అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలివే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాలుగేళ్ల కిందట తిరుగులేని ఆధిక్యంతో కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తన అయిదేళ్ల పదవీకాలం పూర్తికావడానికి కొద్ది నెలల ముందు లోక్‌సభలో అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
సుమారు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత లోక్‌సభలో మళ్లీ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుండడం.. అది కూడా మొన్నటివరకు మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ అయిన తెలుగుదేశం దీన్ని ప్రవేశపెట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది చర్చనీయమైంది.
కాగా టీడీపీ అవిశ్వాసం పెట్టగా.. 'మాకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారు?' అంటూ కాంగ్రెస్ అతివిశ్వాసం.. 'మాకు సొంతంగా 273 మంది సభ్యులున్నారు' అంటూ బీజేపీ ఆత్మవిశ్వాసం కనబరుస్తుండడంతో శుక్రవారం ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ఫొటో సోర్స్, PIB
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. నిజానికి గత సమావేశాల్లోనూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ అవి చర్చకు రాలేదు.
ఈసారి మాత్రం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించి శుక్రవారం (జులై 20) ఉదయం 11 గంటల నుంచి రోజంతా చర్చ జరిపేందుకు అంగీకరించారు.
చర్చ ముగిసిన తరువాత తీర్మానంపై ఓటింగ్ ఉంటుంది. దీంతో పాలక, విపక్ష కూటమిలోని పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ జారీ చేస్తున్నాయి.
బీజేపీకి సొంతంగానే మెజారిటీ
కాగా అవిశ్వాస తీర్మానంపై పాలక ఎన్డీయేలోని ప్రధాన పార్టీ బీజేపీ ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ప్రస్తుతం సభలో సొంతంగా మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ అవిశ్వాస పరీక్ష నుంచి బయటపడతామని చెబుతోంది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడంతో పాటు తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికింది. దీంతో ఆ పార్టీ యూపీయే కూటమిలోని పార్టీలతో పాటు పలు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కూడా దేశంలోని వివిధ పార్టీల నేతలను కలుస్తూ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం లోక్‌సభలో బలాబలాలు చూస్తే..
దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రస్తుతం లోక్‌సభలో ఎన్నికైన సభ్యులు 533 మంది ఉన్నారు. 10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
533 మంది సభ్యుల్లో సగానికిపైగా అంటే 267 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఈ అవిశ్వాసం నుంచి గట్కెక్కగలదు.
ప్రస్తుతం సభలో బీజేపీకి సొంతంగా 273 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఆ పార్టీ అవసరమైనకంటే మరో ఆరుగురు సభ్యుల బలం కలిగి ఉంది.

ఫొటో సోర్స్, Loksabha.nic.in/bbc
ప్రస్తుతం పాలక ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నిటికీ కలిపి లోక్‌సభలో 314 మంది సభ్యుల బలం ఉంది.
విపక్ష యూపీయేలోని సభ్య పార్టీలకు 66 మంది ఎంపీలున్నారు.
ఈ రెండు కూటమిల్లోనూ లేని పార్టీలకు 153 మంది సభ్యులున్నారు. దీంతో ఎలా చూసుకున్నా ఎన్డీయేకు సంపూర్ణ మెజారిటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
టీడీపీ స్వరం వినపడుతుందా?
అవిశ్వాసంపై చర్చ సందర్భంలో పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి వారికి మాట్లాడే సమయం కేటాయించనున్నారు. దీని ప్రకారం 273 మంది సభ్యులున్న బీజేపీకి అత్యధిక సమయం మాట్లాడే అవకాశం దక్కనుంది.
దీంతో విభజన హామీల అమలు, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమేం చేసిందనేది చెప్పడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
16 మంది సభ్యులతో సంఖ్యాబలం పరంగా సభలో ఏడో స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి లభించే సమయం తక్కువే. అయితే.. అవిశ్వాసం పెట్టిన పార్టీగా తమకు ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని.. తమ గళం వినిపిస్తామని, ఏపీకి కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎండగడతామని టీడీపీ నేతలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీకి చేరువ ఎవరు? దూరమెవరు?
తాజా అవిశ్వాస ఘట్టంలో ఏపీలోని ప్రధాన పార్టీలు దేనికవి తాము బీజేపీకి దూరంగా ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్.. రెండు పార్టీలూ ఒకదానిపై ఒకటి ఒకే తరహా ఆరోపణ చేస్తున్నాయి.
వైసీపీ ఎంపీల రాజీనామా తరువాత ఈ సమావేశాల్లో అవిశ్వాసానికి ఆమోదం తెలిపి ఆ పార్టీకి ఇబ్బందుల్లేకుండా చూశారని.. వైసీపీ, బీజేపీల కుమ్మక్కుకు ఇదే ఉదాహరణని టీడీపీ ఆరోపిస్తుండగా.. గత సమావేశాల్లో తాము 13సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చినా పట్టించుకోకుండా ఇప్పుడు సభలో తమ ఎంపీలు లేని సందర్భంలో టీడీపీ ఇచ్చిన అవిశ్వాసాన్ని చర్చకు అనుమతించారని.. బీజేపీ, టీడీపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని వైసీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ఇలా ఎవరికి వారు తాము బీజేపీకి దూరం అని చెప్పుకునే ప్రయత్నం చేయడం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, facebook/raghuram purighalla
'రాష్ట్రం కోసం కాదు కాంగ్రెస్ కోసం అవిశ్వాసం పెట్టారు'
పాలక ఎన్డీయే కూటమి, అందులోని ప్రధాన పార్టీ బీజేపీకి సభలో స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేపెట్టడం కేవలం ప్రజలను మోసం చేయడానికేనని 'దిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త' రఘురాం పురిఘళ్ల 'బీబీసీ'తో అన్నారు.
విపక్షానికి అనుకూలంగా ఉన్న పార్టీలన్నిటికీ కలిపి సుమారు 145 మంది సభ్యుల బలం ఉందని.. అన్నాడీఎంకే, టీఆరెస్, బీజేడీ వంటి తటస్థ పార్టీలకు సుమారు 80 మంది సభ్యులున్నారని రఘు చెప్పారు.
అదేసమయంలో ఎన్డీయే పార్టీల బలం 311కి పైగా ఉందని చెప్పారు. పైగా ఎన్డీయే పార్టీలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని తెలిపారు. శివసేన వంటి పార్టీ విధానపరంగా అప్పుడప్పుడు కస్సుబుస్సులాడినా ప్రభుత్వంపై అవిశ్వాసం విషయానికొచ్చేసరికి వారు కచ్చితంగా విశ్వాసం ప్రకటిస్తారని చెప్పారు.
కాంగ్రెస్ అజెండాను అమలుచేస్తూ, వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఈ అవిశ్వాసాన్ని పెట్టడం అనైతికమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక అజెండా పెట్టుకుని తెలుగుదేశాన్ని ముందు పెట్టి ఈ అవిశ్వాసం పెట్టించిందని ఆయన ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో అంతా చెప్తాం, ఏపీ అభివృద్ధిలో మా పాత్రేమిటో ప్రధానమంత్రి, మా మంత్రులు కచ్చితంగా చెప్తారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని ఆయన అన్నారు.
'చంద్రబాబు పతనానికి ఈ అవిశ్వాసమే నాంది'
ఏపీలో బీజేపీ అభివృద్ధికి ఈ అవిశ్వాసం మంచి అవకాశమని.. అవిశ్వాసం నుంచి గట్టెక్కి ఆ ఆత్మవిశ్వాసంతో ఏపీలో టీడీపీపై పోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబు పతనానికి ఈ అవిశ్వాసమే నాంది అని రఘు అన్నారు.

పార్లమెంటులోనే తేల్చుకుంటాం
పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించడానికి ఇది మంచి అవకాశమని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహననాయుడు అన్నారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళనలు చేస్తున్నా ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆయన విస్మరించారని అన్నారు. విభజన హామీల అమలు కోసం ఎన్నిసార్లు అడిగినా ప్రధాని నుంచి స్పందన లేదని, ఈ అవిశ్వాసం సందర్భంగా మోదీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కల్పించామన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీలు మద్దతు పలుకుతున్నాయని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై దేశంలోని ఇతర పార్టీలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఫొటో సోర్స్, facebook.YSJaganmohanreddy
'అప్పుడు హోదా వద్దని ఇప్పుడు అవిశ్వాసం'
'ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజీ మాకు సమ్మతమే అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టింది. చర్చ జరిగినప్పుడు బీజేపీ ఇదే విషయంపై టీడీపీని నిలదీస్తుంద'ని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బీబీసీతో అన్నారు. తమ పార్టీ గత సమావేశాల్లో అవిశ్వాసం పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు తమ అవిశ్వాస తీర్మానాలను ఆమోదించకుండా తమ ఎంపీల రాజీనామాల తరువాత ఇప్పుడు టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని అనుమతించడం ఆ రెండు పార్టీల రహస్య బంధానికి నిదర్శనమన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అవిశ్వాస తీర్మానం: అంటే ఏమిటి? ఏం జరుగుతుంది?
అవిశ్వాస తీర్మానం అంటే.. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం (మంత్రివర్గం/ప్రభుత్వం) కానీ ఆ అధికారాన్ని లేదా పదవిని నిర్వర్తించటానికి అనర్హులని తాము భావిస్తున్నట్లు ప్రవేశపెట్టే తీర్మానం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నియమిత ప్రభుత్వం మీద ఎన్నికయిన పార్లమెంటుకు ఇక విశ్వాసం లేదని చెప్పే తీర్మానం.
అయితే భారత రాజ్యాంగంలో విశ్వాస తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ.. మంత్రి మండలి ఉమ్మడిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణ స్పష్టంచేస్తోంది. అంటే.. ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలిని లోక్‌సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించరాదని దీనర్థంగా చెప్పుకోవచ్చు.
భారతదేశంలో పార్లమెంటు దిగువ సభ, ప్రత్యక్షంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు గల లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన.. అవిశ్వాస తీర్మానం విధివిధానాలను నిర్దేశిస్తోంది.
దీనిప్రకారం.. లోక్‌సభ సభ్యుడు ఎవరైనా సరే రాతపూర్వకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వవచ్చు. స్పీకర్ ఈ అవిశ్వాస తీర్మానం నోటీసు నిర్దేశిత విధానంలో ఉందని భావిస్తే దానిని సభలో చదవాలి. దీనిని చర్చకు చేపట్టటానికి మద్దతు ఇచ్చేవారందరూ నిలబడాలని కోరాలి.
అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీలు మద్దతు లభించకపోతే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టటానికి కనీసం 50 మంది ఎంపీలు మద్దతు తెలిపినట్లయితే.. స్పీకర్ తీర్మానాన్ని స్వీకరించి, దానిపై చర్చకు ఒక తేదీ లేదా తేదీలను నిర్ణయిస్తారు. ఆ తేదీ.. నోటీసు ఇచ్చిన పది రోజుల లోపే ఉండాలి.
ఈ తీర్మానంపై చర్చలో ప్రసంగాలకు స్పీకర్ అవసరమని భావిస్తే కాలపరిమితి కూడా నిర్ణయించవచ్చు. ఈ చర్చలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వారు, దానికి మద్దతు ఇచ్చిన వారు ప్రసంగిస్తారు. ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు సాధారణంగా ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం ఇస్తారు.
ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. మూజువాణి ఓటు ద్వారా కానీ, సభ్యుల విభజన ద్వారా కానీ ఈ ఓటింగ్ ఉండవచ్చు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే.. ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది.


ఫొటో సోర్స్, Getty Images
అవిశ్వాసాల చరిత్ర
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పెట్టిన ఈ అవిశ్వాసం లోక్‌సభ చరిత్రలో 27వది. పదిహేనేళ్ల కిందట 2003 ఆగస్టులో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టింది. ఈ పరీక్షలో వాజ్‌పేయి సులభంగానే గట్టెక్కారు. ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఈ అవిశ్వాసం పెట్టింది.
రెండుసార్లు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్న వాజ్‌పేయి అంతకుముందు 1999లో అవిశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అవిశ్వాసాల్లో 23 కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టినవి.
ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నారు.
లోక్‌సభ చరిత్రలో తొలిసారి సోషలిస్ట్ నేత ఆచార్య కృపలానీ 1963లో జవహర్ లాల్ నెహ్రూపై అవిశ్వాసం పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- LIVE అవిశ్వాస తీర్మానం: అప్పట్లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామన్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- ‘మీరు నన్ను పప్పూ అన్నా.. మీపై నాకు ద్వేషం లేదు’.. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇంకేమన్నారంటే
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
- సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
- రాహుల్ ముందున్న అతిపెద్ద సవాళ్లు!
- ‘దేశంలో పార్లమెంట్ అవసరం తీరిపోయిందా?’
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- టీడీపీ మరో శివసేన అవుతుందా?
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









