IND vs NZ సెమీఫైనల్: మాంచెస్టర్ మొగ్గు ఎవరి వైపు? - ప్రపంచ కప్

క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ కప్ ట్రోఫీ వేటలో న్యూజీలాండ్‌తో సెమీఫైనల్లో అమీతుమీకి భారత్ సిద్ధమవుతోంది. రేపు (జులై 9) మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరానికి వేదిక మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం.

మరి ఈ మైదానం ఎవరికి అనుకూలం- మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకా, మొదట బౌలింగ్ చేసిన జట్టుకా? టోర్నీలో ఇక్కడ జరిగిన మ్యాచుల ఫలితాల సరళి ఏం చెబుతోంది?

ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మొత్తం ఐదు మ్యాచులు జరగ్గా, ఐదింటిలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.

ఇక్కడ భారత్ తన రెండు మ్యాచుల్లోనూ, న్యూజీలాండ్ తన ఏకైక మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగే చేశాయి.

విరాట్ కోహ్లీ, విలియమ్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ, విలియమ్సన్

ఇక్కడ భారత్‌వి రెండూ ఘన విజయాలే

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జూన్ 16 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొంది. భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేయగా, 140 పరుగులతో ఓపెనర్ రోహిత్ శర్మ, 77 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్లలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.

జూన్ 27 నాటి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. వెస్టిండీస్‌పై 128 పరుగుల ఆధిక్యంతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

భారత్ ఏడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేయగా, 72 పరుగులతో కోహ్లీ, 48 పరుగులతో ఓపెనర్ కేఎల్ రాహుల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ అత్యధికంగా నాలుగు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయాలు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయాలు సాధించింది.

ఐదు పరుగుల తేడాతో గెలిచిన న్యూజీలాండ్‌

న్యూజీలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే- ప్రత్యర్థి వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొంది. జూన్ 18 నాటి ఈ మ్యాచ్‌లో కివీస్ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలిచింది.

న్యూజీలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేయగా, వెస్టిండీస్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

న్యూజీలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 148 పరుగులతో, రాస్ టేలర్ 69 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లతో, లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లతో రాణించారు.

జిమ్మీ నీషమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ గెలిచిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో తొలుత బౌలింగ్ చేసింది.

లీగ్ దశలో భారత్ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోగా, ఆ ఓటమి తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.

న్యూజీలాండ్ సెమీస్‌ చేరుకోవడానికి ముందు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.

లీగ్ దశలో భారత్ గెలిచిన ఏడు మ్యాచుల్లో ఐదింట్లో మొదట బ్యాటింగ్ చేసింది.

న్యూజీలాండ్ గెలిచిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో తొలుత బౌలింగ్ చేసింది.

గత 20 మ్యాచుల సంగతి?

భారత్, న్యూజీలాండ్‌ సెమీఫైనల్ వేదికైన ఓల్డ్ ట్రాఫోర్డ్ మ్యాచులనే కాకుండా టోర్నీలోని అన్ని మ్యాచుల ఫలితాలను చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు సాధించాయి.

టోర్నీలో 45 లీగ్ మ్యాచులకుగాను నాలుగు వర్షం వల్ల రద్దయ్యాయి.

మే 30 నుంచి జులై 6 వరకు జరిగిన 41 మ్యాచుల్లో 27 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.

ఈ గణాంకాల్లో ఇంకో ఆసక్తికర అంశం ఉంది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ గెలిచిన ఏడు మ్యాచుల్లో ఐదింట్లో మొదట బ్యాటింగ్ చేసింది.

మొదటి 21 మ్యాచుల ఫలితం విషయంలో తొలుత బ్యాటింగ్‌కు, లక్ష్యఛేదనకు మధ్య పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 11 మ్యాచుల్లో నెగ్గితే, మిగతా 10 మ్యాచుల్లో లక్ష్యఛేదనలో జట్లు గెలిచాయి.

గత 20 మ్యాచుల ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం నాలుగు మ్యాచుల్లోనే లక్ష్యఛేదనలో జట్లు విజయం సాధించాయి.

బ్రిటన్‌లో టోర్నీ మొదటి మూడు వారాల్లో వానల ప్రభావం, తేమ వాతావరణం వల్ల ఒక రకమైన పరిస్థితులు, తర్వాతి దశలో వాతావరణం మారడం వల్ల అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి మ్యాచులపై కొంత మేర ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ అంశాలను బట్టి చూస్తే రేపటి మ్యాచ్‌‌లో టాస్ కీలకం కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)