గుజరాత్: ముఖ్యమంత్రి మినహా మంత్రులందరూ రాజీనామా, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Gujarat CMO
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, మంత్రి రుషికేశ్ పటేల్ బీబీసీ ప్రతినిధి లక్ష్మీ పటేల్‌తో మాట్లాడుతూ రాజీనామాలను ధ్రువీకరించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
రేపు మహాత్మ మందిర్‌లో జరగనున్న ప్రమాణ స్వీకారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రాజీనామా ఇచ్చిన 16 మంది మంత్రులలో 8 మంది క్యాబినెల్ మంత్రులు కాగా, మరో 8 మంది సహాయ మంత్రులు.
క్యాబినెట్ మంత్రులు కానూభాయ్ పటేల్, రుషికేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్, కున్వర్జీ బావలియా, ములుభాయ్ బేరా, కుబేర్ డిండోర్, భానుబెన్ బాబరియా రాజీనామా సమర్పించారు.
సహాయ మంత్రులు హర్ష సంఘ్వీ, జగదీశ్ పాంచాల్, పురుషోత్తమ్ సోలంకి, బచ్చూభాయ్ ఖాబడ్, ముకేశ్ పటేల్, ప్రఫుల్ల పన్షేరియా, భీఖూసింగ్ పర్మార్, కున్వర్జీ హల్పతీ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
మొత్తం మంత్రివర్గం రాజీనామాను ఎందుకు ఆమోదించారు?
"ఇప్పటి బీజేపీ పరిస్థితి 1985 నాటి కాంగ్రెస్‌లా ఉంది. 1985లో మాధవ్‌సింగ్ సోలంకి 149 సీట్లలో విజయం సాధించారు. ప్రతిపక్షమే లేదు. అయితే, 2022లో బీజేపీ ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 156 సీట్లు గెలుచుకుంది, ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ రెబల్స్‌గా పోటీ చేసిన వారు, స్వతంత్రులతో కలిపి ఆ సంఖ్య 162కి పెరిగింది" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు ఘన్‌శ్యామ్ షా అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతి ఎమ్మెల్యేకు ఉండే అంచనాలను అందుకోవడం కష్టం. అందుకే 2024 లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ తొలిసారి అసమ్మతి చెలరేగింది. ఫలితంగా వడోదర, సబర్‌కాంఠా అభ్యర్థుల మార్పు జరిగింది. అప్పటి నుంచి బీజేపీలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
మంత్రవర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలని బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు విద్యుత్ జోషి అంటున్నారు.
"బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా, అది ఇతరులను నిందిస్తుంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. ఇప్పటివరకూ చేసిన తప్పులకు పాత మంత్రులను నిందించే ప్రయత్నం" అని ఆయన అన్నారు.

సౌరాష్ట్ర బీజేపీలో అసంతృప్తి…
భారతీయ జనతా పార్టీలోని అసమ్మతి గురించి సౌరాష్ట్రకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కౌశిక్ మెహతా బీబీసీతో మాట్లాడుతూ, "క్యాబినెట్‌లో దక్షిణ గుజరాత్‌కు ప్రాధాన్యం కల్పించడం వల్ల తమను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని సౌరాష్ట్ర ప్రజలు భావించారు. రెండోది, సౌరాష్ట్రలోని లేవా పటేళ్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
"మరో విషయం ఏమిటంటే పటేళ్లు, ఓబీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు జగదీష్ పాంచాల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అయితే, ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్ష పదవులు అహ్మదాబాద్‌కు వెళ్లడంతో, సౌరాష్ట్రలో రాజకీయ సమతుల్యత అవసరం ఏర్పడింది. అందుకే, ఆర్థిక, పరిశ్రమలు, రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖలలో సౌరాష్ట్రకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది" అని కౌశిక్ మెహతా చెప్పారు.
ఘనశ్యామ్ షా మాట్లాడుతూ, "విసావదర్ బీజేపీకి అంత బలమైన స్థానం కాకపోయినా, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ఎన్నికైన తర్వాత, ఆప్ వంటి క్రియాశీలక పార్టీ కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. విసావదర్ ఎన్నికల అనంతరం, మరో 40 సీట్లపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. దీనికి మొదటి ఉదాహరణ బోటాడ్‌లో జరుగుతున్న నిరసనలు. దీని ప్రభావం కేవలం బోటాడ్‌కే పరిమితం కాదు. సమీపంలోని గధాడ నుంచి గరియాధర్ వరకు కూడా కనిపిస్తుంది. ఆప్ కూడా బీజేపీకి ఒక సవాల్" అని అన్నారు.
"ఇది గుజరాత్‌లో 2026 ఫిబ్రవరిలో జరగబోయే మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చు. అంతేకాకుండా, ఈ వర్షాకాలంలో ప్రభుత్వ పనితీరు కారణంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. కొత్త మంత్రివర్గ ఏర్పాటుతో ప్రస్తుత మంత్రులపై ఎమ్మెల్యేలు, కార్యకర్తలలో ఉన్న ఆగ్రహం చల్లారవచ్చు'' అని ఘనశ్యామ్ విశ్లేషించారు.

రాజకీయ విశ్లేషకులు విద్యుత్ జోషి మాట్లాడుతూ, "బీజేపీ గతంలోనూ ఇలా చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఎదురైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కేశూభాయ్ పటేల్ ప్రభుత్వాన్ని మార్చారు. అలాగే పటేల్, ఓబీసీ ఆందోళనలను అణచివేయడంలో విఫలమైన ఆనందిబెన్ పటేల్ విషయంలో.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అసంతృప్తి వ్యక్తమైనప్పుడు ఆమెను తప్పించారు. విజయ్ రూపానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ ఓట్ల విభజన కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే గాంధీనగర్, సూరత్‌లలో ఆప్ బలంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వారు మొత్తం ప్రభుత్వాన్నే మార్చడానికి సిద్ధమయ్యారు, విజయవంతమయ్యారు. అందుకే వారు రెండు సంవత్సరాల కోసం పునర్వ్యవస్థీకరణ చేపట్టారు" అని అన్నారు.
"గత కొన్నేళ్లుగా బీజేపీలో కుల సమీకరణాలలో అసమతుల్యత ఏర్పడింది. గాంధీనగర్‌ను చేరుకోవాలంటే, వారు తప్పనిసరిగా సౌరాష్ట్ర మార్గాన్నే ఎంచుకోవాలి. కానీ, సీఆర్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత, 156 సీట్లు గెలిచినప్పటికీ, సౌరాష్ట్రను నిర్లక్ష్యం చేశారనే భావన అందరిలో ఉంది. బీజేపీలో శంకర్ సింగ్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి, రాష్ట్ర అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రి పదవి సౌరాష్ట్ర వారికే ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు అహ్మదాబాద్ ముఖ్యమంత్రి, సీఆర్ పాటిల్ కలయిక సౌరాష్ట్ర ప్రజలలో అసంతృప్తిని పెంచింది" అని విద్యుత్ జోషి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
గుజరాత్‌లో భారీ విజయం సాధించిన బీజేపీ
2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు సాధించింది. ఆ తర్వాత, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
దీంతో అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 162కి పెరిగింది.
గుజరాత్‌లో 2026 ప్రారంభంలో స్థానిక సంస్థల ఎన్నికలు, 2027 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














