కుమారస్వామి ప్రమాణస్వీకారం: ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు? ఏమిటి అర్థం?

ఫొటో సోర్స్, @INCIndia
జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత కుమారస్వామి బుధవారం నాడు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నేత జీ పరమేశ్వర్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
బీజేపీ నేత యడ్యూరప్ప సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోయారన్న విషయం తెలిసిందే. దాంతో కర్ణాటకలో ఒక్క వారంలోనే ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తున్న నేతలంతా ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు. విపక్షాలు పెద్ద ఎత్తున్నే ఇక్కడికి చేరాయి. కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించే అరవింద్ కేజ్రీవాల్, మాయావతి, చంద్రబాబు, సీతారామ్ ఏచూరి వంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు.
కర్ణాటకలో 222 సీట్లకు పోలింగ్ జరగగా, జేడీఎస్‌కు 37 స్థానాలు లభించాయి. అయినా, బీజేపీని అడ్డుకోవడం కోసం 78 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కే ఇచ్చింది.
జేడీఎస్, కాంగ్రెస్‌లు రెండూ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. కానీ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని స్థితిలో ఈ రెండు పార్టీలు చేరువయ్యాయి.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఇలా ఒకటి కావడం 2019 సాధారణ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తుగడగా భావిస్తున్నారు. ఇంతకూ కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరయ్యారు? వారి హాజరుకు అర్థం ఏంటి?

ఫొటో సోర్స్, @INCIndia
మాయావతి, అఖిలేష్
ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఒకప్పుడు పరమ శత్రువులుగా ఉన్న పార్టీలు. కానీ ఇప్పుడు బీజేపీని నిలువరించడానికి రెండూ ఒకటయ్యాయి. ఈ రెండు పార్టీలు చేరువవడం వల్ల లాభమేంటో ఈ మధ్యే కనిపించింది కూడా.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్‌సభ నియోజకవర్గమైన ఫూల్‌పూర్‌లో బీజేపీ ఘోర ఓటమిని చవి చూసింది.
2019లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్‌పీ - మూడూ ఒక్కటై బీజేపీతో పోటీపడే సూచనలున్నాయి. ఇవి మూడూ కలిస్తే బీజేపీకి ఇబ్బంది తప్పకపోవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నమొన్నటి వరకూ మోదీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన బాబు ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నారు.
బుధవారం కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి నాయుడు కూడా హాజరయ్యారు. మోదీని ఢీకొట్టడానికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తన చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం అవుతుందా అనేది ప్రస్తుతానికి ఊహకు కూడా అందని విషయం.

ఫొటో సోర్స్, @INCKarnataka
అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షం వైపు వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు.
అయితే కేజ్రీవాల్ పార్టీ ఉనికి ముఖ్యంగా దిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకే పరిమితమై ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితిలో ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఎలా కుదురుతుందనేది ఆసక్తికరమైన విషయమే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీతారామ్ ఏచూరి
సీపీఎం నేత సీతారామ్ ఏచూరి కాంగ్రెస్ సరసన కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే గతంలో ఈ రెండు పార్టీలు కూటమిలో కలిసినవే. యూపీఏ-1 ఏర్పాటులో సీపీఎందే కీలక పాత్ర.
అయితే సీపీఎంలో ప్రకాశ్ కరాత్ గ్రూపు కాంగ్రెస్‌తో పొత్తుకు ససేమిరా అంటోంది. కానీ ఏచూరి మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విస్తృత కూటమిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
సీపీఎం పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోనే బలంగా ఉంది. కేరళలో అది అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే కాబట్టి ఇవి రెండూ పొత్తు కట్టడానికి పెద్దగా ప్రాముఖ్యం లేదు.
ఇక పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఎంలు జత కట్టడానికి సిద్ధమే కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శించేందుకు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సమీకరణాలు ఎలా ఉండొచ్చో అంచనా వేయడం అంత సులువు కాదు.
మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారనేది అందరికీ తెలిసిందే. ఆమె గతంలో ఎన్‌డీఏ, యూపీఏ రెండింటిలోనూ భాగస్వామిగా ఉన్నారు.
ఇప్పుడు ఆమె మొగ్గు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన కనిపిస్తోంది. అయితే రాబోయే సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ పార్టీల్లో ఎవరు ఎవరితో కలిసి, ఎవరికి వ్యతిరేకంగా పోటీ చేస్తారో చూడాల్సి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ మూలాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ చాలా కాలంగా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి రెండూ కలిసి పోటీ చేయలేదు. బీజేపీ అధికారం చేపట్టింది.
తాము కలిసి పోటీ చేసి ఉంటే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదనే అభిప్రాయం ఈ రెండు పార్టీల్లోనూ ఉంది. కుమారస్వామి పదవీ స్వీకారం సందర్భంగా శరద్ పవార్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్‌తో వేరుపడి పోటీ పడి చేసిన పొరపాటు మరోసారి చేయబోమనే అభిప్రాయం కలుగజేసే ప్రయత్నం ఆయన చేశారు.
ప్రమాణస్వీకారానికి రానివాళ్లెవరు?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
శివసేన
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో శివసేన భాగస్వామిగా ఉంది. అయితే అది ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర నుంచి కేంద్ర స్థాయి వరకూ మోదీ ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేస్తోంది. ఈ వ్యతిరేకత రీత్యా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఆ పార్టీ కూడా హాజరు కావొచ్చని భావించారు కానీ అలా జరగలేదు.
డీఎంకే
తమిళనాడులో కీలక పార్టీ డీఎంకే. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్‌ను ఈ వేడుకకు ఆహ్వానించారు. కానీ ఆయన రాలేదు. దీంతో విపక్షాల కూటమి ప్రయత్నాల్లో డీఎంకే పాత్ర ఎలా ఉండొచ్చుననే సందేహాలు తలెత్తాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి ఆయన వేరే కారణాలు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
కేసీఆర్
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరోజు ముందే బెంగళూరుకు చేరుకొని కుమారస్వామికి అభినందనలు తెలిపారు. ఇతర కార్యక్రమాల మూలంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేనని తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్‌తో దగ్గరి సంబంధాలు నెరపిన కేసీఆర్‌కు ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.
పైగా ఆయన ఇటీవలే బీజేపీ, కాంగ్రెస్‌లకు విడిగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కోసం పిలుపు కూడా ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ భాగస్వామిగా ఉండే బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆయన చేరికకు అవకాశాలు లేవు.
ఈ వైరుధ్యాల కారణంగానే, ఆయన వ్యూహాత్మకంగానే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారనే అభిప్రాయం కూడా ఉంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)