'కబీర్ సింగ్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా... మహిళలు నిశ్శబ్దంగా భరించే హింసను 'నార్మల్' అని చెప్పే ప్రయత్నం చేశాడు

ఆ పేరుతో కొనసాగేది హింస

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE

నేను 'అర్జున్ రెడ్డి' సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వచ్చినపుడు చూశాను. ఆ సినిమా అంతా నాకు పురుషాధిక్యం కనిపించింది.

కానీ, అది తెలుగు సినిమా కావడంతో దానికి నేను అంత కనెక్ట్ కాలేకపోయానేమో అనిపించింది.

కానీ అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' రిలీజైనప్పుడు దీనిపై చర్చ జోరందుకోవడం, సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ వైరల్ అవడం, నాకు మళ్లీ నా గతాన్ని గుర్తు చేశాయి.

ఆ గతంలో బాధ మాత్రమే ఉంది. నా పార్ట్‌నర్ చేతుల్లో నేను అనుభవించిన హింస మళ్లీ కళ్ల ముందు కదిలింది.

సందీప్ రెడ్డి వంగా

ఫొటో సోర్స్, kabirSinghMovie/Facebook

ఫొటో క్యాప్షన్, సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా తన ఇంటర్వ్యూలో, "ప్రేమికుల మధ్య ఒకరికొకరు చెంపదెబ్బలు కొట్టుకునే, తిట్టుకునే స్వేచ్ఛ లేదంటే, వారిది బహుశా నిజమైన ప్రేమ కాదు" అన్నారు.

ఆయన అన్న ఆ మాటలు నా చేదు జ్ఞాపకాలను తిరగదోడాయి. దాదాపు మానిపోయిన నా గాయాలను మళ్లీ రేగేలా చేశాయి.

ఆ పేరుతో కొనసాగేది హింస

ఇక మీరు నూటికి నూరు శాతం నిజమైన నా కథను చదవండి

నా మాజీ బాయ్‌ఫ్రెండ్ నాపై బలవంతం చేశాడు. నేను వద్దని ఎన్నిసార్లు చెప్పినా, అతడిని బలవంతంగా తోసేసినా తను నన్ను పట్టించుకోలేదు.

మా బంధం మొదట్లో అంతా అలాగే కొనసాగింది. అప్పట్లో నేను సెక్స్‌కు మానసికంగా సిద్ధంగా లేను.

అప్పుడు నేను ఏడుస్తున్నాను, ఎందుకంటే నా మొదటి సెక్స్ అనుభవం అలా బలవంతంగా ఉంటుందని నేను అనుకోలేదు. అది ఎవరూ కోరుకోరు కూడా.

నేను ఏడవడం చూసిన అతడు, "బేబీ, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా" అన్నాడు

కానీ, తన మనసులో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. నేను అంతకు ముందే అలాంటి బంధంలో ఉన్నానేమోనని అనుమానించేవాడు.

చాలా సార్లు నాకు కఠినంగా అనిపించే మాటల్ని కూడా చాలా ఈజీగా అనేసేవాడు. పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్‌కు, లైంగిక వేధింపులకు తేడా ఏంటో అతడికి తెలిసేది కాదు.

ఈ శారీరక, లైంగిక, ఎమోషనల్ హింస నాపై ఎంత ప్రభావం చూపిందంటే, నాలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, నాకు ఆత్మహత్యే శరణ్యం అనిపించేది.

అతడు ఎప్పుడంటే అప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు. అసలు నాకంటూ ఒక స్పేస్ లేకుండా పోయింది. ఎలాంటి ప్రైవసీ లేకుండా పోయింది.

ఎప్పుడైనా అతడిని పట్టించుకోకుండా నాకు నేను ప్రాధాన్యం ఇచ్చుకుందామని ప్రయత్నిస్తే, అతడు నన్ను బాధలు పెట్టేవాడు.

కొనసాగేది హింస

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

పరిస్థితులు ఎంత ఘోరంగా మారాయంటే, నేను చివరికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్లాల్సొచ్చింది. నేను 'డిప్రెషన్, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌'కు గురైనట్లు డాక్టర్ నాకు చెప్పారు.

వరసగా థెరపీ చేయించుకున్న తర్వాత చివరికి నేను ఆ బంధం నుంచి బయటపడగలిగాను.

ఆలోపు అతడు వేరే సిటీకి వెళ్లిపోయాడు. తను నన్ను మోసం చేసేవాడని నాకు ఆ బంధం ముగిసిన తర్వాత తెలిసింది.

అతడు నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో ఎంతోమంది అమ్మాయిలతో కూడా తిరిగేవాడని చెప్పారు.

నేను అతడికి ఫోన్ చేసి ఆ విషయం అడిగితే, నన్ను "యూజ్ అండ్ త్రో మెటీరియల్" అన్నాడు.

అంత జరిగిన తర్వాత కూడా నేను అలాంటి బంధంలో ఎందుకు ఉన్నానని మీరిప్పుడు నన్ను అడగచ్చు.

ఈ బంధం నుంచి బయటపడడం ఎందుకు కష్టం

ఆ బంధం నుంచి బయటపడడం నాకు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే తను నన్ను అడ్డుకోడానికి ఎంతవరకైనా వెళ్లేవాడు.

అతడు ఒక్కోసారి పీజీ వరకూ వచ్చేసేవాడు. నా ముందు అరుస్తూ గోల చేసేవాడు, నన్ను క్షమించమని అడిగేవాడు. మా అమ్మనాన్నలకు, నా పీజీలో ఉన్న వాళ్లందరికీ అదంతా తెలీడం నాకెందుకో నచ్చలేదు.

ఆ పేరుతో కొనసాగేది హింస

అంత జరిగినా వెనకేసుకొచ్చాను

నాకు ఏం జరిగినా, అతడు నన్ను ఏం చేస్తున్నా, చాలా కాలం వరకూ నేను దాన్ని హింస అనుకోలేదు.

అతడి నిజ స్వరూపాన్ని నాకు చూపించాలని ప్రయత్నించిన తన స్నేహితులతో నేను వాదించేదాన్ని. అతడి చేష్టలను వెనకేసుకొచ్చేదాన్ని.

ఇంత జరిగాక కూడా అలా ఎందుకు చేశారు అని మీరు నన్ను అడగచ్చు.

అతడు చెప్పే మాటలను నేను నిజమే అనుకునేదాన్ని. తను నన్ను ఎన్నిసార్లు నువ్వెందుకూ పనికిరావని అన్నా, దాన్ని నమ్మేసేదాన్ని.

భారత సమాజంలో మహిళలను 'కుటుంబ గౌరవం'గా భావిస్తారు. ప్రేమ, బంధాలను దాచుకోవడాన్ని మనం రొమాంటిక్ అనుకుంటాం.

ప్రేమ, బంధాలు, సెక్స్ గురించి ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చలు చాలా తక్కువగా ఉంటాయి.

మనం ఈ ప్రేమించే పద్ధతులను సినిమాల నుంచి నేర్చుకుంటాం. ఎందుకంటే సినిమాల ప్రభావం చాలా వరకూ ఉంటుంది. అది యువత మధ్య ప్రేమ అనే ఒక 'కాన్సెప్ట్‌'కు జన్మనిస్తుంది. అలాంటి ప్రేమలు నిజజీవితంలో ఎక్కడా కనిపించవు.

ఇదంతా చాలా వరకూ, ఎక్కువ మంది పురుషులు పోర్న్ చూసి సెక్స్ గురించి ఎలా ఒక సంకుచిత అవగాహనకు వస్తారో, అలాగే ఉంటుంది. అసలు నిజం చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే నిజ జీవితంలో కూడా సెక్స్ గురించి చాలా తక్కువ చర్చ జరుగుతుంది.

ఆ పేరుతో కొనసాగేది హింస

అన్నీ భరించేది మహిళలే

డైరెక్టర్ సందీప్ రెడ్డి... అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "కోపం అనేది అసలైన ఎమోషన్. బంధాల్లో ఉన్న వారికి తమ పార్ట్‌నర్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ముట్టుకునే, కిస్ చేసే, తిట్టే, చెంపదెబ్బ కొట్టే స్వేచ్ఛ ఉంటుంది" అన్నారు. రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు నాకు మహిళకు వ్యతిరేకంగా చేసినవిగా అనిపించాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇలాంటివి తరచూ మగవాళ్లే చేస్తారు. పార్ట్‌నర్‌ను నచ్చినప్పుడు ముట్టుకోవడం, లేదా చెంపదెబ్బ కొట్టడం, అవన్నీ భరించేది మహిళలే.

మగాళ్లు అలా చేస్తే, మహిళలు వాటిని నిశ్శబ్దంగా భరిస్తారు. సందీప్ రెడ్డి మాత్రం దీనిని 'నార్మల్' అని చెప్పే ప్రయత్నం చేశారు.

"అతడు అలా చేయాలని మనసులో ఎప్పుడూ అనుకోలేదు లేదా అతడు ఎప్పుడూ అలా చేయడు" అని కబీర్ సింగ్ పాత్రను వెనకేసుకొచ్చేవాళ్లకు బహుశా "నిజంగా అలా చేసే మగాళ్ల గురించి తెలిసుండదు".

కబీర్ సింగ్‌ను వెనకేసుకొచ్చేవాళ్లందరిలో ఎంత గొప్ప లక్షణాలుంటాయంటే, అలాంటి వారు సన్నిహిత సంబంధాల్లో ఎప్పుడూ హింస రుచిచూసి ఉండరు. బహుశా దానిని ఎప్పటికీ భరించలేరు.

సందీప్ రెడ్డి తీసిన సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. కబీర్ ప్రీతిని చెంపదెబ్బ కొట్టినపుడు, వాళ్లు చప్పట్లు కొడతారు. కబీర్ ఒక పేద మహిళ గాజు గ్లాసు పగలగొట్టినందుకు ఆమెను కొట్టాలని తరిమినప్పుడు నవ్వుతారు. ఒక అమ్మాయికి కత్తి చూపించి బట్టలు విప్పమన్నప్పుడు గట్టిగా అరుస్తారు.

ఆ పేరుతో కొనసాగేది హింస

ఫొటో సోర్స్, FACEBOOK/KABIRSINGHMOVIE

ఫెమినిస్ట్ అంటారు

హీరో ఒక అమ్మాయిని అడక్కుండానే కిస్ చేసినప్పుడు, వారికి ఏ తప్పూ కనిపించదు. వారి నోటి వెంట 'ఫెమినిస్ట్' అనే పదమే వస్తుంది. సినిమాలో చూపించిన హింస గురించి ఏదైనా చెబితే వారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి చెప్పినట్లు 'సూడో' అంటారు.

ప్రేమ 'అన్‌కండిషనల్' అని సందీప్ రెడ్డి భావిస్తున్నారు. అంటే అందులో ఎలాంటి షరతులు, ఎలాంటి హద్దులూ ఉండవు. సినిమా గురించి చెడుగా చెప్పే వాళ్లెవరికీ ఎవరితోనూ ఎప్పుడూ 'అన్‌కండిషనల్' లవ్ పుట్టలేదేమో అంటున్నారు.

కానీ ఆయన చెప్పిన ఈ 'అన్‌కండిషనల్' లవ్‌ను భరించి బాధపడ్డవారు, యాసిడ్ దాడులకు గురైనవారు, శరీరంతోపాటూ, ఆత్మ కూడా గాయపడిన ఎంతో మంది మహిళలు, అమ్మాయిల గురించి నాకు తెలుసు.

ప్రేమ 'అన్‌కండిషనల్' లేదా షరతులు లేకుండా కావాలి. అందులో కొన్ని షరతులు ఉండాలి. అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, పరస్పర అంగీకారం, స్పేస్ ఉండాలి. ఇవేవీ లేకుండా 'ప్రేమ' అంటే అది హింసను కొనసాగించడానికి ఒక సాకు తప్ప వేరే ఏం కాదు.

(బీబీసీ ఎడిటోరియల్ పాలసీ ప్రకారం రచయిత ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఆమె గుర్తింపును వెల్లడించడం లేదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)