జెఫ్రీ ఎప్‌స్టీన్: ‘ఏం చేయమంటావ్, చిన్నపిల్లలంటేనే నాకిష్టం’ అని చెప్పిన ఈ సెక్స్‌ట్రాఫికర్‌కు దేశాధినేతలు, ప్రముఖులతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, అవి ఎంత దాకా వెళ్లాయి?

ఎప్‌స్టీన్, మాక్స్ వెల్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 8 నిమిషాలు

‘నేనేమీ లైంగిక వేటగాడిని కాను. ఒక నేరస్తుడిని’ అని జెఫ్రీ ఎప్‌స్టీన్ 2011లో ‘న్యూయార్క్ పోస్ట్‌’ పత్రికకు చెప్పారు. ''ఇది ఒక హంతకుడికి, ఒక రొట్టె దొంగతనం చేసినవాడికి మధ్య ఉన్న తేడా లాంటిది'' అని ఆయన అన్నారు.

సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తూ, బెయిల్ పొందకముందే 2019 ఆగస్టు 10న న్యూయార్క్ జైలులో జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించారు.

మైనర్ బాలిక నుంచి లైంగిక సేవలు కోరిన కేసులో దోషిగా తేలి, లైంగిక నేరస్తుడిగా నమోదై పదేళ్లు గడిచిన తరువాత ఈ ఘటన జరిగింది.

మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేసే విస్తృత నెట్‌వర్క్‌ను నడిపినట్టు ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో తాను నిర్దోషినని ఆయన వాదించారు.

ఇప్పటివరకు అమెరికా అధికార యంత్రాంగం బహిర్గతం చేసిన పత్రాలు ఎప్‌స్టీన్ జీవితం గురించి, ఆయనకున్న ఉన్నతస్థాయి సంబంధాలపై మరింత సమాచారం వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఎప్‌స్టీన్ ఎవరు, ఎలా ఎదిగారు, ఆయన చుట్టూ ఉన్న వివాదాలేంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతం

అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలు 2025 నవంబర్‌లో భారీ మెజారిటీతో 'ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' ను ఆమోదించాయి. అనంతరం, ఎప్‌స్టీన్‌పై జరిగిన క్రిమినల్ విచారణలకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను డిసెంబర్ 19 నాటికి విడుదల చేయాలని ఆదేశించే బిల్లుపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

అయితే గడువు ముగిసే రోజున మొత్తం కాకపోయినా, కొంతమేర పత్రాలు విడుదలయ్యాయి. తరువాతి వారాల్లో మరికొన్ని పత్రాలు దశలవారీగా విడుదలయ్యాయి.

అయితే, ఈ వ్యవహారం ఇప్పటికి పూర్తిగా ముగిసిందో లేదో స్పష్టత లేదు. జనవరి 30న జరిగిన పత్రాల విడుదల సందర్భంగా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మాట్లాడుతూ, ఇది "పత్రాల గుర్తింపు, సమీక్ష ప్రక్రియకు ముగింపు" అన్నారు. కానీ న్యాయశాఖ అనేక పత్రాల విడుదల నిలిపివేసిందని, కొంతమంది కార్యకర్తలు, ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు.

డోనల్డ్ ట్రంప్‌తో ఎప్‌స్టీన్ (ఎడమ) ఇది 1997లో ఫ్లోరిడాలోని ట్రంప్‌ఎస్టేట్‌లో తీసిన ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌తో ఎప్‌స్టీన్ (ఎడమ) 1997లో ఫ్లోరిడాలోని ట్రంప్‌ఎస్టేట్‌లో తీసిన ఫోటో ఇది.

అద్భుతమైన మనిషి: ట్రంప్

న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన జెఫ్రీ ఎప్‌స్టీన్, 1970ల మధ్యలో నగరంలోని డాల్టన్ అనే ప్రైవేట్ స్కూల్‌లో గణితం, భౌతిక శాస్త్రం బోధించేవారు. యూనివర్సిటీలో ఆయన మ్యాథ్స్, ఫిజిక్స్ చదివినా, డిగ్రీ పొందలేదు.

ఎప్‌స్టీన్ దగ్గర చదువుకున్న ఓ విద్యార్ధికి తండ్రి అయిన ఓ వ్యక్తి ఎప్‌స్టీన్ ప్రతిభకు ఆకర్షితుడై, ఆయనను వాల్‌స్ట్రీట్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బేర్‌స్టెర్న్స్‌ లోని ఓ సీనియర్ పార్ట్‌నర్‌కు పరిచయం చేసినట్టు చెబుతారు.

నాలుగేళ్లలోనే ఎప్‌స్టీన్ అక్కడ భాగస్వామిగా ఎదిగారు. 1982 నాటికి ఆయన 'జె.ఎప్‌స్టీన్ అండ్ కంపెనీ' అనే తన సొంత సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన ఖాతాదారుల సంపదను మేనేజ్ స్థాయికి వేగంగా ఎదిగింది. ఆ తరువాత ఎప్‌స్టీన్ తన సంపదను ఫ్లోరిడాలో ఓ భారీ భవనం, న్యూమెక్సికోలో ఒక వ్యవసాయ క్షేత్రం, అలాగే న్యూయార్క్‌లోని అతిపెద్ద ప్రైవేట్ నివాసం కొనుగోలు వంటి వాటిపై వెచ్చించడం ప్రారంభించారు. అదే సమయంలో సెలబ్రిటీలు, కళాకారులు, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు.

''జెఫ్ నాకు పదిహేనేళ్లుగా తెలుసు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి,'' అని డోనల్డ్ ట్రంప్ 2002లో న్యూయార్క్ మ్యాగజైన్‌కు ఎప్‌స్టీన్‌పై వచ్చిన ఒక ప్రొఫైల్ కథనంలో చెప్పారు.

''ఆయనతో గడపడం చాలా సరదాగా ఉంటుంది. నాలాగే ఆయన కూడా అందమైన మహిళలను ఇష్టపడతారు. వారిలో చాలామంది యువతులే.'' అని అన్నారు.

''జెఫ్రీ తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడనడంలో ఎలాంటి సందేహం లేదు'' అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అయితే ఎప్‌స్టీన్ మొదటిసారి అరెస్టు కావడానికి చాలా ఏళ్ల ముందే, 2000ల ప్రారంభంలోనే తమ మధ్య విభేదాలు వచ్చాయని ట్రంప్ తరువాత చెప్పారు. ఎప్‌స్టీన్‌తో తన సంబంధాల కారణంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు.

ఎప్‌స్టీన్ ఇంట్లోని ఓ గది

ఫొటో సోర్స్, US Congress

ఫొటో క్యాప్షన్, ఎప్‌స్టీన్ ఇంట్లో ఓ గది

ఎందరితోనో స్నేహం

ఫ్లోరిడాలోని అప్పటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో 1997లో తీసిన ఒక ఫోటోలో ఎడమవైపున ట్రంప్‌తో కలిసి జెఫ్రీ ఎప్‌స్టీన్ కనిపిస్తారు.

ట్రంప్‌తో పాటు ఎప్‌స్టీన్‌కు మరెందరో ప్రముఖులు స్నేహితులుగా ఉన్నట్టు తెలిసింది. అయితే, వీరు ఎప్‌స్టీన్‌తో కనిపించడమే తప్ప, ఆయన నేరాలలో పాలు పంచుకున్నారని కాదు.

ఎప్‌స్టీన్ 2002లో కస్టమైజ్ చేసిన ఓ ప్రత్యేక ప్రైవేటు జెట్‌లో అప్పటి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో పాటు నటులు కెవిన్ స్పేసీ, క్రిస్ టక్కర్‌లను ఆఫ్రికాకు తీసుకెళ్లారు. 2003లో, అప్పటి సినీ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌తో కలిసి న్యూయార్క్ మేగజీన్‌ను కొనుగోలు చేయడానికి విఫలయత్నం చేశారు. అదే సంవత్సరం హార్వర్డ్ యూనివర్సిటీకి 30 మిలియన్ డాలర్లు విరాళంగా అందించారు.

బ్రిటన్ రాజకీయ నాయకుడు పీటర్ మాండెల్‌సన్‌తో కూడా ఎప్‌స్టీన్ స్నేహం చేశారు. కానీ ఎప్‌స్టీన్‌తో స్నేహం చేసినందుకు తరువాత తాను పశ్చాత్తాపపడ్డానని మాండెల్‌సన్ చెప్పారు. దీనివల్లే 2025లో మాండెల్‌‌సన్ తన అమెరికా రాయబారి పదవిని కోల్పోయారు. అనంతరం లేబర్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు.

ప్రముఖులతో స్నేహాలు ఉన్నప్పటికీ, ఎప్‌స్టీన్ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించేవారని సమాచారం. పెద్దపెద్ద వేడుకలు, రెస్టారెంట్ విందులకు దూరంగా ఉండేవారని చెబుతారు.

మిస్ స్వీడన్ విజేత ఇవా అండర్సన్ డ్యూబిన్, ప్రచురణకర్త రాబర్ట్ మ్యాక్స్‌వెల్ కుమార్తె గిస్లేన్ మ్యాక్స్‌వెల్ వంటి మహిళలతో ఎప్‌స్టీన్ సంబంధాలు కొనసాగించారు. అయితే ఆయన ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

టిఫనీ అండ్ కో సంస్థ మాజీ సీఈవో రోసా మాంక్టన్, 2003లో వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్‌స్టీన్‌ను "అత్యంత నిగూఢమైన వ్యక్తి, ఐస్‌బర్గ్ (నీటి మీద తేలే మంచు కొండ) లాంటి వ్యక్తిత్వం’’ అని అభివర్ణించారు.

‘‘ఆయనను పూర్తిగా తెలుసుకున్నాను అని మీరు అనుకునేలోపే ఆయన జీవితంలో మరో కోణం తెలుస్తుంది. అందులో ఇంకా ఏదో అసాధారణమైన విషయం కనిపిస్తుంది. అతని విషయంలో మీరు చూసిందల్లా నిజం కాదు’’ అని తెలిపారు.

ఎప్‌స్టీన్, ఆండ్రూ

ఫొటో సోర్స్, News Syndication

ఫొటో క్యాప్షన్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ఆండ్రూ (ఎడమ) విమర్శల పాలయ్యారు

2005లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన నివాసంలో ఎప్‌స్టీన్ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయగా ఇంటినిండా బాలికల ఫోటోలు కనిపించాయి.

మైనర్ బాలికలపై ఎప్‌స్టీన్ లైంగిక దోపిడీ అనేక ఏళ్లుగా కొనసాగుతోందని ‘మయామీ హెరాల్డ్’ పత్రిక రాసింది.

ఇది కేవలం ఒకరో ఇద్దరికో చెందిన సమస్య కాదని పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మైఖేల్ రైటర్ చెప్పారు.

"ఇది కేవలం ఒక అమ్మాయి ఆరోపణలు చేయడం, ఎప్‌స్టీన్ వాటిని తిరస్కరించడం మాత్రమే కాదు. 50 మందికి పైగా అమ్మాయిలు ముందుకు వచ్చారు, వారందరిదీ ఒకే కథ" అని ఆయన అన్నారు.

కేసు కోర్టుల్లో కొనసాగుతున్న సమయంలో న్యూయార్క్ మేగజీన్‌కు 2007లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కాలమిస్ట్ మైఖేల్ వోల్ఫ్ మాట్లాడుతూ,

"బాలికల విషయంలో ఎప్‌స్టీన్ ఎప్పుడూ రహస్యంగా వ్యవహరించలేదు. ఒకసారి తన సమస్యలు మొదలైన సమయంలో, 'నేనేం చేయగలను, నాకు చిన్న వయసు అమ్మాయిలు అంటే ఇష్టం' అని ఎప్‌స్టీన్ చెప్పారని వోల్ఫ్ వెల్లడించారు.

అయితే 2008లో ప్రాసిక్యూటర్లు ఎప్‌స్టీన్‌తో ఒక ఒప్పందానికి వచ్చారు.

దీంతో జీవితఖైదుకు దారి తీసే ఆరోపణల నుంచి ఎప్‌స్టీన్ తప్పించుకోగలిగారు. దీనికి బదులుగా ఆయనకు 18 నెలల జైలు శిక్ష పడింది. ఆ శిక్షా కాలంలో కూడా వారానికి ఆరు రోజులపాటు రోజుకు 12 గంటల పాటు ఆఫీసుకు వెళ్లే 'వర్క్ రిలీజ్' సౌకర్యం లభించింది. 13 నెలల తర్వాత ఆయనను ప్రొబేషన్ కింద విడుదల చేశారు.

ఈ ఒప్పందం ద్వారా ఎప్‌స్టీన్ నేరాల తీవ్రతను దాచిపెట్టారని, ఇంకా మరింతమంది బాధితులు లేదా శక్తిమంతమైన వ్యక్తులు ఇందులో ఉన్నారా అన్న విషయం బయటకు రాకుండా ఎఫ్‌బీఐ దర్యాప్తును నిలిపివేశారని మయామీ హెరాల్డ్ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని ఆ పత్రిక ‘శతాబ్దపు ఒప్పందం’ అంటూ వ్యంగ్యంగా అభివర్ణించింది.

ఈ వివాదం నేపథ్యంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ అకోస్టా 2019 జూలైలో రాజీనామా చేశారు. అయితే ఎప్‌స్టీన్‌కు కనీసం కొంతైనా జైలు శిక్ష పడేలా చేయడానికే తాను అలా చేశానని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఇక 2008 నుంచి ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్ రాష్ట్ర లైంగిక నేరస్తుల రిజిస్టర్‌లో అత్యంత ప్రమాదకరమైన 'లెవల్–3' హోదా కిందకు చేర్చారు. ఇది జీవితాంతం వర్తించే గుర్తింపు. ఆయన మళ్లీ నేరానికి పాల్పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపేందుకు ఇచ్చే గుర్తింపు.

అయితే, దోషిగా తేలిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తన ఆస్తులు, అంతస్తులను నిలుపుకున్నారు.

గియుఫ్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గియుఫ్రే

డిసెంబర్ 2010లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మూడో సంతానమైన ఆండ్రూ మౌంట్ బాటెన్-విండ్సర్ (అప్పట్లో ప్రిన్స్‌ ఆండ్రూగా పిలిచేవారు) న్యూయార్క్ సెంట్రల్ పార్కులో ఎప్‌స్టీన్‌తో కలిసి కనిపించిన ఫోటోలు వివాదానికి దారి తీశాయి.

బీబీసీకి 2019 నవంబర్‌లో ఆండ్రూ ఇచ్చిన ఇంటర్వ్వూలో 1999 నుంచి తనకు ఎప్‌స్టీన్‌ తెలుసని చెప్పారు. 2010లో తమ స్నేహాన్ని ముగించేందుకే తాను న్యూయార్క్‌కు వెళ్లానని కానీ అక్కడ ఎప్‌స్టీన్ ఇంట్లో బస చేయడం ద్వారా రాజ కుటుంబపు ప్రతిష్ఠను దెబ్బతీశానంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

కానీ తరువాత 2011 నాటి ఈమెయిల్స్ బయటపడటంతో, ఆండ్రూ‌ తాను అంతకు ముందు చెప్పినదానికంటే ఎక్కువకాలమే ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించినట్టు తేలింది. ఈ వివాదం ముదరడంతో 2025లో ఆయనకు ఉన్న రాజకుటుంబ హోదాలు తొలగించారు.

ఎప్‌స్టీన్ బాధితురాలైన వర్జీనియా రాబర్ట్స్ (తరువాత వర్జీనియా గియుఫ్రెగా పేరుపొందారు), 2000ల ప్రారంభంలో తన 17 ఏళ్ల వయసులో ఆండ్రూతో లైంగిక సంబంధానికి బలికావాల్సి వచ్చిందని ఆరోపించారు.

ఆండ్రూ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. లండన్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో గురించి తనకు ఎలాంటి జ్ఞాపకం లేదన్నారు. అయితే 2022లో, ఆమె దాఖలు చేసిన కేసును రాజీ చేసుకునేందుకు ఆండ్రూ ఆమెకు కోట్ల డాలర్లు చెల్లించారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎప్‌స్టీన్ అరెస్ట్ - ఎప్పటికీ జరగని విచారణ

2019 జూలై 6న తన ప్రైవేట్ జెట్‌లో పారిస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎప్‌స్టీన్‌కు చెందిన న్యూయార్క్‌ భవనంలో కొన్ని నేరాలు జరిగాయనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆ భవనాన్ని జప్తు చేయాలని ప్రాసిక్యూటర్లు పదేపదే ప్రయత్నించారు. కానీ ఎప్‌స్టీన్ తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ తిరస్కరిస్తూ తాను నిర్దోషినని వాదించారు.

కోర్టు బెయిల్ నిరాకరించడంతో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో ఆయనను నిర్బంధించారు. జులైలో మెడపై గాయాలతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు వార్తలు వచ్చాయి. అయితే జైలు అధికారులు గానీ, ఆయన న్యాయవాదులు గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు.

జూలై 31న జరిగిన చివరి విచారణలో, కనీసం ఏడాది పాటు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుందని స్పష్టమైంది. 2020 వేసవికి ముందుగా విచారణ జరిగే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. అయితే ప్రజా ప్రయోజనార్థం కేసును త్వరితగతిన విచారించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.

కానీ ఆ విచారణ ఎప్పటికీ జరగలేదు. ఎందుకంటే 2019 ఆగస్టులో ఆయన జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

మ్యాక్స్ వెల్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాక్స్‌వెల్ కేసు

ఎప్‌స్టీన్ మరణం తరువాత, ఆయన మాజీ ప్రేయసి గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌‌పై అందరి దృష్టి పడింది. 2020 జులైలో న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను గుర్తించి, లైంగిక దోపిడీకి గురిచేయడంలో ఎప్‌స్టీన్‌కు సహకరించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

న్యూయార్క్ జ్యూరీ 2021 డిసెంబర్‌లో ఆమెపై ఉన్న ఆరు ఆరోపణల్లో ఐదింటిలో దోషిగా తేల్చింది. ఇందులో అత్యంత తీవ్రమైనది. మైనర్‌పై లైంగిక అక్రమ రవాణా కేసు. 60 ఏళ్ల వయసులో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో ఆమె జీవితాంతం జైలులోనే ఉండే అవకాశం ఉంది.

ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న మ్యాక్స్‌వెల్.. బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి అనేక సంపన్నులు, శక్తిమంతులైనన వ్యక్తులతో ఎప్‌స్టీన్‌కు పరిచయం చేసినట్లు చెబుతారు.

మ్యాక్స్‌వెల్, ఎప్‌స్టీన్ మధ్య ప్రేమబంధం కొన్ని సంవత్సరాలకే ముగిసినప్పటికీ, ఆ తరువాత కూడా ఆమె ఎప్‌స్టీన్‌తో కలిసి పనిచేశారని స్నేహితులు తెలిపారు.

పామ్ బీచ్‌లోని ఎప్‌స్టీన్ భవనంలో పనిచేసిన ఉద్యోగులు, మ్యాక్స్‌వెల్‌ను హౌస్ మేనేజర్‌గా పేర్కొన్నట్టు కోర్టు పత్రాలు చెబుతున్నాయి. సిబ్బందిని పర్యవేక్షించడం, ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం, సామాజిక కార్యక్రమాలను సమన్వయం చేయడం ఆమె బాధ్యతలని వారు చెప్పారు.

అయితే 2003లో వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాక్స్‌వెల్ తనకు వేతనం తీసుకునే ఉద్యోగి కాదని తన "అత్యంత సన్నిహిత స్నేహితురాలు" మాత్రమేనని ఎప్‌స్టీన్ చెప్పారు.

ఎప్‌స్టీన్ లైంగికంగా దోచుకోవడానికి వీలుగా మ్యాక్స్‌వెల్ బాలికలను ప్రలోభపెట్టారని, శిక్షణ ఇచ్చారని విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే ఎప్‌స్టీన్ మరణించిన తర్వాత ఆయన నేరాలకు తనను బలిపశువుగా మార్చారని మాక్స్‌వెల్ వాదించారు.

దోషిగా తేలిన అనంతరం మ్యాక్స్‌వెల్ కొంత పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ‘ఎప్‌స్టీన్‌ను కలవడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)