ఈ మహిళలు రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు

అది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా. ఆ జిల్లాలోని త్రయంబకేశ్వర్ ప్రాంతంలో వర్షాలు బాగానే కురుస్తాయి. కానీ ఏటా వేసవిలో, నీటి చుక్క కోసం ఈ ప్రాంతం దాహంతో అలమటిస్తుంది. ఇక్కడి గిరిజన ప్రాంత మహిళలు పగలు, రాత్రి తేడా లేకుండా నీటి కోసం వేట సాగిస్తారు. అందుకు గనేషాగావ్ గ్రామం ఒక ఉదాహరణ. ఈ గ్రామ మహిళలు, నీటి కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
''నీటి సమస్యతో ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాం. పొద్దున లేచింది మొదలు నీటి గురించే మా ఆలోచనంతా. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏ వైపు వెళ్తే నీరు దొరుకుతుందా.. అని ఆలోచిస్తుంటాం. మా పిల్లల్ని ఇంట్లోనే నిద్రపొమ్మని చెప్పి మేం నీటి కోసం వెతుకుతూ బయలుదేరతాం. ఎవరైనా తోడు వస్తే మంచిదే. లేకపోతే ఒంటరిగా మైళ్ల దూరం నడవాల్సి వస్తుంది. ఒక రోజు నీళ్లు దొరికితే, ఇంకోరోజు దొరకవు. మా ఊరికి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి కానీ, అవి బురదనీళ్లు. మా ఊళ్లో 40-50 బావులు ఉన్నాయి. కానీ అన్నీ ఎండిపోయాయి. ఎందులోనూ నీళ్లు లేవు'' అని మంగళా బాయి అనే మహిళ బీబీసీకి వివరించారు.
ఈ మహిళలు నీటి కోసం సుమారు 2 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తారు. ఆపై బరువైన నీటి బిందెలను తలపై మోసుకుంటూ రావడం వల్ల శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీరు బీబీసీతో పంచుకున్న మరిన్ని విషయాలను ఈ కింది వీడియోలో చూడండి.
''ఉదయం 6 గంటల నుంచి నీటి కోసం వెతుకులాట మొదలవుతుంది. బావిలో కేవలం ఐదారు బిందెల నీరు మాత్రమే ఉంటుంది. ఎవరైనా వాటిని తోడుకొని వెళ్లిపోతే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అందుకే మేమంతా రెండేసి బిందెల నీళ్లు పంచుకుంటాం. ఆ రెండు బిందెల కోసం మేం మూడు మైళ్లు నడవాల్సి ఉంటుంది. రెండు బిందెల్నీ ఒకేసారి మోసుకుంటూ రావడం వల్ల ఛాతి నొప్పి, నడుము నొప్పి వస్తాయి'' అని తుల్సాబాయి అనే మరో మహిళ అన్నారు.
నాసిక్‌లోని కొన్ని ప్రాంతాలు వర్షాలు పడ్డాక కూడా కరవును ఎదుర్కొంటున్నాయి.

''నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కానీ వచ్చే వాన నీటిని తగిన విధంగా నిల్వ చేసి, జాగ్రత్త పరచుకోవాలి. వాళ్లేమో నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చెయ్యమంటారు. కానీ అందుకోసం చెయ్యాల్సిన పనుల్ని పూర్తి చెయ్యరు. అలా అయితే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది, నీటిని నిల్వ చెయ్యడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇక్కడ కరవు సంభవిస్తోంది. సురక్షితమైన తాగు నీరన్నది ఏటా సమస్యగా మారింది'' అని గణేషాగావ్ పోలీస్ ప్రతినిధి పాటిల్ దేవ్‌చంద్ మహాలే అన్నారు.
ఏటా ఎన్నికల్లో హామీలకు కొదవ లేదు కానీ, ఏ ఒక్క నేత కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదని వీరు చెబుతున్నారు.
నాసిక్ పరిధిలోని 8 మండలాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నాసిక్ ప్రాంతంలోని 1069 గ్రామాలకు కేవలం 325 ట్యాంకర్లు మాత్రమే దాహం తీరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- దిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - అరవింద్ కేజ్రీవాల్
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- 45 రోజుల్లో 99 శాతం దోమల నిర్మూలన.. సాలీడు విషంతో చేసిన ప్రయోగాలు సక్సెస్
- గ్రాహం స్టెయిన్స్: భారత్‌లో ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా జరిగిన మొదటి మూకదాడి, హత్య ఇదేనేమో - Ground Report
- తెలంగాణకు ఐదేళ్లు: విలీనం నుంచి విభజన దాకా..
- అమెరికా వీసా: ‘సరదాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రమాదంలో పడేయొచ్చు’
- ఇచట అమ్మానాన్నలు, భార్యాభర్తలు అద్దెకు ఇవ్వబడును
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










