జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ చరిత్రలో వాతావరణం, పరిస్థితులు, రాజకీయాలు ఎప్పుడూ అనూహ్యంగానే మారిపోతుంటాయి. ఆ విషయం బుధవారం మరోసారి రుజువైంది.
బీజేపీ- పీడీపీల పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత దాదాపు ఐదు నెలలకు, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో రాష్ట్ర శాసనసభను గవర్నర్ రద్దు చేశారు.
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ బుధవారం నాడు గవర్నర్‌కు లేఖ రాశారు. జమ్మూలోని రాజ్‌భవన్‌కు ఆ లేఖ అందిన కొన్ని గంటల్లోనే గవర్నర్ నిర్ణయం వెలువడింది.
గవర్నర్ సత్య పాల్ మాలిక్ తనకున్న రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేతృత్వంలోని కూటమి నుంచి ఈ ఏడాది జూన్‌లో బీజేపీ బయటకు వచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో జూన్ 19 నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉంది.
జమ్మూ కశ్మీర్‌లో అంపశయ్య మీద ఉన్న ప్రజాస్వామ్యానికి గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఎలా మేలు చేసిందన్నది నైతికవాదులు, మీడియా, చరిత్ర చర్చిస్తుంది.
కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీలు కలిసి ముందుకొచ్చిన వెంటనే గవర్నర్ ఎందుకు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీకీ- పీడీపీకి ఎక్కడ చెడింది?
భారత రాజకీయాల్లో తన ఉనికి మొదలైనప్పటి నుంచీ సంఘ్ పరివార్ అజెండాలో జమ్మూ కశ్మీర్ ఉంది. ఇక్కడ పాగా వేసేందుకు సంఘ్ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, అనుకున్న స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. కానీ, నరేంద్ర మోదీ అసాధారణ ఎదుగుదల దానికి బాగా అనుకూలించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
ఆ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. పీడీపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మెజార్టీ మాత్రం రాలేదు. దాంతో, ఆ పార్టీ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి జమ్ముూలో గట్టి పట్టు సాధించిన బీజేపీతో చేతులు కలపక తప్పలేదు.
పొత్తు సమయంలో జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి (35-A) అలాగే ఉంచేందుకు, కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో కొన్నింటిని రాష్ట్రానికి ఇవ్వడంతో పాటు పీడీపీ చేసిన పలు డిమాండ్లకు బీజేపీ అంగీకరించింది.
అది సంఘ్‌కు మింగుడుపడలేదు. ఆ పొత్తులో కుదిరిన ఒప్పందంతో విసుగు చెందిన ఒక మితవాద స్వచ్ఛంద సంస్థ 35-A రాజ్యాంగబద్ధం కాదంటూ కోర్టుకెళ్లింది.
నిజానికి పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభం నుంచీ రెండు పార్టీలు అనేక అంశాలపై విభేదించాయి. ముఖ్యంగా 2016లో వరుసగా చోటుచేసుకున్న అనిశ్చిత పరిస్థితులు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.

ఫొటో సోర్స్, JK GOVERNOR SECRETARIAT
అనేక పరిణామాల తర్వాత ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో సంక్షోభం ఏర్పడింది.
ఆ తర్వాత రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఐదు నెలలుగా అసెంబ్లీని రద్దు చేయాలంటూ దాదాపు అన్ని పార్టీలూ కోరుతున్నాయి. బీజేపీ మాత్రం దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చింది.
గవర్నర్ పాలన అలాగే కొనసాగితే ఏదో ఒకరోజు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం వస్తుందేమో అన్నది బీజేపీ ఆలోచన. అలా కొద్దికాలమైనా సొంత ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకోగలిగితే, అది 2019 ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికలకు దోహదపడొచ్చని ఆ పార్టీ భావించింది.
అందుకోసం, పీడీపీ, ఎన్‌సీల సభ్యలను కొనుగోలు చేసి ఆ పార్టీలను చీల్చేందుకు బీజేపీ వ్యూహం పన్నిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో అప్రమత్తమైన పీడీపీ, ఎన్‌సీలు... కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/SATYAPAL.MALIK.35/BBC
ఆ పరిణామంతో బెంబేలెత్తిపోయిన బీజేపీ... వెంటనే, ఇద్దరు సభ్యులున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) నేత సాజద్ లోన్ వెన్ను తట్టి ముందుకు తీసుకొచ్చింది. తనకు 25 మంది బీజేపీ సభ్యులతో పాటు, మరో 18 మంది 'ఇతర' ఎమ్మేల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని సాజద్ ప్రకటించారు. గవర్నర్‌కు లేఖ రాశారు.
దాంతో ఇరు వర్గాలు ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చాయన్న 'కారణాన్ని' చూపుతూ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దశాబ్దాలుగా సంకీర్ణమే
గత రెండు దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాల అనివార్యత ఏర్పడుతోంది.
1996 ఎన్నికల తర్వాత పీడీపీ అయినా, నేషనల్ కాన్ఫరెన్స్ అయినా జమ్ముూలో బలమున్న పార్టీలతో పొత్తులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు.
2002లో కాంగ్రెస్ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2008లో కాంగ్రెస్ మద్దతుతో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ రెండు పర్యాయాలూ అత్యధిక మంది కాంగ్రెస్ సభ్యులు జమ్మూ ప్రాంతానికి చెందిన వారే. 2014లో భిన్న ధ్రువాలు కలిగిన బీజేపీ, పీడీపీ చేతులు కలిపాయి.
87 మంది సభ్యులున్న జమ్మూ కశ్మీర్ సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 44 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి 28 మంది, కాంగ్రెస్‌కు 12 మంది, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)కి 15 మంది సభ్యులు ఉన్నారు. అంటే, ఈ మూడు పార్టీలకు కలిపి 55 మంది సభ్యుల బలముంది.
బీజేపీకి 25 మంది, ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ)కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతరులు అయిదుగురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- 1,398 మంది రైతుల రుణాలు మాఫీ చేసిన అమితాబ్ బచ్చన్
- నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా? సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన బామ్మ
- ‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








