ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: ‘2021 జూన్ కల్లా పోలవరం పూర్తిచేస్తాం’

జగన్, బుగ్గన

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మా బడ్జెట్‌లో నూత‌న ప‌థ‌కాల‌పై ఎక్కుద దృష్టిపెడుతున్నామని చెప్పారు.

‘‘ఈ ప్రభుత్వానికి కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. పార్టీలు అసలే లేవు.. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి’’ మా నినాదం అంటూ బుగ్గన బడ్జెట్ ప్రసంగం ముగించారు.

అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

సాగునీటి ప్రాజెక్టులకు రూ. 13,139 కోట్లు

2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. అందుకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తాం.

ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల పునరావాసాన్ని పూర్తి చేయటానికి అన్ని చర్యలు చేపడతాం.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1 ని ఏడాదిలో పూర్తి చేస్తాం

గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు 1వ దశను ఏడాదిలో పూర్తిచేస్తాం

హంద్రీనీవా సుజల స్రవంతి 1వ దశను పూర్తి చేస్తాం

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరువులను నింపేందుకు 2వ దశను పూర్తిచేస్తాం

సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం

మద్యం దుకాణాలు త్వరలో ప్రభుత్వం చేతుల్లోకి

దశల వారీ మద్యనిషేధం హామీ అమలులో భాగంగా మొదట బెల్టు షాపులపై కఠిన చర్యలు ప్రారంభించాం.

తరువాతి చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలుగా మార్పు చేస్తాం.

దానివల్ల మద్యం అమ్మకం, వినియోగం మీద ప్రభుత్వం పూర్తి నియంత్రణ ఉంటుంది.

ఇది మద్యనిషేధానికి మార్గం వేస్తుందని భావిస్తున్నాం. ఉన్నత స్థాయి పరిమిత ప్రదేశాలకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలన్న మా లక్ష్యం సాధించటానికి దోహదపడుతుంది.

సవివర భూ సర్వే.. సీఓఆర్ఎస్ సాంకేతికత అమలు

సవివర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఓఆర్ఎస్ సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రవేశపెడతాం.

భవిష్యత్తులో భూయజమానులు జియో-కోడ్స్ ఉపయోగిస్తూ తమ భూమిని సొంతంగా గుర్తించగలరు.

అలాగే గ్రామ స్థాయిలో భూ సర్వేయరును నియమిస్తాం.

భూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరిస్తాం.

అమరావతికి రూ. 500 కోట్లు.. కడప స్టీల్ ప్లాంటుకు రూ. 250 కోట్లు

అమరావతి రాజధాని నగరం కోసం రూ. 500 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తూ ప్రతిపాదించాం.

విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ఎణ్నికల హామీ ఇచ్చాం.

కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సీఎం ఈ ఏడాది శంకుస్థాపన చేస్తారు.

ఈ ప్లాంటు కోసం బడ్జెట్‌లో మొదట రూ. 250 కోట్లు కేటాయిస్తున్నాం.

కల్యాణ కానుకలు

బీసీలకు కల్యాణ కానుక కింద రూ. 300 కోట్లు

ఎస్సీలకు కల్యాణలక్ష్మి కానుక కింద రూ. 200 కోట్లు

ఎస్టీ గిరిపుత్రిక కల్యాణ కానుక కింద రూ. 45 కోట్లు

మైనారిటీ సంక్షేమం కింద షాదీకా తోఫా కింద రూ. 100 కోట్లు

కులాంతర వివాహ పథకానికి రూ. 36 కోట్లు

మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెట్టి‌న బడ్జెట్ ముఖ్యాంశాలు:

కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం

  • అన్ని కాంట్రాక్టుల్లో పారదర్శకత పాటిస్తాం
  • ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
  • గోదావరి నీళ్లకు శ్రీశైలంకు తీసుకురావడం మా లక్ష్యం
  • రైతు సంక్షేమం : ధరల స్థిరీకరణ నిధికి రూ. 3000 కోట్లు
  • రైతు సంక్షేమం : వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
  • రైతులకు ఉచిత విద్యుత్ కు రూ. 4525 కోట్లు
  • రైతు సంక్షేమం : ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
  • సాగునీరు వరద నివారణకు రూ. 13,139 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
  • వైఎస్సార్ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ. 6,860 కోట్లు
  • గృహ నిర్మాణానికి రూ. 3,617 కోట్లు
  • వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు
  • వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు
  • రైతులకు ఉచిత బోర్లకు రూ.200 కోట్లు
  • ఆశావర్కర్లకు రూ. 455.85 కోట్లు
  • అమ్మ ఒడి పథకానికి రూ. 6,455 కోట్లు
  • మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు
  • వృద్ధులు, వితంతువుల పెన్షన్లకు రూ. 12,801 కోట్లు
  • ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు
  • వికలాంగుల పెన్షన్లకు రూ. 2,133.62 కోట్లు
  • ఎపీఎస్ఆర్‌టీసీకి రూ. 1,000 కోట్లు

అమ్మ ఒడి పథకానికి రూ. 6,455 కోట్లు

విద్యారంగంలో అమ్మ ఒడి పథకం ప్రకటిస్తున్నాం

జాతీయ నిర‌క్ష‌రాస్య‌త రేటు దేశంలో 27 శాతం, ఏపీలో 33 శాతం ఉంది.

మ‌హిళ‌ల్లో నిర‌క్ష‌రాస్య‌త 40 శాతంగా ఉంది. జాతీయ స‌గ‌టు క‌న్నా ఎక్కువ‌గా ఉంది.

పిల్ల‌ల‌ను విద్యావంతుల‌ను చేస్తున్న త‌ల్లుల‌కు ప్రోత్సాహం అందిస్తున్న తొలి ప్ర‌భుత్వం మాదే.

జ‌గ‌నన్న అమ్మ ఒడి ప‌థ‌కం కింద పాఠ‌శాల‌కు పిల్ల‌ల‌ను పంపించే త‌ల్లుల‌కు ఏటా రూ. 15,000 చొప్పున అందిస్తాం.

1వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ విద్యార్థుల‌కు అందిస్తాం.

మొత్తం రూ. 6,455 కోట్ల‌తో 43 ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు ల‌బ్ధి చేకూరుతుంది.

బుగ్గన

ఫొటో సోర్స్, AP Assembly

'అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు'

వైఎస్సార్ రైతు భ‌రోసా... జూలై 8న రైతు దినోత్స‌వంగాప్ర‌క‌టించాం. రైతుల సంక్షేమంకోసం రైతు క‌మిష‌న్ ఏర్పాటు చేశాం.

ప్ర‌తీ రైతుకి పంట‌కాలానికి ముందే రూ. 12,500 ఇస్తామ‌ని మ్యానిఫెస్టోలో ప్ర‌తిపాదించాం.

2020 నుంచి ఈ మొత్తాన్ని ప్ర‌జ‌ల‌కు చేర్చాల్సిఉంది కానీ అక్టోబ‌ర్ 15 ఈ ఏడాది నుంచే అందిస్తున్నాం.

రూ. 8,750 కోట్ల కేటాయింపుతో కౌలురైతులు స‌హా అంద‌రికీ ల‌బ్ధిచేకూరుస్తున్నాం.

కౌలు రైతులంద‌రికీ ప‌ద్ధ‌తి ప్ర‌కారం స‌హాయం అందించిన తొలి ప్ర‌భుత్వం మాదే.

బ్యాంకుల నుంచి రుణాలు సునాయాసంగా పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.

వడ్డీ లేని రుణాలకు రూ. 100 కోట్లు

వైఎస్సార్ వ‌డ్డీ లేని రుణాల కింద రూ. 100 కోట్ల‌ు ప్ర‌తిపాదిస్తున్నాం. 100 శాతం మంది రైతుల‌కు సున్నా వ‌డ్డీ ద‌క్కేలా చేస్తాం.

బీమాతోనే రైతుకి ధీమా వ‌స్తుంది. అందుకే పంటల బీమాకు ప్రాధాన్య‌త‌నిస్తున్నాం. 10 నుంచి 12 శాతానికి మించి రైతులు బీమా క‌ట్ట‌లేక‌పోతున్నారు.

వైఎస్సార్ ఫ‌స‌ల్ బీమా పథకం కింద.. రైతుల పంట బీమా వాటాను ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. రూ. 1,163 కోట్ల‌తో రైతుల‌కు మేలు క‌లుగుతుంది.

20 ల‌క్ష‌ల ప‌శువుల‌కు రూ. 50 కోట్ల‌తో ఇన్సూరెన్స్.

ధరల స్థిరీకరణ నిధికి రూ. 3,000 కోట్లు

ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి, ప్ర‌కృతి వైప‌రీత్యాల నిధి ఏర్పాటు చేస్తున్నాం.

ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ కోసం రూ. 3,000 కోట్లు కేటాయిస్తున్నాం.

ఉచితంగా బోరు బావులు త‌వ్వేందుకు రూ. 200 కోట్లు ఇస్తున్నాం.

ట్రాక్ట‌ర్ల‌కు రోడ్డు ట్యాక్స్ మిన‌హాయింపు అందిస్తాం.

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల్లో క‌ల్తీ నివార‌ణ కోసం వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌ల కోసం 109.8 కోట్లు కేటాయిస్తున్నాం.

బడ్జెట్ భేటీ

ఫొటో సోర్స్, AP Government

ప్రకృతి విపత్తు నివారణకు రూ. 2,000 కోట్లు

కోల్డ్ స్టోరేజీలు, గొడౌన్ల నిర్మాణానికి రూ. 200 కోట్ల‌ు కేటాయిస్తున్నాం.

సాగు న‌ష్ట నివార‌ణ కోసం ప్ర‌కృతి విపత్తు నివార‌ణ కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాం.

తిత్లీ తుఫాన్ బాధితుల కోసం రూ. 150 కోట్లు

కౌలు రైతుల కోసం చ‌ట్ట‌బ‌ద్ధ యంత్రాంగం ఏర్పాటు

పాడి స‌హ‌కార సంఘాల పున‌రుద్ద‌ర‌ణ కోసం రూ. 100 కోట్లు

మత్స్యకారుల సహాయం రూ. 10 వేలకు పెంపు

మ‌త్స్య‌కారుల స‌హాయం రూ. 4,000 నుంచి రూ. 10,000కు పెంపు. దీనిని 2020 జ‌న‌వ‌రిలో పంపిణీ చేస్తున్నాం.

1.17 ల‌క్షల మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు స‌బ్సిడీ మీద డీజిల్ అందిస్తాం

రూ. 1.50 పైస‌ల‌కే ఆక్వా రైతుల‌కు విద్యుత్ అందించటానికి రూ. 175 కోట్లు

నాలుగు షిప్పింగ్ జెట్టీల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల‌ను ఆదుకోవ‌డానికి 7 లక్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం అందిస్తాం.

మ‌త్స్య‌కారులు మ‌ర‌ణిస్తే రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అందజేస్తాం.

'తలసరి ఆదాయం 40 శాతం పడిపోయింది'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న‌కు ముందు 1 రూపాయి ఉన్న త‌ల‌స‌రి ఆదాయం ఆ త‌ర్వాత 60 పైస‌ల‌కు ప‌డిపోయింది.

ప్ర‌త్యేక హోదా హామీతోనే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింది. హోదా హామీని కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించి పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర వ‌న‌రుల‌ను పూర్తిగా దెబ్బ‌తీసినందున హోదా డిమాండ్ చేస్తున్నాం.

ప్ర‌ధాన‌మంత్రితో జ‌రిగిన వివిధ స‌మావేశాల్లో సీఎం ఈ విష‌యం ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌జాస్వామ్యానికి అత్యున్న‌త సాధ‌న‌మైన పార్ల‌మెంట్ ఇచ్చిన హామీ నిల‌బెట్టుకోవాలి.

విభ‌జ‌న చ‌ట్టంలో కొంత స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం వ‌ల్ల ఘ‌న‌మైన స‌భ‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లుకి నోచుకోకుండా ఉండ‌కూడ‌దు. భార‌త దేశ‌కుటుంబ సంస్కృతిని ప్ర‌పంచం గుర్తించింది. పార్ల‌మెంట్ ఇచ్చిన హామీని కూడా అదే రీతిలో నెర‌వేర్చాలి.

ఆర్టిక‌ల్ 3 ప్ర‌కారం మ‌న రాష్ట్రానికి త‌గిన ప్రాధాన్య‌త ఉండాలి. ఏపీ విభ‌జ‌న చివ‌రిది కాదు. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన అన్ని హామీలు కేంద్రం, పార్ల‌మెంట్ అమ‌లు చేయాలి. ముఖ్య‌మంత్రి ఈ ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

2022 నాటికి మ‌న రాష్ట్రం అభివృద్ధిలో ముందు నిల‌వాలి. గాంధీజీ 150వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న స్ఫూర్తితో రాష్ట్రంలో లేమి లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.

సంక్షేమం, అభివృద్ధి స‌మ‌తుల్య‌త‌కోసం ప్ర‌య‌త్నిస్తున్నాం. సింగ‌పూర్ విమానానికి వ‌యబులిటీ గ్యాప్ ఇవ్వాలా, పేద‌ల‌కు ఆక‌లి తీర్చాలా అంటే మాకు రెండోదే ముఖ్యం. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో 2కోట్ల మంది పేద‌ల‌ను క‌లిశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, APGovernment

మేనిఫెస్టోనే ప్రధాన నియమావళి

ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక అస‌మాన‌త‌లు లేకుండా జీవించ‌డ‌మేన‌ని మ‌హాత్మ‌గాంధీ మాట‌ల స్ఫూర్తితో 43 రోజుల పాల‌న‌లో విలువ‌ల‌తో కూడిన పాల‌న ద్వారా మార్పున‌కు శ్రీకారం చుట్టారు.

మ్యానిఫెస్టో కేవ‌లం ప్ర‌క‌ట‌న ప‌త్రం మాత్ర‌మే కాకుండా నిర్వ‌హ‌ణ‌, నియ‌మ సంపుటిగా, ప్ర‌ధాన నియామ‌వ‌ళిగా ఉంటుంది. ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడ‌వ‌డానికి, వారి సంక్షేమం కోసం ఈ బ‌డ్జెట్ క‌ట్టుబ‌డి ఉంది.

స‌మ‌గ్ర సంక్షేమ ఎజెండాకు అనుగుణంగా ఉంది. రైతాంగంలో న‌మ్మ‌కం, ఉద్యోగ‌వ‌కాశాల‌పై యువ‌త‌, పిల్ల‌ల చ‌దువుల‌తో భ‌రోసా కోసం బ‌డ్జెట్ ఉంటుంది.

ప్ర‌భుత్వానికి ఓ విజ‌న్ ఉంది. రాబోయే రోజుల్లో నెర‌వేర్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి దేశంలో నెంబ‌ర్ వ‌న్ చేస్తాం.

గోదావ‌రి జ‌లాల‌ను వినియోగించుకుని శ్రీశైలానికి త‌ర‌లించ‌డం, కృష్ణా ఆయ‌క‌ట్టు స్థిరీక‌రించ‌డం, అంద‌రికీ పైప్ లైన్ ద్వారా తాగునీరు, పోల‌వ‌రం, వంశ‌ధార ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర‌ప్రాజెక్టులు ప్రారంభించ‌డం, ప్ర‌త్యేక హోదా సాధించ‌డం, ప‌ర్యావ‌ర‌ణ సుస్థిర‌త సాధించేలా క‌డ‌ప స్టీల్ ప్లాంట్ సాధించ‌డం, ఆరోగ్య సుస్థిర‌త సాధించ‌డ‌మే ల‌క్ష్యం.

రాజ‌కీయ అనుబంధాల‌తో సంబంధం లేకుండా అంద‌రికీ ప్ర‌యోజ‌నం అందిస్తాం. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో ప్ర‌జ‌ల రాజ్యాంగ హ‌క్కులు ఉల్లంఘించిన మునుప‌టిపాల‌న‌కు భిన్నంగా ఉంటుంది.

గత సర్కారు చెప్పిన ఐదేళ్ల అభివృద్ధి యధార్థమా కాదా తేలాలి...

పార‌ద‌ర్శ‌క‌త మూడో సూత్రం. అన్ని ప‌నుల్లో, కాంట్రాక్టుల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. ఉత్త‌ర్వుల‌ను ఆన్ లైన్ లో ఉంచుతాం.

జిల్లా స్థాయిలో కూడా అవినీతిర‌హిత పాల‌న నాలుగో సూత్రం. న్యాయ సంబంధం లేకుండా మునుప‌టి ప్ర‌భుత్వానికి భిన్నంగా ఉంటాం. టెండ‌రింగ్ లో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తాం.

పోల‌వ‌రం స‌హా అన్ని ప్రాజెక్టుల్లో అవినీతి లేకుండా చేసేందుకు జ్యుడీషియ‌ల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆర్థిక సుస్థిర‌త గ‌తంలో చెప్పిన ప్ర‌క‌ట‌న‌ల‌కు భిన్నంగా రాష్ట్ర వాస్త‌వ అవ‌స‌రాల‌ను తీర్చేలా ఉంటుంది.

అతిశ‌యం, క్షేత్ర‌స్థాయిలో ఉన్న అంత‌రం తొల‌గిస్తాం. గ‌త 5 సంవ‌త్స‌రాల్లో ప్ర‌భుత్వం చెప్పిన రెండంక‌ల అభివృద్ధి య‌ధార్థ‌మా కాదా అన్న‌ది ఇంకా తేలాలి.

వృద్ధిని వ‌క్రీక‌రించి వృద్ధి వ‌న‌రుల‌ను కేంద్రీక‌రించేలా చేసిన‌ట్టుగా భావిస్తున్నాం. విలాసాల కోసం వ‌న‌రుల దుర్వినియోగంప్ర‌జ‌ల్లో తీవ్ర కోపానికి కార‌ణం అయ్యింది.

ఆదాయ లేమి లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. దేశ చ‌రిత్ర‌లోనే వార‌స‌త్వంగా పొందని ఆర్థిక దుస్థితిని ఈ ప్ర‌భుత్వం ద‌క్కించుకుంది.

ఓటాన్ అకౌంట్ హామీల అమలుకు రూ. 45,000 కోట్లు అవసరం

విభ‌జ‌న స‌మ‌యం నాటి 1,34,6544 కోట్ల అప్పు 2018-19 నాటికి 2.58 ల‌క్ష‌ల కోట్ల‌కు విప‌రీతంగా పెరిగింది.

రూ. 18,000 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ లో హామీల అమ‌లుకోసం 45,000 కోట్లు అవ‌స‌రం ఉంది.

మొత్తం బడ్జెట్ అంచనా: రూ. 2,27,974.99 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ. 1,80,475.94 కోట్లు

మూల ధన వ్యయం: రూ. 32,293.39 కోట్లు

వడ్డీ చెల్లింపుల నిమిత్తం: రూ. 8,994 కోట్లు

రెవెన్యూ లోటు: 1,778.52 కోట్లు

ద్రవ్య లోటు: 35,260.58 కోట్లు

జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం.

జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు సుమారు 3.3 శాతం.

2018-19 బడ్జెట్‌తో పోలిస్తే 19.32 శాతం పెరుగుదల.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ

పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను శాసన మండలిలో ప్రవేశపెడతారు.

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసన సభలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ, మండలిలో మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.

ముందుగా ఉదయం 8 గంటలకు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. 30 వరకూ మొత్తం 14 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

వైఎస్ జగన్మోహన్‍‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే.

ఈ బడ్జెట్‌లో నవరత్నాల అమలు కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశముంది. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ చేయూత వంటి పథకాలకు అధిక ప్రాధాన్యముండే అవకాశముంది.

నవరత్నాలు అంటే...

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)