కొండా సురేఖ: తరచూ వివాదాల్లో ఉండే ఈ మంత్రి చుట్టూ.. తాజా వివాదమేమిటి?

కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Konda Surekha/fb

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చుట్టూ మరోసారి దుమారం రేగింది. ఆమెకు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా ఉన్న సుమంత్‌పై ఆరోపణలు రావడం.. ఆయన్ను ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తప్పించడం.. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ను విచారణకు పిలుస్తారనడం... ఇలా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదాయ, అటవీ, పర్యావరణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కొండా సురేఖ.

గతంలోనూ కొండా సురేఖను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.

తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

దీనికి ముందు, ఈ వ్యవహారంపై సురేఖ కుమార్తె సుస్మిత.. ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.

''మా (కొండా సురేఖ కుటుంబం) మీద కుట్రలు జరుగుతున్నాయి. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా మాకు మనోధైర్యం ఇవ్వాలి'' అని ఆమె ఆ వీడియోలో అన్నారు.

అయితే, తమను ఎవరూ టార్గెట్ చేయలేదని సురేఖ భర్త, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Konda Surekha/fb

అసలేం జరిగింది?

మంత్రి సురేఖ ఓఎస్డీగా ఉన్న ఎన్.సుమంత్‌ను రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరించారని, డబ్బులివ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించారంటూ సుమంత్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఇంకా స్పందన రాలేదు.

అలాగే, డిప్యుటేషన్‌ రద్దు చేస్తూ విడుదల చేసిన ఆదేశాల్లో కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి దీని గురించి ప్రస్తావించలేదు.

''సిమెంట్ కంపెనీని బెదిరించారనేది వచ్చిన ఆరోపణ. దీనిపై సీనియర్ మంత్రి ఒకరు నేరుగా ఏఐసీసీకి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అందుకే ప్రభుత్వం ఆయన్ను తప్పించింది'' అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒకరు బీబీసీతో చెప్పారు.

అయితే, ఈ విషయంపై మంత్రి సురేఖ మాట్లాడారు.

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, "తాజా పరిణామాలపై పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు" అని అన్నారు.

"పార్టీ పెద్దలు సెటిల్ చేస్తామన్నారు. ఈ విషయం వారే చూసుకుంటారన్న భరోసాతో వెళ్తున్నా" అన్నారు సురేఖ.

సుమంత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.

కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Konda Surekha/fb

దీనికి ముందు ఏం జరిగిందంటే..

మరోవైపు, హైదరాబాద్‌లో సురేఖ కుమార్తె సుస్మిత ఇంటి వద్ద కొంత హైడ్రామా నడిచింది.

బుధవారం (అక్టోబర్ 15) రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ ఆ ఇంట్లోనే ఉన్నారని తమకు సమాచారం ఉందంటూ పోలీసులు అక్కడికి రావడంతో.. సుస్మిత వారిని ఇంట్లోకి రానివ్వకుండా నిలిపివేశారు.

''పోలీసులు మా ఇంటికి వచ్చారు. వారు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. మా ఇంటి చుట్టూ పోలీసుల పహారా ఉంది. బీసీలుగా ఉన్న మమ్మల్ని టార్గెట్ చేశారు. ఓఎస్డీ తొలగింపుపై మంత్రి పేషీకి సమాచారం లేదు. మంత్రికి చెప్పకుండానే తొలగించారు'' అంటూ వీడియో విడుదల చేశారు సుస్మిత.

''హుజూర్ నగర్‌లోని డెక్కన్ సిమెంట్స్ వారిని తుపాకీతో సుమంత్ బెదిరించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అందుకే ఆయన్ను తొలగించారని వేం నరేందర్ రెడ్డి మాకు చెప్పారు'' అని మీడియాకు విడుదల చేసిన వీడియోలో సుస్మిత చెప్పారు.

అయితే, ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీబీసీ సంప్రదించింది. ఆయన్నుంచి స్పందన రావాల్సి ఉంది.

డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం స్పందించలేదు. వారి స్పందన రాగానే ఈ కథనానికి జతచేస్తాం.

ఈ హైడ్రామా తర్వాత బుధవారం రాత్రి సుమంత్, మంత్రి కొండా సురేఖ… సుస్మిత ఇంటి నుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లడం కనిపించింది. ఈ దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.

మరోవైపు, హన్మకొండలో మీడియాతో మాట్లాడారు కొండా మురళి. తన కుమార్తె సుస్మిత హైదరాబాద్‌లో ఏం మాట్లాడిందో తెలియదన్నారు.

కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సుమంత్

అసలు ఎవరీ సుమంత్?

మంత్రులుగా ఉన్న వారికి ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో ఉన్న అధికారులను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా వీరిని మంత్రులే ఎంచుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది.

ఏ శాఖకు చెందిన మంత్రి ఉంటే, ఆ శాఖకు చెందిన అధికారులు లేదా కొన్నిసార్లు ఇతర శాఖలకు చెందిన అధికారులు కూడా ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తుంటారు.

ఎన్.సుమంత్ కాలుష్య నియంత్రణ మండలిలో పనిచేసేవారు. కొండా సురేఖ మంత్రి అయ్యాక ఆయన్ను ఏడాదిపాటు డిప్యూటేషన్‌పై ఓఎస్డీగా నియమిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మరో ఏడాది.. ఇలా పొడిగించుకుంటూ ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించింది.

ఆయనపై ఆరోపణలు రావడంతో ఓఎస్డీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ తెలంగాణ కాలుష్య నియంత్రిణ మండలి ఆదేశాలు జారీ చేయడం ఒక్కసారిగా చర్చకు తెరతీసింది.

మంత్రి కొండా సురేఖ, సినీ నటి సమంత

ఫొటో సోర్స్, UGC/Samantha/FB

ఫొటో క్యాప్షన్, మంత్రి కొండా సురేఖ, సినీ నటి సమంత

గతంలోనూ వివాదాలు..

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉందన్న విమర్శలున్నాయి.

నటి సమంత, నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. తర్వాత ఆమె వివరణ ఇచ్చుకుని క్షమాపణలు చెప్పారు. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

ఇటీవల దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మేడారంలో చేసే అభివృద్ధి పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలగజేసుకుంటున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకుని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దేవాదాయ శాఖ వద్ద ఈ పనులు చేసేందుకు అవసరమైన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఉండరని చెప్పి, పనుల బాధ్యతను ఆర్ అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కూడా మంత్రి వ్యవహారంపై ఇప్పటికే ఏఐసీసీకి, ముఖ్యమంత్రికి గతంలో ఫిర్యాదులు చేశారు.

ఆ తర్వాత ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ''అందరూ కలిసి సర్దుకుపోవాలి'' అని చెప్పి పంపించారు.

కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Konda Surekha/fb

''మా వద్దకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులం డబ్బులు తీసుకుని క్లియరెన్స్ ఇస్తుంటాం. నేనన్నా.. మాకు నయాపైసా ఇవ్వనక్కర్లేదు. సామాజిక సేవ చేయండి'' అని అన్నారు.

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తర్వాత ఆమె వివరణ ఇచ్చారు.

''గతంలో అలాంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మేం ఒక్క పైసా తీసుకోకుండా ఫైళ్లు వస్తున్నాయి.. పోతున్నాయి'' అని తర్వాత చెప్పారు కొండా సురేఖ.

కొండా సురేఖ, కాంగ్రెస్, తెలంగాణ, రాజకీయాలు, వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సురేఖ

మంత్రుల మధ్య వరుస విభేదాలు

ఒక్క కొండా సురేఖ వ్యవహారమే కాదు... ఈ మధ్యకాలంలో తెలంగాణలో మంత్రుల మధ్య వివాదాలు తరచూ బయటపడుతున్నాయి.

రవాణాశాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో.. ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఇరువురు మంత్రుల మధ్య సయోధ్య కుదిరి.. మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సురేఖ మధ్య మేడారం టెండర్ల విషయంలో వివాదం రేగింది. అయితే, పొంగులేటితో తమకు ఎలాంటి విభేదాలూ లేవని కొండా మురళి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)