ BBC Special రిపోర్ట్
- పాకిస్తాన్ ఎన్నికలు: హిందూ మహిళలకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు
- చిత్రమాలిక: మానసరోవర్ చూసొద్దాం రండి
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- అసలు ఎవరీ కిమ్? ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










