మెట్రో రైలులో నిండు గర్భిణి మీద సెక్యూరిటీ గార్డుల దాడి

ఫొటో సోర్స్, ACTION4HUMANITY
మెట్రో రైలులో నిండు గర్భిణీ మీద సెక్యూరిటీ గార్డులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన స్వీడన్‌లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలోని మెట్రోలో తన కూతురుతో పాటు ప్రయాణిస్తున్న ఆ మహిళ వద్ద టికెట్ లేదని అధికారులు చెబుతున్నారు.
ఆమెకు, సెక్యూరిటీ గార్డులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత ఆమెను రైలు నుంచి బయటకు ఈడ్చుకొచ్చి బల్ల మీద పడేశారు. ఈ ఘటనలో గాయపడిన గర్భిణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆ దాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు గార్డులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దానిపై సమగ్ర విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
"మెట్రోలో జరిగిన ఈ దాడికి సంబంధించి పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళ మీద సెక్యూరిటీ గార్డులు జులుం ప్రదర్శిస్తున్నట్లుగా ఆ వీడియోల్లో కనిపిస్తోంది" అని రవాణా సేవల విభాగం అధికారి ఒకరు స్వీడన్ మీడియాతో చెప్పారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అనేకమంది షేర్ చేశారు. నల్లజాతి మహిళ కావడం వల్లే ఆమె మీద గార్డులు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పలువురు ఆరోపించారు.
తల్లి మీద సెక్యూరిటీ గార్డులు తమ జులుం ప్రదర్శిస్తుండగా.. ఆమె కూతురు బోరున ఏడుస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, LOVETTE JALLOW/INSTAGRAM
'నల్లజాతీయుల మీద హింస'
ఆఫ్రికా మూలాలున్న స్వీడిష్ ప్రజల మీద ఇలాంటి దాడులు జరగడం కొత్తేమీ కాదని సీనియర్ పాత్రికేయురాలు లొవెట్టే జాల్లో అన్నారు.
"ఎవరైనా ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘించినవారిని బయటకు పంపించడం, లేదా అదుపులోకి తీసుకోవడం సెక్యూరిటీ గార్డులు చేయాల్సిన పని. ఈ దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నాం" అని రవాణా సంస్థ బీబీసీకి తెలిపింది.
"మాకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. ఆ మహిళ టికెట్ లేకుండా ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. దాంతో జరిమానా చెల్లించాలని మా సిబ్బంది కోరగా.. ఆమె నిరాకరించారు. తర్వాత మా నిబంధనల ప్రకారం, మెట్రో దిగి వెళ్లిపోవాలని ఆమెను కోరారు. ఆమె దానికి కూడా నిరాకరించారు. అనంతరం ఆమెను మా సిబ్బంది తీసుకెళ్తుండగా.. ఆమె ఏడుస్తూ.. ప్రతిఘటించారు" అని రవాణా సంస్థ అధికార ప్రతినిధి వివరించారు.
గతంలోనూ ఈ మెట్రోలో సెక్యూరిటీ గార్డులు ఇలాగే భౌతిక దాడులకు పాల్పడ్డారని స్వీడన్‌కు చెందిన జాతి వివక్ష వ్యతిరేక సంస్థ ఆక్షేపించింది.
"నల్ల జాతీయుల మీద అకారణంగా.. ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ గార్డులు దాడులు చేస్తున్నారడానికి అనేక ఆధారాలు ఉన్నాయి" అని ఆ సంస్థ అధ్యక్షులు అలాన్ అలీ అన్నారు.
జాతి వివక్ష గురించి, గర్భిణులతో ఎలా మెలగాలన్న విషయాల గురించి మెట్రో సిబ్బందికి, సెక్యూరిటీ గార్డులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








