క్వీన్ నీలగిరి: ఆకుపచ్చని ప్రపంచంలో అందాల రాణి

నీలగిరి క్వీన్
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్వీన్ నీలగిరి... దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా, అద్భుత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా వెలుగులీనుతోంది. ఇందులో ప్రయాణమంటే ప్రకృతి ఒడిలో పరవశించడమే కాదు, ఓ వందేళ్లు వెనక్కి వెళ్లడం కూడా.

ఎటుచూసినా దట్టమైన అరణ్యాలు, మబ్బులను ముద్దాడే పర్వతాలు, లోయలు, జలపాతాలు.. అన్నిటినీ తనలో నింపుకొన్న నీలగిరి ఓ అందమైన ఆకుపచ్చని ప్రపంచం. నీలగిరి మౌంటైన్ రైల్వే (ఎన్‌ఎంఆర్) ఈ ప్రపంచానికి అందమైన మణిహారం.

భారతదేశంలో ప్రస్తుతం మూడు అరుదైన మౌంటైన్ రైల్వేలు ఉన్నాయి. అందులో ఎన్‌ఎంఆర్ ఒకటి. ఈ మూడింటిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో 2005లో గుర్తించింది. అంతేకాదు భారతదేశంలోని ఏకైక రాక్ అండ్ పినియన్ మార్గం కూడా ఇదే. అంటే రైలు కొండలు ఎక్కేటప్పుడు వాలులో వెనక్కి జారిపోకుండా ఇది చూస్తుంది.

వంతెన మీద పోతున్న నీలగిరి రైలు

250 వంతెనలు

తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఉన్న ఈ రైలు తన ప్రయాణంలో 250 వంతెనలు, 108 వంపులు, 16 సొరంగాల గుండా పోతుంది. మెట్టుపళయం వద్ద ప్రారంభమై ఒక్కో పర్వతాన్ని అధిరోహిస్తూ హనీమూన్ సిటీ ఊటీ (ఉదగమండలం) చేరుతుంది.

దాదాపు 46 కిలోమీటర్లు ఉండే ఈ ప్రయాణం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచడంతోపాటు ఉత్సాహాన్ని ఇస్తుంది. మెట్టుపళయం సముద్రమట్టానికి దాదాపు 1,000 అడుగుల ఎత్తులో ఉంటే, ఊటీ సుమారు 7,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

నీలగిరి కొండల అందాలు

విహారం.. వ్యాపారం..

తమిళనాడులోని నీలగిరి కొండలు ఆకుపచ్చని అందాలకే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పేరుగాంచినవి. బ్రిటన్ మాదిరే చల్లగా ఉండే ఈ ప్రదేశం బ్రిటీష్ అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. అధికారులు, వారి కుటుంబాలు వేసవి తాపం తీర్చుకునేందుకు అక్కడకు వెళ్లేవారు. దట్టమైన అరణ్యాలు, ఎత్తైన పర్వతాల మధ్య ప్రయాణం అంత సులభం కాదు. అప్పటికే కోయంబత్తూర్‌కు దగ్గరగా ఉండే మెట్టుపళయం వరకు రైలు మార్గం ఉంది. దీన్ని ఊటీకి దగ్గరగా ఉండే కున్నుర్ వరకు విస్తరించాలని నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి 1854లో తొలి ప్రతిపాదన సిద్ధమైంది. అయితే అన్ని అవాంతరాలు దాటుకొని నిర్మాణం పూర్తికావడానికి 45 సంవత్సరాలు పట్టింది. 1899 జూన్ 15న మెట్టుపళయం-కున్నుర్ మధ్య ఎన్‌ఎంఆర్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత 1908లో కున్నుర్ నుంచి ఊటీ వరకు దీన్ని విస్తరించారు.

కున్నుర్ రైల్వే స్టేషన్
ఫొటో క్యాప్షన్, బ్రిటీష్ కాలంలో నిర్మించిన కున్నుర్ రైల్వే స్టేషన్

ఈ రైలు మార్గాన్ని బ్రిటిషర్లు తమ వ్యాపార అవకాశాలకు కూడా వాడుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఊటీ చుట్టుపక్కల ప్రాంతంలో తేయాకును సాగు చేసేవాళ్లు. ఈ తేయాకును తరలించేందుకు కూడా రైలు బాగా ఉపయోగపడింది.

నాటి రైల్వే స్టేషన్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఈ మార్గంలో అడుగడుగునా అప్పటి గుర్తులు కనిపిస్తాయి. స్టీమ్ ఇంజిన్, ఐరోపా తరహా రైలు బోగీలు, మీటర్ గేజ్ ట్రాక్, ఐరోపా నిర్మాణ శైలి, అలనాటి వంతెనలు ఇలా ఎన్నో గత కాలాన్ని గుర్తుకుతెస్తాయి.

వీడియో క్యాప్షన్, హనీమూన్ ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దామా?

హనీమూన్ ట్రైన్

నీలగిరి మౌంటైన్ రైలులో ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని పంచుతుంది. ప్రధానంగా స్టీమ్ ఇంజిన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. విఠలాచార్య సినిమాల్లో రాక్షసుల నోరు, చెవుల నుంచి వచ్చే మంటల మాదిరిగా స్టీమ్ ఇంజిన్ నుంచి వచ్చే ఆవిర్లు, పొగలు గమ్మత్తుగా ఉంటాయి. చుక్‌చుక్ మంటూ సాగే ఆ శబ్దం ఓ సంగీతంలా వినిపిస్తుంది.

పచ్చని ప్రకృతిలో ఆకాశాన్ని తాకే పర్వతాల మధ్య మబ్బులను ముద్దాడుతూ పోయే ఈ రైలులో ప్రయాణం ఆహ్లాదం, ఆనందాన్ని పంచుతుంది. ఊటీకి హనీమూన్‌ కోసం వచ్చే జంటలు, ప్రేమికులు ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. అందువల్ల దీన్ని హనీమూన్ ట్రైన్ అని కూడా అంటారు.

ఏడాదికి సుమారు 6 లక్షల మంది ఈ రైలులో ప్రయాణిస్తారు.

నీలగిరి కొండల్లోని అడవి దున్న

ఫొటో సోర్స్, Facebook/Vasanthan Panchavarnam

బాహుబలి దున్నలు

నీలగిరి అడవులు అనేక వన్యప్రాణులకు ఆలవాలం. చిరుత పులులు, అడవి దున్నలు, ఏనుగులు ఇలా ఎన్నో జీవులు ఇక్కడ ఉంటాయి. ఒకోసారి ఏనుగులు రైల్వే ట్రాక్ దాటుతూ కనిపిస్తుంటాయి. మరోసారి నీళ్ల కోసం రైల్వే స్టేషన్లకు వస్తుంటాయి. బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడు పోరాడే అడవి దున్నల్లాంటివి ఇక్కడ చాలా కనపడతాయి.

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, Twitter/Shah Rukh Khan

షారూక్ ఆటాపాటా

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు కూడా ఈ రైలుతో అనుబంధం ఉంది. 1998లో వచ్చిన దిల్‌సే సినిమాలో 'చల్ చయ్యా చయ్యా.. చయ్యా చయ్యా చల్.. చయ్యా' అనే పాటను ఈ రైలుపైనే చిత్రీకరించారు. బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ క్వీన్ నీలగిరి మెరిసింది. థామస్ అండ్ ఫ్రెండ్స్ (ది గ్రేట్ రైల్వే షో) యానిమేటెడ్ సిరీస్‌ అషీమాలో అనే పాత్రకు క్వీన్ నీలగిరిని తీసుకున్నారు.

(ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్, షూట్ ఎడిట్: నవీన్ కుమార్.కె, డ్రోన్ కెమేరా: బాలా(బీబీసీ కోసం))

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)