సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?

ఫొటో సోర్స్, facebook/NandamuriSuhasini
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సంఖ్యాపరంగా మహిళా అభ్యర్థులు తక్కువగా కనిపిస్తున్నా వివిధ నియోజకవర్గాల్లో కీలక అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, సీపీఎంలతో పాటు పలు ఇతర పార్టీల నుంచీ మహిళా అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మహిళా నేతలకు టిక్కెట్లిచ్చే విషయంలో బీజేపీ మిగతా పార్టీల కంటే ముందుండగా మిగతా పార్టీలూ కీలక మహిళా నేతలను ఈ ఎన్నికల క్షేత్రంలో మోహరించాయి.
శాసనసభ రద్దు కావడానికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)పై బీజేపీ మహిళా అభ్యర్థినే పోటీకి నిలిపింది. గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్‌పై బీజేపీ తమ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలో దించింది.
మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటివారు పోటీలో ఉండగా కూటమిలోని మరో పార్టీ తెలుగుదేశం హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం కూకట్‌పల్లిలో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనుమరాలు నందమూరి సుహాసినిని పోటీలో నిలిపింది.
ఈ ఎన్నికల్లో తలపడుతున్న మరో కూటమి బీఎల్‌ఎఫ్ నుంచీ మహిళా అభ్యర్థులున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై పాలేరు నియోజకవర్గంలో ఈ కూటమిలోని సీపీఎం బత్తుల హైమవతిని బరిలో నిలిపింది.

ఫొటో సోర్స్, facebook/NandamuriSuhasini
1) నందమూరి సుహాసిని: కూకట్‌పల్లి నియోజకవర్గం
హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్‌పల్లి అన్ని పార్టీలకూ ప్రధాన లక్ష్యమే. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుతో ఆమె పోటీ పడుతున్నారు.
బీజేపీ ఇక్కడ మాధవరం కాంతారావుకు టిక్కెట్ ఇవ్వగా బీఎల్ఎఫ్ కూటమి నుంచి రాంబర్తి జవహర్ లాల్ పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) కుటుంబానికి చెందిన మహిళ నందమూరి సుహాసినిని ఇక్కడి నుంచి పోటీకి నిలపడంతో కూకట్‌పల్లి నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
సుహాసిని తండ్రి నందమూరి హరికృష్ణ కొద్ది రోజుల కిందటే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేయడంతోపాటు రాజ్యసభ సభ్యునిగానూ పనిచేశారు. సుహాసిని ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాధవరం కృష్ణారావు 2014 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచే విజయం సాధించినప్పటికీ అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో విజయాన్ని టీఆర్ఎస్, తెలుగుదేశం రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు.
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 3,07,198

ఫొటో సోర్స్, facebook/AkulaVijaya
2) ఆకుల విజయ: గజ్వేల్ నియోజకవర్గం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్ నియోజకవర్గంలో ఆకుల విజయ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఇక్కడ మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ నుంచి వంటేరు ప్రతాపరెడ్డి బరిలో దిగారు.
ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్న విజయ 2014 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె కేసీఆర్ తనయుడు కేటీఆర్‌పై పోటీ చేసి 14,494 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ఈసారి ఆమె నియోజకవర్గం మార్చుకోవడంతో పాటు కేసీఆర్‌పై పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నికల బరిలో ఉన్న మహిళా అభ్యర్థుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు.
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు: 2,11,218

ఫొటో సోర్స్, facebook
3) కొండా సురేఖ: పరకాల
తెలంగాణలోని సీనియర్ రాజకీయ నేతల్లో కొండా సురేఖ ఒకరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు. కొద్దినెలల కిందట వరకు టీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఆ పార్టీ నుంచి టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించుకున్నారు.
పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి విజయచంద్రారెడ్డి, బీఎల్ఎఫ్ అభ్యర్థి గోనె కుమారస్వామిలతో ఆమె పోటీ పడుతున్నారు.
శాయంపేట నియోజకవర్గం నుంచి 1999లో తొలిసారి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన ఆమె 2004లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి, 2009లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత 2011లో తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు రాగా 2012లో జరిగిన ఆ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం టీఆర్ఎస్‌లో చేరి 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 55 వేలకు పైగా ఆధిక్యంతో గెలిచారు.
అయితే, ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఆమెకు టిక్కెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పరకాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 1,81,473

ఫొటో సోర్స్, facebook/DKAruna
4) డీకే అరుణ: గద్వాల
గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డి.కె.అరుణ వరుసగా మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు.
1999లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో తెలుగుదేశం నేత గట్టు భీముడి చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అనంతరం 2004లో సమాజ్‌వాది పార్టీ గుర్తుపై పోటీ చేసి అదే ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2009, 2014 ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆమె మంత్రిగా పనిచేశారు. తమ ప్రాంత సమస్యలపై పాదయాత్రలు చేశారు.
డి.కె.అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, సోదరులు వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహనరెడ్డి కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె సోదరుడు చిట్టెం రామ్మోహనరెడ్డి మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
అరుణ భర్త డి.కె.భరతసింహారెడ్డి, బావ సమరసింహారెడ్డి, మామ సత్యారెడ్డి కూడా గద్వాల ఎమ్మెల్యేలుగా పనిచేశారు.
2005లో అరుణ తండ్రి నర్సిరెడ్డి, సోదరుడు వెంకటేశ్వరెడ్డిలు మావోయిస్టుల దాడిలో చనిపోయారు.
ప్రస్తుత ఎన్నికల్లో గద్వాలలో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి, ఆమె బంధువు బండ్ల కృష్ణమోహనరెడ్డి, బీజేపీ నేత వెంకటాద్రి రెడ్డి, బీఎల్ఎఫ్ అభ్యర్థి రంజిత్ కుమార్‌లతో పోటీ పడుతున్నారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 2,07,249

ఫొటో సోర్స్, facebook
5) సబిత ఇంద్రారెడ్డి: మహేశ్వరం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
భర్త ఇంద్రారెడ్డి మరణం తరువాత చేవెళ్ల స్థానం ఖాళీ కావడంతో తొలిసారి 2000 ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో మహేశ్వరం నుంచి గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లోనూ మహేశ్వరం నుంచే ఆమె బరిలో దిగారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. కృష్ణారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 3,23,660

ఫొటో సోర్స్, facebook/Dr.J.GeetaReddy
6) గీతారెడ్డి: జహీరాబాద్
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జె.గీతారెడ్డి తెలంగాణ ప్రాంతంలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు.
ఆస్ట్రేలియా, లండన్, సౌదీ అరేబియాల్లో వైద్యురాలిగా పనిచేసి భారత్‌కు తిరిగొచ్చాక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి 1989లో తొలిసారి గజ్వేల్ నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచారు.
అనంతరం 1994, 99 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2004లో మళ్లీ విజయం సాధించారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత గజ్వేల్ జనరల్ స్థానంగా మారడంతో 2009లో ఆమె జహీరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లోనూ జహీరాబాద్ నుంచే విజయం దక్కించుకున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు, బీజేపీ అభ్యర్థి జంగం గోపీ తదితరులతో ఇదేస్థానం నుంచి తలపడుతున్నారు.
గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 2,01,913

ఫొటో సోర్స్, facebook/PadmaDevenderReddy
7) పద్మ దేవేందర్ రెడ్డి: మెదక్
తెలంగాణ తొలి శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన పద్మ దేవేందర్ రెడ్డి ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. న్యాయవాదిగా పనిచేసిన ఆమె 2001లో టీఆర్ఎస్‌లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో రామాయంపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతిపై పోటీ చేసి గెలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లోనూ మెదక్ నుంచే బరిలో ఉన్నారు. ఈ స్థానంలో మహాకూటమి నుంచి టీజేఎస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య తదితరులు బరిలో ఉన్నారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 1,78,374

ఫొటో సోర్స్, facebook/SyedShahezadi
8) సయ్యద్ షెహజాదీ: చాంద్రాయణ గుట్ట
ఎంఐఎం పార్టీకి కంచుకోటగా చెప్పే చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బీజేపీ నుంచి సయ్యద్ షెహజాదీ బరిలో దిగారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షెహజాదీ ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంలో పీజీ చదివారు.
బీజేపీ విద్యార్థి విభాగంలో పలు కీలక పదవులు చేపట్టారు.
1999 నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వరుసగా గెలుస్తున్న చాంద్రాయణగుట్టలో ఆయన్ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఈసారి మంచి ఉపన్యాసకురాలిగా పేరున్న షెహజాదీని బరిలో దించింది.
ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఎం.సీతారామరెడ్డి, కాంగ్రెస్ నుంచి విఖ్యాత బాడీబిల్డర్ ఈసా మిస్రీ పోటీలో ఉన్నారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 2,94,132

ఫొటో సోర్స్, facebook/ReshmaRathore
9) భూక్యా రేష్మా రాథోడ్: వైరా
ఖమ్మం జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం వైరా నుంచి బీజేపీ తరఫున భూక్యా రేష్మా రాథోడ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆమె పలు సినిమాలు, సీరియళ్లలో నటించారు.
ఈ ఎన్నికల్లో సినీరంగం నుంచి ఎన్నికల బరిలో ఉన్న మహిళ రేష్మా ఒక్కరే.
జైశ్రీరామ్ వంటి సినిమాలు, మొగలి రేకులు సీరియల్‌లో ఆమె నటించారు.
ఈ నియోజకవర్గంలో మహాకూటమి నుంచి సీపీఐ అభ్యర్థిగా బానోత్ విజయ, టీఆర్ఎస్ నుంచి మదన్ లాల్ పోటీలో ఉన్నారు.
నియోజకవర్గ మొత్తం ఓటర్లు: 1,70,522

ఫొటో సోర్స్, facebook
వీరు కాకుండా టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి(ఆసిఫాబాద్), రేఖానాయక్(ఖానాపూర్), గొంగడి సునీత(ఆలేరు)..
కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి(నర్సాపూర్), మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత(ఆర్మూర్), సీతక్క(ములుగు), సిటింగ్ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి(కోదాడ).. గండ్రత్ సుజాత(ఆదిలాబాద్), సింగపూర్ ఇందిర(స్టేషన్ ఘన్‌పూర్)..
బీజేపీ నుంచి బొడిగె శోభ(చొప్పదండి), కంకణాల నివేదిత(నాగార్జున సాగర్), సీపీఎం నుంచి బత్తుల హైమవతి(పాలేరు) తదితర అభ్యర్థులూ ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
వీరిలో గండ్రత్ సుజాత ఆదిలాబాద్‌లో కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన జోగు రామన్నపై పోటీ చేస్తున్నారు. బత్తుల హైమవతి పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుతో తలపడుతున్నారు.
కంకణాల నివేదిత ఏడు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేస్తున్నారు. చొప్పదండిలో టీఆర్ఎస్ నుంచి సీటు దక్కించుకోలేకపోయిన సిటింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు.
సిద్ధిపేటలో హరీశ్‌రావుపై తెలంగాణ జన సమితి అభ్యర్థిగా మరికంటి భవానీ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- తొంభయ్యేళ్ల ఆ పార్టీ మేనిఫెస్టోలకి దూరం
- తెలంగాణ ఎన్నికలు 2018: నెహ్రూ నుంచి సోనియా గాంధీ దాకా... తెలంగాణపై ఏమన్నారు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








