బడ్జెట్: దేశ రక్షణకు యూపీఏ కన్నా ఎన్‌డీఏ ప్రభుత్వం మెరుగ్గా ఇచ్చిందా?

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులపై విశ్లేషణలోకి వెళ్లబోయే ముందు చరిత్రకారుడు జెఫ్రీ బ్లైనీ చెప్పిన ఓ మాటను గుర్తుతెచ్చుకుందాం.

'''సాధారణంగా యుద్ధంలో ఉన్న దేశాలు వాటి బలం మధ్య వ్యత్యాసాన్ని అంగీకరిస్తే యుద్ధం ముగుస్తుంది. ఏవైనా రెండు దేశాలు వాటి బలం మధ్య వ్యత్యాసాన్ని అంగీకరించకపోతే యుద్ధం మొదలవుతుంది'' అని ఆయన రాశారు.

పరస్పర సన్నిహిత సంబంధాలున్న, అణ్వస్త్ర దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో భారత్‌కు సరిహద్దు ఉంది. ఈ దేశాలకు, భారత్‌కు మధ్య గతంలో యుద్ధాలు కూడా జరిగాయి. ఈ దేశాలకు, భారత్‌కు మధ్య అపరిష్కృత అంశాలు ఉన్నాయి. భద్రత పరంగా భారత్‌కున్న పరిస్థితులు ప్రత్యేకమైనవి. సైనిక జోక్యం అవసరమయ్యే అవకాశమున్న అంతర్గత భద్రతా సవాళ్లను కూడా భారత్ ఎదుర్కొంటోంది.

సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

భారత సైనిక సామర్థ్యాలు తగ్గాయనే లేదా బలహీనంగా ఉన్నాయనే భావన భారత్‌ను ప్రత్యర్థిగా భావించే దేశాలను సైనిక చర్య దిశగా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. గతానుభవాలు దీనిని సూచిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే 10 లక్షల మందికి పైగా ఉన్న భారత సైనిక బలగాలు మెరుగైన వనరులు, ఎక్కువ వనరులు కావాలని కోరుకొంటాయి.

2014 మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పూర్తిస్థాయి రక్షణశాఖ మంత్రి ఎవరూ లేరు. ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీయే రక్షణ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ పరిణామం నిధుల పరంగా రక్షణ శాఖకు మేలు చేస్తుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తంచేశారు.

అరుణ్ జైట్లీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అరుణ్ జైట్లీ

తర్వాత ఏం జరిగింది?

  • 2014 జులై 10న అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రక్షణశాఖకు రూ.2,33,872 కోట్లు కేటాయించారు. 2014 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల కన్నా ఇది రూ.5 వేల కోట్లకు పైగా ఎక్కువ. 2013-14 కేటాయింపులతో పోలిస్తే పెరుగుదల దాదాపు 9 శాతం.
  • ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి పూర్తికాల బడ్జెట్‌ను 2015 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టింది. రక్షణశాఖకు రూ.2,55,443 కోట్లు కేటాయించారు. అంతకుముందు బడ్జెట్‌తో పోలిస్తే పెరుగుదల దాదాపు 9 శాతం.
  • 2016 ఫిబ్రవరి 29న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణశాఖకు చేసిన కేటాయింపులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
  • రక్షణశాఖకు రూ.2,58,502 కోట్లు కేటాయించినట్లు తర్వాత వెల్లడైంది. 2015 నాటి బడ్జెట్‌తో పోలిస్తే 2016లో పెరుగుదల కేవలం రెండు శాతమే.
  • 2016 బడ్జెట్‌కు రెండున్నర నెలల ముందు 2015 డిసెంబరు 15న విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై 'కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్'లో ప్రధాని నరేంద్ర మోదీ, సైన్యం ఆధునికీకరణపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ''శక్తిమంతమైన దేశాలు వాటి సైనిక బలగాల సంఖ్యను తగ్గించుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. మనమేమో ఇప్పటికీ మన బలగాల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్నాం. సైన్యం ఆధునికీకరణ, బలగాల పెంపు ఒకేసారి చేపట్టడం కష్టమవుతుంది, అలాంటి లక్ష్యం పెట్టుకోవడం అనవసరం కూడా'' అని ప్రధాని మోదీ చెప్పారు.
సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

  • 2017 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.2,74,114 కోట్లు కేటాయించారు. ముందు సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే ఈ పెరుగుదల ఆరు శాతం మాత్రమే. రక్షణశాఖ నిధులు సమకూర్చే 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్(ఐడీఎస్ఏ)' కోసం రీసర్చ్ ఫెలో లక్ష్మణ్ కె.బెహరా రాసిన ఒక వ్యాసంలో రక్షణ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేటాయింపులు ఏ మాత్రం చాలవని వ్యాఖ్యానించారు.
  • నిరుడు ఫిబ్రవరి 1న పెట్టిన బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.2,95,511 కోట్లు ఇచ్చారు. 2017 బడ్జెట్‌తో పోలిస్తే పెంపు ఎనిమిది శాతంగా ఉంది.
  • 2019-20లో తొలిసారిగా రక్షణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటనుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రక్షణకు రూ.3,18,847 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్‌ కన్నా ఎనిమిది శాతం అదనంగా కేటాయింపులు జరిగాయి.
సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

మరి రక్షణ శాఖకు ఎవరు మెరుగ్గా నిధులు కేటాయించారు?

ఈ అంశంపై రక్షణ శాఖ మాజీ ఆర్థిక సలహాదారు(కొనుగోళ్లు) అమిత్ కౌశిష్ స్పందిస్తూ- దాదాపు 15 ఏళ్లుగా యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు దాదాపు ఒకే విధంగా కేటాయింపులు చేస్తున్నాయన్నారు. అవసరమని చెబుతున్నదానికి, చేస్తున్న కేటాయింపులకు మధ్య అంతరం ఉందని చెప్పారు. ''ఆయా సందర్భాల్లో ఈ అంతరం పెరగడం లేదా తగ్గడం జరిగిందేగాని పూడలేదు'' అని వ్యాఖ్యానించారు.

సైనిక ఉన్నతాధికారులు, పార్లమెంటేరియన్ల (బీజేపీ నాయకులు సహా) కోణంలో చూస్తే మోదీ హయాంలో రక్షణ బడ్జెట్ ఒక ఇబ్బందికరమైన అంశంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

వీరిలో కొందరి వ్యాఖ్యలు:

''స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వాటా ప్రకారం చూస్తే రక్షణ బడ్జెట్ తగ్గినప్పటికీ, కేటాయింపులను సంఖ్యాపరంగా చూస్తే ఇది పెరుగుతూ వస్తోంది. అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామనే హామీని ప్రభుత్వం మాకు ఇచ్చింది. కేటాయింపులు మరింత వేగంగా పెరిగి ఉంటే బాగుండని మేం భావిస్తున్నాం. కానీ ప్రభుత్వానికి ఇతర ప్రాథమ్యాలు కూడా ఉన్నాయి. ఈ విషయం మాకు తెలుసు.''

-అడ్మిరల్ సునీల్ లాంబా, నౌకాదళ అధిపతి (2018 నవంబరు)

''1962 భారత్-చైనా యుద్ధం తర్వాత రక్షణ బడ్జెట్ ఎన్నడూ లేనంత తక్కువగా (2018 ) జీడీపీలో కేవలం 1.56 శాతంగా ఉంది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల్లో భారత్ లాంటి పెద్ద దేశం రక్షణ అవసరాల పట్ల ఉదాశీనత వహించరాదు'' -బీజేపీ సీనియర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని అంచనాల కమిటీ (2018 జులై)

సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

''2018-19 బడ్జెట్ మా ఆశలను ఆవిరి చేసింది. మేం సాధించినదానికి చిన్న ఎదురుదెబ్బ కూడా తగిలింది. 2017లో ఇచ్చిన హామీలు ఈసారి కూడా నెరవేరలేదు. ఇది పరిస్థితిని జటిలం చేస్తుంది''

-రక్షణపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘంతో సైనిక దళాల ఉప ప్రధానాధికారి (2018 మార్చి)

''గత కొన్నేళ్లలో వైమానిక బడ్జెట్ వాటా గణనీయంగా తగ్గింది. వైమానిక దళ ఆధునికీకరణకు కీలకమైన 'క్యాపిటల్ హెడ్' కింద కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. 2007-08 రక్షణ బడ్జెట్‌లో వీటి వాటా దాదాపు 17.51 శాతం కాగా, 2016-17 నాటికి ఇది 11.96 శాతానికి క్షీణించింది'' -రక్షణశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం (2018 మార్చి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)