అరవింద్ కేజ్రీవాల్: దిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

దిల్లీ మెట్రోలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో డీటీసీ (దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్), క్లస్టర్ బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఈమేరకు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రకటన చేశారు.

‘‘ప్రభుత్వ రవాణా వ్యవస్థ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) మహిళలకు చాలా సురక్షితం అని అంటుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. డీటీసీ, క్లస్టర్ బస్సులు.. అన్ని బస్సుల్లోనూ, మెట్రో రైళ్లలోనూ మహిళల ప్రయాణాన్ని ఉచితం చేస్తుంది. దీంతో మహిళలు ఎక్కువగా ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగిస్తారు’’ అని ప్రకటించారు.

రాబోయే రెండు, మూడు నెలల్లో ఈ ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. టిక్కెట్ కొని ప్రయాణించాలనుకునే మహిళలు.. టిక్కెట్ కొనుగోలు చేసి కూడా ప్రయాణించొచ్చునని, తద్వారా ఆ సబ్సిడీ అర్హులైన ఇతర మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పారు.

కాగా, బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల పడే భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.

కేజ్రీవాల్: మహిళలకు ఉచిత రవాణా

ఈ ఏడాది ఈ ఉచిత ప్రయాణం కోసం రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకూ కేటాయించాల్సి వస్తుందని దిల్లీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని దిల్లీ మెట్రోకు తెలియజేశామని, మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు.

దిల్లీ ప్రభుత్వ బస్సుల్లో దాదాపు 40 లక్షల మంది ప్రయాణిస్తారని, వారిలో 30 శాతం మహిళలు ఉంటారని అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)