రివాబా జడేజా: తొలిసారి ఎమ్మెల్యే అయిన ఈ గుజరాతీ లీడర్‌కు మంత్రి పదవి.. ఇంతకీ ఎవరీమె?

రివాబా జడేజా, గుజరాత్, బీజేపీ

ఫొటో సోర్స్, Rivaba Ravindrasinh Jadeja/fb

ఫొటో క్యాప్షన్, రివాబా జడేజా రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
    • రచయిత, గోపాల్ కటేషియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్‌లో ఎమ్మెల్యే రివాబా జడేజా(34).. భూపేంద్ర పటేల్ కొత్త మంత్రివర్గంలో శుక్రవారం సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు ప్రాథమిక, మాధ్యమిక, వయోజన విద్య శాఖల బాధ్యతలు అప్పగించారు.

రివాబా జడేజా 2016 ఫిబ్రవరిలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజాతో నిశ్చితార్థం చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు.

అనంతరం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రివాబాను భర్త రవీంద్ర జడేజా అభినందించారు.

"మీ విజయం పట్ల చాలా గర్వపడుతున్నాం. మీ అద్భుతమైన పనిని కొనసాగిస్తారని, అన్ని వర్గాల ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంటారని తెలుసు. గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగా విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జడేజా రాశారు.

కాగా, రివాబాను మంత్రిని చేయడం ద్వారా బీజేపీ అనేక సమీకరణాలను సాధించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రవీంద్ర జడేజా, రివాబా

ఫొటో సోర్స్, Rivaba Ravindrasinh Jadeja/FB

ఫొటో క్యాప్షన్, 2018లో రవీంద్ర జడేజా, రివాబాలు న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

రివాబా నేపథ్యం ఏమిటి?

రివాబా తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి ఒక పెద్ద పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్. రివాబా తల్లి ప్రఫుల్ల రైల్వేలో పనిచేశారు.

రాజ్‌కోట్‌లో ప్రాథమిక, మాధ్యమిక విద్యను చదివారు రివాబా. ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

ఆ తర్వాత, రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

అక్టోబర్ 2018లో (రాజస్థాన్, గుజరాత్‌లో చురుకుగా ఉన్న) రాజ్‌పుత్ సంస్థ మహిళా విభాగానికి రివాబా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. అనంతరం రెండు నెలల తర్వాత, రవీంద్ర జడేజా, రివాబా దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మోదీతో సమావేశం తర్వాత, రివాబా రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 మార్చి 3న, జామ్‌నగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె బీజేపీలో చేరారు.

నరేంద్ర మోదీ 2019 మార్చి 4న జామ్‌నగర్‌ను సందర్శించాల్సి ఉండగా, రివాబా ఒక రోజు ముందు బీజేపీలో చేరారు. రవీంద్ర జడేజాది జామ్‌నగర్‌.

రివాబా

ఫొటో సోర్స్, Facebook.com/RivabaRavindraJadeja

ఫొటో క్యాప్షన్, జామ్‌నగర్ (నార్త్) స్థానం నుంచి రివాబా విజయం సాధించారు.

జామ్‌నగర్ టికెట్

2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ (నార్త్) స్థానం నుంచి రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ స్థానానికి రివాబాను నిలబెట్టినప్పుడు చాలా చర్చ జరిగింది.

రవీంద్ర జడేజా తన భార్య తరపున ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి రివాబా 50,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు.

గత సంవత్సరం, జామ్‌నగర్ నగరంలోని ప్రజలకు సహాయం చేయడానికి నడుం లోతు నీటిలో రివాబా నడుస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

అదేవిధంగా, రోడ్డు సమస్యలపై జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను విమర్శించిన వీడియో కూడా వైరల్ అయింది.

రివాబా

ఫొటో సోర్స్, Facebook.com/RivabaRavindraJadeja

రివాబాకు మంత్రి పదవి ఎలా దక్కింది?

"జామ్‌నగర్‌లో రాజ్‌పుత్‌, పటేల్‌ల ఆధిపత్యం ఉంది. జామ్‌నగర్ రూరల్ ఎమ్మెల్యే, పాటిదార్ అయిన రాఘవ్‌జీ పటేల్ గతంలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు రివాబాను తీసుకొచ్చి క్షత్రియ సమాజానికి ప్రాతినిధ్యం కల్పించింది బీజేపీ. ఈ విధంగా, ప్రాంతీయ, కుల ఆధారిత సమీకరణాలను సాధించడంలో కమలం పార్టీ విజయం సాధించింది" అని గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు దిలీప్ పటేల్ అన్నారు.

"జామ్‌నగర్‌లో పూనమ్‌ బెన్‌కు ప్రత్యామ్నాయం కోసం రివాబాకు బీజేపీ మంత్రి పదవి ఇచ్చింది. ఈ నియామకంతో పూనమ్‌ బెన్‌కు రాజకీయ ప్రత్యర్థిని సృష్టించినట్లు కనిపిస్తోంది" అని దిలీప్ అభిప్రాయపడ్డారు.

రివాబా జడేజాను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అతిపెద్ద కారణం ఆమె కులం, క్షత్రియులలో మహిళా నాయకత్వం అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు దీపల్ త్రివేది అంటున్నారు.

"రివాబా జడేజాను మంత్రిని చేసి, బీజేపీ ఒకే దెబ్బకు మూడు పిట్టలను చంపినట్లయింది. మొదట, ఈ నియామకంతో పార్టీ కుల సమానత్వాన్ని సాధించగలిగింది. దీంతో పాటు, మహిళలు, యువత అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. రివాబా ఇమేజ్ ఆమె కులానికి చెందిన ఇతర అభ్యర్థుల కంటే పూర్తిగా భిన్నం" అని దీపల్ అన్నారు.

"ఈ ఎంపికతో, యువత, విద్యావంతులైన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు బీజేపీ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది" అని అన్నారు.

రివాబాకు మంత్రి పదవి దక్కడానికి రాజకీయ పోటీ కాకుండా ఇతర సమీకరణాలూ అనుకూలించాయని రాజ్‌కోట్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కౌశిక్ మెహతా అభిప్రాయపడ్డారు.

"ఆ స్థానంలోని ధర్మేంద్రసింగ్ జడేజా క్షత్రియుడు. కిరీట్ సింగ్ (రాణా) పేరు కూడా రేసులో ఉంది. రివాబా వారి అర్హతకు సరిపోతారు. మరోవైపు, ఆమె మహిళ కూడా. రాజ్‌కోట్ నుంచి భానుబెన్ బాబారియాను తొలగించాల్సి వస్తే, రివాబా ఆమెకు ప్రత్యామ్నాయం అవుతారు. ఆమె చాలా బాగా పనిచేస్తారని కాదు కానీ, ఇందులో సమీకరణం కులం, ప్రాంతం, ముఖ్యంగా మహిళ అని భావిస్తున్నా" అని అన్నారు కౌశిక్.

రివాబా , పూనమ్‌బెన్ , బినాబెన్

ఫొటో సోర్స్, Facebook.com/RivabaRavindraJadeja

సీనియర్లతో విభేధాలు

ఎమ్మెల్యే అయిన తర్వాత రివాబా ఓసారి వివాదంలో చిక్కుకున్నారు.

2023 ఆగస్టు 17న, జామ్‌నగర్ నగరంలో అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమంలో, 'అమరవీరులకు ఎలా నివాళులు అర్పించాలి' అనే అంశంపై రివాబా, అప్పటి జామ్‌నగర్ నగర మేయర్ బినాబెన్ కొఠారి, జామ్‌నగర్ ఎంపీ పూనమ్‌బెన్ మధ్య బహిరంగ వాగ్వాదం జరిగింది. దీంతో, కార్యక్రమంలో ఉన్న నాయకులు, ప్రజలు విస్తుపోయారు.

ఆ తర్వాత, రివాబా, బినాబెన్, పూనమ్‌బెన్ మధ్య బీజేపీ నాయకులు రాజీ కుదిర్చారు.

రివాబా "అపరిపక్వత, క్రమశిక్షణా రాహిత్యానికి" ఇదొక ఉదాహరణ అని అప్పట్లో ఒక బీజేపీ నాయకుడు చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాసంస్థ కథనం ప్రచురించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)