మాలిలో సైనికుల తిరుగుబాటు... దేశాధ్యక్షుడి రాజీనామా, పార్లమెంటు రద్దు

ఫొటో సోర్స్, Reuters
మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ దేశ టీవీ చెప్పింది.
సైనికులు మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్యాంపు దగ్గరకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత కొన్ని గంటలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేయటంతో పాటు పార్లమెంటును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని టీవీ కథనం.
దీనిని ప్రాంతీయ శక్తులు, ఫ్రాన్స్ ఖండించాయి.
"నన్ను అధికారంలో ఉంచడానికి రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు" అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
అంతకుముందు తిరుగుబాటు చేసిన సైనికులు కటీ కాంపును తమ అధీనంలోకి తీసుకున్నారు.
జిహాదీలతో ఘర్షణ కొనసాగుతుండడంతో తమ జీతాల గురించి సైనికులు కోపంగా ఉన్నారు. అధ్యక్షుడి పైన వారికి చాలా అసంతృప్తి కూడా ఉంది.
2018లో జరిగిన ఎన్నికల్లో కేటా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కానీ అవినీతి, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దకపోవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మత హింసపై ప్రజల్లో ఆగ్రహం ఉంది.
దీంతో, గత కొన్ని నెలలుగా దేశంలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
మితవాద మత పెద్ద మహమూద్ డికో నేతృత్వంలో ఏర్పడిన ఒక కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ కేటా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, AFP
తిరుగుబాటు ఎలా జరిగింది?
కటీ క్యాంప్ డిప్యూటీ హెడ్ కల్నల్ మలిక్ డియా, జనరల్ సాదియో కమారా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారని బమాకోలోని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
తిరుగుబాటుదారులు బమాకో నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపును స్వాధీనం చేసుకున్న రాజధానిలో కవాతు చేశారు. కేటా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారంతా వీధుల్లో భారీగా గుమిగూడి వారిని ఉత్సాహపరిచారు.
మంగళవారం మధ్యాహ్నం అధ్యక్షుడి నివాసంలోకి చొరబడ్డ సైనికులు ఆయనతోపాటూ, అక్కడే ఉన్న ప్రధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
సైనికులు అదుపులోకి తీసుకున్న నేతల్లో అధ్యక్షుడు కేటీ కుమారుడు, జాతీయ అసెంబ్లీ స్పీకర్, విదేశాంగ, ఆర్థిక మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ తిరుగుబాటులో ఎంతమంది సైనికులు పాల్గొన్నారనేది ఇంకా స్పష్టంగా తెలీడంలేదు.
2012లో జరిగిన తిరుగుబాటులో కూడా కటీ క్యాంప్ వార్తల్లో నిలిచింది. ఉత్తర మాలీని తమ నియంత్రణ తెచ్చుకున్న ట్వారీ రెబల్స్, జిహాదీలను అడ్డుకోవడంలో కమాండర్ల అసమర్థతపై ఆగ్రహంతో సైనికులు అప్పుడు తిరుగుబాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యక్షుడి నిర్బంధంపై స్పందన
మాలీలో తిరుగుబాటు జరిగిందనే వార్తలు రాగానే.. సైనికులు తాము బంధించిన వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియన్ కోరాయి.
మాలీతో సరిహద్దులు మూసివేయడానికి, ఆ దేశంతో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిపేయడానికి, నిర్ణయాత్మక సంస్థల నుంచి మాలిని తొలగించడానికి 15 సభ్య దేశాలు అంగీకరించాయని ప్రాంతీయ సంస్థ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ (Ecowas) చెప్పింది. గత కొన్ని నెలలుగా ఇది కేటా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.

మాలీలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం అవుతోంది.
మాలీ మాజీ వలస పాలకులు ఫ్రాన్స్ కూడా ఆ దేశాధ్యక్షుడి నిర్బంధాన్ని ఖండించింది. సైనికులు తిరిగి తమ బారెక్స్ కు వెళ్లిపోవాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కోరారు. సాహెల్ ప్రాంతంలో ఇస్లామిక్ చొరబాటుదారులతో యుద్ధం చేస్తున్న ఫ్రాన్స్ కు మాలీ కీలక సైనిక స్థావరం.
ఇవి కూడా చదవండి:
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








