దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధ్యం కాదు: సుప్రీంకోర్టు

ఎల్జీ అనిల్ బైజల్‌

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, పరిపాలన పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని సూచించింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ల మధ్య నెలకొన్న అధికార హోదా వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.

ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2017 డిసెంబర్‌ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.

సీజేఐ దీపక్ మిశ్రా, ఏకే సిక్రి, ఏఎం ఖన్విల్కర్‌‌లు ఒక తీర్పు ఇవ్వగా, దానిని దీపక్ మిశ్రా చదువుతున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ తీర్పులో సీజేఐ ఏమన్నారంటే..

  • రాజ్యాంగాన్ని గౌరవించటం, దాని ప్రకారం నడుచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత, విధి.
  • లెఫ్టినెంట్ గవర్నర్ తన ఇష్టానుసారం వ్యవహరించలేరు. క్యాబినెట్ సలహా, సంప్రదింపులతోనే వ్యవహరించాలి.
  • గతంలో తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వటం సాధ్యం కాదు.

ధర్మాసనంలో మిగతా ఇద్దరు సభ్యులైన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, అశోక్‌ భూషణ్‌లు తమ తీర్పులను వేరుగా ప్రకటించారు.

వారు ఏమన్నారంటే..

  • జస్టిస్ చంద్రచూడ్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే వ్యక్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించకూడదు. ఆర్టికల్ 239లో పేర్కొన్నవి కాకుండా ఆయనకు మరే ఇతర స్వతంత్ర అధికారాలు లేవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది.
  • జస్టిస్ అశోక్‌ భూషణ్‌: రాష్ట్ర ప్రభుత్వం తాను తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నివేదించాలి. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం అవసరం లేదు. తాను విభేదించిన ప్రతి అంశాన్నీ ఆయన రాష్ట్రపతికి నివేదించకూడదు.
ఎల్జీ అనిల్ బైజల్‌తో సీఎం కేజ్రివాల్

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ వివాదం?

దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. దీన్ని పాలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌(ఎల్జీ)తో పాటు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ప్రస్తుతం ఎల్జీగా అనిల్ బైజల్ విధులు నిర్వర్తిస్తుండా, ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడైన అరవింద్ కేజ్రివాల్ 2015 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాగా, గత కొంత కాలంగా ఎల్జీకి, సీఎంకు మధ్య అధికారాలపై వివాదం నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను గవర్నర్ తక్కువ చేస్తున్నారని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

దిల్లీ హైకోర్టు గతంలో తీర్పు ఇస్తూ.. దిల్లీ పరిపాలకుడు లెఫ్టినెంట్ గవర్నరేనని ప్రకటించింది. దీనిపై సీఎం కేజ్రివాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్‌ భూషణ్ ఈ ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం 2017 డిసెంబర్‌ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.

అరవింద్ కేజ్రివాల్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, రాజీవ్ ధావన్‌, ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించగా, కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ సింగ్ వాదించారు.

దేశ రాజధాని అయిన దిల్లీ చాలా సున్నితమైనదని, ఇక్కడ పరిపాలనా అధికారాలను దిల్లీ ప్రభుత్వం చేజిక్కించుకోవాలనుకోని అనుకోకూడదని కేంద్రం వాదించింది.

దిల్లీ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉండే భూమి, కార్యనిర్వాహక యంత్రాంగం, పోలీసులపై దిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవు.

లెఫ్టినెంగ్ గవర్నర్‌ రూపంలో దిల్లీని పాలించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు.

తన ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు తాను ఆదేశించినట్లుగా పనిచేయట్లేదంటూ ఏకంగా తొమ్మిది రోజుల పాటు ఎల్జీ కార్యాలయంలో కేజ్రివాల్ నిరసన దీక్ష చేశారు.

‘ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం’

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం ప్రతి ఫైలును ఎల్జీ అనుమతి కోసం పంపాల్సిన పనిలేదని, పనులు ఆగవని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)