లోక్‌సభ ఎన్నికలు 2019: ముస్లింలు ఈసారి బీజేపీకి ఓటేశారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రొఫెసర్ సంజయ్ కుమార్
- హోదా, సీఎస్‌డీఎస్ డైరెక్టర్
తాజా ఎన్నికల్లో బీజేపీ గెలిచినట్లుగా.. ఒక పార్టీ భారీ మెజార్టీ సాధించినప్పుడు, ఆ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని, ఓడిన పార్టీకి ఏదీ కలిసిరాలేదని చాలామంది భావిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల కూటమిని ఎదుర్కొని బీజేపీ మెజార్టీ సీట్లు సాధించడం ఆ వాదనకు మరింత బలం చేకూరింది.
ఉత్తరప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 40 శాతం, 2019లో అది 49 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికల్లో ముస్లింలలో చాలామంది ఓట్లు బీజేపీకే పడ్డాయని, ఆ పార్టీ భారీ విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమని కొందరు బలంగా వాదిస్తున్నారు.
ముస్లింలలో పురుషులు బీజేపీకి ఓటు వేయకపోయినా, మహిళలు మాత్రం ఉత్తరప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీకే ఓటు వేసి ఉంటారని చాలామంది అభిప్రాయం. అందుకు ప్రధాన కారణం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు అని చెబుతారు. ఆ బిల్లును పార్లమెంటులో పాస్ చేయడం పట్ల ముస్లిం మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని అంటారు.
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది.
ముస్లింల ఓట్లు 10 శాతానికి లోపు ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీకి పోలైన ఓట్లు 34.9 శాతం కాగా... ముస్లింల ఓట్లు 10 నుంచి 20 శాతం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు షేర్ 39.2 శాతంగా ఉంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ముస్లింల ఓట్లు 20 నుంచి 40 శాతం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు షేర్ అదే స్థాయిలో 43.8 శాతానికి పెరిగింది.

ఫొటో సోర్స్, AFP
పైన పేర్కొన్న లెక్కలు చూస్తుంటే ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లింలు బీజేపీ వైపు మొగ్గు చూపడం వల్లే ఆ పార్టీ ఓటు షేర్ పెరిందని చాలామంది ఒక అంచనాకు వచ్చేస్తారు.
అయితే, ట్రిపుల్ తలాక్ బిల్లు కారణంగా బీజేపీ పట్ల ముస్లిం మహిళలు సానుకూలంగా ఉండటం నిజమే కావొచ్చు, కానీ... బీజేపీకి గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ముస్లింల ఓట్ షేర్ పెద్దగా పెరిగినట్లు కనిపించడంలేదని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే చెబుతోంది.
1996 నుంచి (2009 మినహా) 2014 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 7 నుంచి 8 శాతం మంది ముస్లింలు ఓటు వేశారని పోస్ట్ పోల్ సర్వే అంచనాలు చెబుతున్నాయి. 2009లో 4 శాతం ముస్లింలు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎస్‌డీఎస్ సర్వే ప్రకారం, దేశవ్యాప్తంగా చూస్తే 2014 ఎన్నికల్లో బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌కు ముస్లింల మద్దతు అధికంగా ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వారి మద్దతు తగ్గింది, బీజేపీకి అలాగే ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీకి 8 శాతం, కాంగ్రెస్‌కు 33 శాతం మంది ముస్లింలు ఓటు వేశారని అంచనా. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వైపే ముస్లింలు మొగ్గు చూపారు.
ముస్లిం మహిళల్లో ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారని చెప్పడం వాస్తవం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే, సీఎస్‌డీఎస్ పోస్ట్ పోల్ సర్వే డేటా ప్రకారం, తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ముస్లిం పురుషులు, మహిళల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేదు.
గ్రామాలు, చిన్న పట్టణాలు, నగరాల వారీగా మాత్రమే ముస్లింల ఓటింగ్ సరళిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా చాలావరకు పట్టణ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేశారు, ప్రాంతీయ పార్టీల వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు.
అయితే, దేశవ్యాప్తంగా బీజేపీ వైపు ముస్లింలు మొగ్గు చూపినట్లు కనిపించకున్నా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి రాజకీయాల్లో భాగంగా కొంత మార్పు కనిపించింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తప్పించి... బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు నడిచిన రాష్ట్రాల్లో ఎక్కువ మంది ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో 15 నుంచి 20 శాతం మంది ముస్లింలు బీజేపీకి ఓటు వేశారు. అయితే, ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ద్విముఖ పోటీ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి ముస్లింల మద్దతు ఎక్కువగానే ఉండేది, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట తక్కువగా పడేది.
*ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ప్రస్తుతం సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ కథనంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.
ఇవి కూడా చదవండి
- తెలంగాణకు ఐదేళ్లు: విలీనం నుంచి విభజన దాకా..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు...
- కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు?
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యానికి ముప్పుందా?
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









