జర్మనీ ఎన్నికలు: ఏంగెలా మెర్కెల్ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరో?

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంజిలా మెర్కెల్, ఆర్మిన్ లాషెట్

ఏంగెలా మెర్కెల్, అర్మిన్ లాషెట్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏంగెలా మెర్కెల్, అర్మిన్ లాషెట్‌

జర్మనీలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఏంగెలా మెర్కెల్ తరువాత ఆ పదవిని చేపట్టేది ఎవరో జర్మన్ ప్రజలు త్వరలో నిర్ణయించనున్నారు. అయితే ఎన్నికల్లో గట్టి పోటీ ఉన్నట్లు కనిపించట్లేదు.

జర్మనీలో పలుచోట్ల వార్షిక మారథాన్ పోటీలు జరుగుతున్నాయి. కానీ, దేశం మొత్తం మరింత పెద్ద పోటీకి సిద్ధం అవుతోంది.

ఆదివారం ఎన్నికలు జరగనుండగా, చివరిరోజు శనివారం జరిగిన ర్యాలీలో చాన్స్‌లర్ మెర్కెల్ కన్జర్వేటివ్ అభ్యర్థి అర్మిన్ లాషెట్‌తో కలిసి ఆయన స్వస్థలం ఆచెన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తుది ఒపీనియన్ పోల్స్ ప్రకారం చూస్తే ఈ వర్గానికి విజయం అంత సులువుగా దక్కేట్లు కనిపించడం లేదు.

బలమైన ఆర్థిక వ్యవస్థ, ఆరు కోట్లకు పైగా ఓటర్లు ఉన్న దేశం పగ్గాలు చేపట్టేదెవరో ఆదివారం తేలనుంది.

మెర్కెల్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగేవరకు ఈ ఎన్నికలపై ఎవరూ పెద్దగా దృష్టి సారించలేదు.

"ఎవరు అధికారంలో ఉంటారనేది చాలా ముఖ్యం" అంటూ గత 48 గంటల్లో మెర్కెల్ అనేకసార్లు ఓటర్లను హెచ్చరించారు.

జర్మనీలో స్థిరత్వం రావాలి, యువత భవిష్యత్తు బాగుండాలి. అందుకు సరైన నాయకుడు అర్మిన్ లాషెట్‌ అన్నదే ఆమె మాటల్లోని అంతరార్థం.

ఓలాఫ్ షోల్జ్
ఫొటో క్యాప్షన్, ఓలాఫ్ షోల్జ్

గెలుపెవరిదో ఊహించడం కష్టమే

ఈ ఎన్నికల విషయంలో అనేక సంశయాలు ఉన్నాయి.

ఇప్పటికే, అనేకమంది పోస్టు ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ, మరింకెంతోమంది ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధంలో ఉన్నారు.

గత కొద్ది నెలలుగా ఒపీనియన్ పోల్స్ అటూ ఇటూ ఊగిసలాడుతూ ఉన్నాయి. మొదట్లో కన్జర్వేటివ్ సీడీయూ పార్టీ ముందంజలో ఉన్నట్లు కనిపించింది. మధ్యలో గ్రీన్స్ ఆధిక్యంలో కనిపించింది. తరువాత సోషల్ డెమొక్రాట్స్ పార్టీకి చెందిన ఓలాఫ్ షోల్జ్ ఉప్పెనలా దూసుకొచ్చారు.

చాన్స్‌లర్ పదవికి పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థులలో షోల్జ్ ఓటర్లను ఎక్కువగా ఆకర్షించారు. ఛాన్సలర్ పదవిలోకి మరో కొత్త అభ్యర్థి రావడం కన్నా మెర్కెల్ డిప్యుటీగా ఉన్న షోల్జ్, మరో మెట్టెక్కి ఆ పదవిని చేపడతారని ప్రజలు భావించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒకవేళ షోల్జ్ గెలిచినా, సంకీర్ణం ఏర్పాటు చేయడానికి ఆయనకు మరో రెండు పార్టీల మద్దతు అవసరం ఉంటుంది.

"ఓటర్లతో సంకీర్ణమే నాకు ముఖ్యం. వాళ్లు ఎస్‌పీడీ పార్టీకి ఎంత ఆధిక్యత తెచ్చిపెడతే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నాకు అంత సులభం అవుతుంది" అని షోల్జ్ అన్నారు.

వాతావరణ సంక్షోభం కీలకం

గ్రీన్స్ పార్టీకి ఇది చాలా పెద్ద అవకాశం. ప్రస్తుతం జర్మన్ ఓటర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వాతావరణ మార్పులు.

అయితే, ఇప్పటివరకూ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే గ్రీన్స్ పార్టీకి 10 శాతం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి.

వేసవిలో జర్మనీలో వరదలు ముంచెత్తడంతో 190 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు ముఖ్యమైన రాష్ట్రాల్లో విధ్వంసం జరిగింది. వాతావరణ సమస్యలు ఇంత ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రీన్స్ పార్టీ అభ్యర్థి అన్నాలెనా బేర్‌బాక్‌కు తగినంత మద్దతు లభించలేదు.

వాతావరణ మార్పులు పెద్ద సమస్యే అయినప్పటికీ, ఇతర పార్టీలు కూడా దీన్ని పరిష్కరించగలవని పలువురు జర్మన్లు అభిప్రాయపడుతున్నారు.

పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ)ని వృద్ధి చేయడమే తక్షణ కర్తవ్యం అని, ఈ అంశంలో "జర్మనీలో మనం చాలా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాం" అని శనివారం అర్మిన్ లాషెట్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.

లిబరల్ పార్టీ ఎఫ్‌డీపీకి, గ్రీన్స్ పార్టీతో అనేక విభేదాలు ఉండవచ్చుగానీ, వాతావరణ మార్పులు సమస్యకు ఆ పార్టీ కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ అంశంలో ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది.

ఈ రెండు పార్టీలకూ ప్రభుత్వంలో ఉండేందుకు ఈసారి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

"వాతావరణ మార్పులు విషయంలో క్రియాశీలకంగా ఉండే చివరి అవకాశం రాబోయే ప్రభుత్వానికి మాత్రమే ఉంది" అంటూ టీవీ డిబేట్లలో అన్నాలెనా ఓటర్లను హెచ్చరించారు. అంటే ప్రభుత్వంలో గ్రీన్స్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉందన్నది ఆమె ఉద్దేశం.

గ్రీన్స్ పార్టీ సూచిస్తున్న మార్గంలోనే జర్మనీ నడవాల్సిన అవసరం లేదని లిబరల్ నాయకుడు క్రిస్టియన్ లిండ్నర్ అభిప్రాయపడ్డారు.

అన్నాలెనా బేర్‌బాక్‌

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అన్నాలెనా బేర్‌బాక్‌

కథ ఇంకా మిగిలే ఉంటుంది

ఆదివారం సాయంత్రానికి గెలుపు ఎవరిదో ఖాయమైనా, ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారనేది జర్మన్లకు అంత తొందరగా తెలిసే అవకాశం లేదు.

గెలిచిన పార్టీ సంకీర్ణాన్ని ఏర్పరచాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణం కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

అందుకే జర్మన్లు ట్రాఫిక్ లైట్లు అని, జమైకా లేదా కెన్యా సంకీర్ణం అని.. వివిధ పార్టీల గుర్తుల రంగులను సూచిస్తూ మాట్లాడుకుంటున్నారు.

సెంటర్-లెఫ్ట్ సంకీర్ణమైతే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల కలయిక కనిపిస్తుంది. కన్జర్వేటివ్స్ అయితే నలుపు, పసుపు, ఆకుపచ్చ కావొచ్చు.

ఈ తతంగమంతా పూర్తయే వరకు ఏంగెలా మెర్కెల్ ఆ పదవిలో కొనసాగుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)