అసెంబ్లీల్లో ఆగమాగం.. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎందుకు?

ఫొటో సోర్స్, othrs
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై సోమవారం అసెంబ్లీలో దాడి జరిగింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన మైక్ తగిలి తన కంటికి గాయమైందని స్వామిగౌడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనా చారి ప్రకటించారు.
బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి, ఆరుగురు ఎమ్మెల్సీలను శాసన మండలి నుంచి అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ సస్పెండ్ చేశారు.
వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు బలప్రదర్శనకు వేదికగా మారుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. చట్టసభల హుందాతనం కాపాడడానికి ఏం చేయాలనేదానిపై చర్చ కొంతకాలంగా సాగుతూ ఉన్నది.
ప్రజా సమస్యలను హుందాగా చర్చించి పరిష్కారాలు కనుగొనాల్సిన చట్టసభలు, ముఖ్యంగా రాష్ట్రాల అసెంబ్లీలు బలప్రదర్శనకు వేదికగా మారిన కొన్ని సందర్భాలను ఇపుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
'అసెంబ్లీలో జయలలిత చీర లాగారు'
1989 మార్చి 25 తేదీ. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థికమంత్రిగా ఉన్న కరుణానిధి అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు.
ఇంతలో తన చీర కొంగును డీఎంకే మంత్రి దురై మురుగన్ లాగారని జయలలిత ఆరోపించారు. అది చూసి సభలో ఉన్న అధికార పార్టీ సభ్యులు మరింత హేళనగా నవ్వారు.
దాంతో అవమానభారంతో ఆగ్రహంతో జయలలిత ఊగిపోయారు. 'మిమ్మల్ని గద్దె దింపాకే అసెంబ్లీలో అడుగుపెడతా' అని శపథం చేశారు.
అన్నట్టుగానే తదుపరి ఎన్నికల్లో ఆమె విజయ ఢంకా మోగించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, youtube
రణ క్షేత్రాన్ని తలపించిన కేరళ అసెంబ్లీ
కేరళ అసెంబ్లీలో 2015 మార్చి 13న చోటుచేసుకున్న రభస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సభ్యులు గల్లాలు పట్టుకొని దాడులు చేసుకోగా, ఇద్దరు మహిళా సభ్యులు కూడా గాయపడ్డారు.
ఆర్థిక మంత్రి కేఎం మణిని బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ప్రతిపక్ష ఎల్డీఎఫ్‌కు చెందిన సభ్యులు చేసిన ప్రయత్నం తీవ్ర గలాటాకు దారితీసింది.
స్పీకర్ కుర్చీని ధ్వంసం చేశారు. మైకులు విరిచేశారు. కంప్యూటర్లు, ఫోన్లు విసిరేశారు.
అనంతరం అసెంబ్లీ వెలుపల కూడా భారీగా అల్లర్లు జరిగాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ అసెంబ్లీలో మాజీ మంత్రిపై దాడి
2017 మే 31న దిల్లీ అసెంబ్లీ రణరంగంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై సభలో ఆ ఎమ్మెల్యేలు దాడి చేశారు.
సీఎం కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌లపై కపిల్ అవినీతి ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేలు ఈ చర్యకు పాల్పడ్డారు.
పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్ ఆయన్ను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.
అసెంబ్లీలో తనను మాట్లాడకుండా ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకుని మూకుమ్మడిగా దాడి చేశారని కపిల్ మిశ్రా ఆరోపించారు.

ఫొటో సోర్స్, youtube
బీఫ్ పార్టీ ఇచ్చారని..
2015 అక్టోబర్‌లో స్వంతంత్ర సభ్యుడు షేక్ అబ్దుల్ రహీద్‌పై జమ్ముూకశ్మీర్ అసెంబ్లీలో అధికార బీజేపీ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్నారు. చెంప దెబ్బదలు కొట్టారు.
పశు మాంసాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా, తాను దాన్ని ఖాతరు చేయబోనని రషీద్ అన్నారు.
శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్‌లో బీఫ్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు.
ఆ వ్యవహారంపై సభలో తీవ్ర దుమారం రేగింది. ఆగ్రహంతో బీజేపీ ఎమ్మెల్యేలు అతనిపై దాడి చేశారు.

ఫొటో సోర్స్, youtube
హిందీలో ప్రమాణ స్వీకారం చేశారని దాడి
మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) ఎమ్మెల్యేలు దాడి చేశారు.
చట్టపరంగా ఫలానా భాషలోనే ప్రమాణం చేయాలనే నిబంధన లేనప్పటికీ కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు మరాఠీ భాషలోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఎంఎన్‌ఎస్ హుకుం జారీ చేసింది.
అయితే, దాన్ని ఖాతరు చేయకుండా అబూ అజ్మీ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
మా మాటంటే లెక్కలేదా అంటూ ఎంఎన్‌ఎస్ ఎమ్మెల్యేలు అతనిపై భౌతిక దాడికి దిగారు.
ఇవి కూడా చూడండి:
- జిన్‌పింగ్: నాడు పార్టీలో ప్రవేశం లేని వ్యక్తి.. నేడు జీవితకాల అధ్యక్షుడిగా ఎలా మారారు?
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- దళితులమని మమ్మల్ని హీనంగా చూస్తున్నారు: తెలంగాణలో సర్పంచి ఆవేదన
- వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ: పి.సాయినాథ్
- నెలకు రూ.30 వేలు అద్దెకట్టి బోనుల్లో బతుకుతున్నారు
- సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!
- ‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








