సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: మరణం కేసులో సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం

రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY / INSTAGRAM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుశాంత్ మరణం కేసులో బీహార్‌లోని పాట్నాలో నమోదైన కేసును అక్కడి నుంచి ముంబై తరలించాలని కోరుతూ నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బుధవారం ఉదయం ఈ ఆదేశాలు జారీ చేసింది.

పాట్నాలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కరెక్టేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసులో బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరటం కూడా చట్టబద్ధంగా సరైనదేనని పేర్కొంది.

ఆ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ హృషికేష్ రాయ్ ఉత్తర్వులు జారీచేశారు. సుశాంత్ మరణానికి సంబంధించి ఇంకేవైనా ఎఫ్ఐఆర్‌లు నమోదైనా వాటిని కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న చనిపోయి కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే.. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా రియా చక్రవర్తి ప్రేరేపించారని.. ఆయనను కుటుంబానికి దూరం చేశారని సుశాంత్ కుటుంబం ఆరోపించింది.

రియా చ్రవర్తి తను సుశాంత్‌ ప్రియురాలిగా చెప్తున్నారు. అయితే.. రియా కారణంగానే తన కుమారుడు చనిపోయాడంటూ సుశాంత్ తండ్రి జూలై 25న పాట్నాలోని రాజీవ్ నగర్‌లో ఫిర్యాదు చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, @ITSSSR

బీహార్, మహారాష్ట్ర వాదనలు

ఈ నేపథ్యంలో.. సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. కాబట్టి పాట్నా కేసును కూడా అక్కడికి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును కేరారు.

ఈ పిటిషన్ మీద జరిగిన విచారణకు.. రియా తరఫున న్యాయవాది శ్యామ్ దావన్, బీహార్ ప్రభుత్వం తరఫున మణీందర్ సింగ్, సుశాంత్ తండ్రి తరఫున వికాశ్ సింగ్, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనూ సింఘ్వీలు వాదనలు వినిపించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయలేదని బీహార్ ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. బీహార్‌లో ఎన్నికల కారణంగా ఈ కేసును రాజకీయం చేస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

''ఇది సుశాంత్ కుటుంబం విజయం. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. మాకు సత్వర న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నాం'' అని సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది వికాశ్ సింగ్ స్పందించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వు న్యాయస్థానంపై ప్రజలకున్న నమ్మకాన్ని బలోపేతం చేసిందని, సుశాంత్ మృతి కేసులో న్యాయం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చిందని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే పేర్కొన్నారు.

సుశాంత్ మరణంతో బాలీవుడ్‌లో బంధుప్రీతి - బయిటివారు అనే అంశం మీద చర్చ మరోసారి తీవ్రంగా తెరపైకి వచ్చింది. సుశాంత్ బయటివ్యక్తి కావటం వల్ల అతడిని లక్ష్యంగా చేసుకున్నారని సినిమా పరిశ్రమ ఒక వర్గం ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)