శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం: ‘సుప్రీం కోర్టు తీర్పుతో కులాల మధ్య చీలిక’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించేందుకు అనుమతించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం కేరళలో అగ్రకులాలు, వెనుకబడిన తరగతుల వారిలో చీలిక తెచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరులను మార్చుకోవాల్సి వస్తోంది.
వైఖరిలో మార్పు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను కూడా వదలలేదు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో కేరళలో సంఘ్ శాఖలు ఉన్నాయి.
సుప్రీం తీర్పును ఆర్ఎస్ఎస్ తొలుత ఆహ్వానించినప్పటికీ ఇప్పుడు హిందూ ఐక్య వేది ఆధ్వర్యంలో ఇతర హిందూ సంస్థలు చేపడుతున్న ఆందోళనకు మద్దతివ్వాలని ఇటీవల ఒక భేటీలో నిర్ణయించింది.
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశాన్ని నిషేధించే శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. అన్ని వయసుల్లోని మహిళలందరికీ ఆలయ ప్రవేశానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4 - 1 మెజారిటీతో ఇటీవల తీర్పు చెప్పింది.
ఆ తీర్పు వెలువడిన వారం రోజులకు తీర్పుపై నిరసనలు పూర్తిస్థాయి ఆందోళనగా రూపొందాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. సంప్రదాయానికి మద్దతుగా భారీ సంఖ్యలో మహిళలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ సమరంలో చేతులు కలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ.. తాను అలా చేయలేనని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం చెప్తోంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికీ తాము మద్దతిస్తున్నామని ఇంతకుముందు తాము సుప్రీంకోర్టుకు నివేదించినందున.. ఇప్పుడు దానికి విరుద్ధంగా రివ్యూ పిటిషన్ వేయలేమని అంటోంది.
ఈ ఆందోళన కారణంగా.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కూడా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తరహాలోనే తొలుత సుప్రీంకోర్టు తీర్పును సమర్థించిన కాంగ్రెస్ పార్టీని కూడా విజయన్ ఉపేక్షించలేదు.
''ఈ తీర్పును అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది'' అని విజయన్ ఇటీవల విలేకరులతో పేర్కొన్నారు.
కేరళలో రగులుతున్న ఆందోళనల మధ్య కీలకమైన దశలో విజయన్ ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో ఏకాభిప్రాయం సాధించటానికి ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యేందుకు.. ఆలయ నిర్వాహకులైన పందాళం రాచ కుటుంబ ప్రతినిధులు, ఆలయ ప్రధాన పూజారి నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు విజయన్ మీడియాతో మాట్లాడుతుండగానే.. పీపుల్ ఫర్ ధర్మ, తళమన్ తంత్రి కుటుంబం, నాయర్ సర్వీస్ సొసైటీ, పందాళం రాచ కుటుంబం తదితర హిందూ సంస్థలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
''మా సంప్రదాయం ప్రకారం పాత ఆచారాలను పాటించాలని మేం కోరుతున్నాం'' అని ప్రధాన పూజారి రాజీవరు కందారరు బీబీసీతో పేర్కొన్నారు.
''ఈ ఆచారాలు మన రాజ్యాంగానికి విరుద్ధం. మహిళలకు వ్యతిరేకమైన ఆచారాలను బలోపేతం చేయటానికి ఈ ఆందోళన ప్రయత్నిస్తోంది. కేరళలో చరిత్రాత్మక సంస్కరణ ఉద్యమాన్ని ఇది నీరుగారుస్తోంది. సమాజంలో బ్రాహ్మణవాద వ్యవస్థను తిరిగి స్థాపించటానికి ఈ ఆందోళన ప్రయత్నిస్తోంది'' అని దళిత ఉద్యమకారుడు, రచయిత సన్నీ ఎం. కపికాద్ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై వ్యక్తమవుతున్న మద్దతు, వ్యతిరేకతల వల్ల.. బ్రాహ్మణులు, నాయర్ వర్గాల వారిని దళితులు, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యర్థులుగా నిలిపింది. ''ఇప్పుడు కుల విభజన కనిపిస్తోంది'' అని సన్నీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎస్ఎస్ తన వైఖరిపై మార్పు విషయంలో విభిన్నంగా స్పందిస్తోంది. ''శబరిమల ఆలయం గురించి నిర్ణయించగల ప్రధాన వ్యక్తులు పందాళం రాచ కుటుంబం, తాంత్రీలని మేం నిర్ణయం తీసుకున్నాం. రివ్యూ పిటిషన్ వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని వారిద్దరూ నిర్ణయించారు. హిందూ సంస్థలకు మద్దతివ్వాలని ఆర్ఎస్ఎస్ తీర్మానించింది'' అని ఆర్ఎస్ఎస్ కేరళ విభాగం ఉపాధ్యక్షుడు కె.కె.బలరాం చెప్పారు.
''మహారాష్ట్రలోని శని శిగ్నేశ్వర ఆలయంతో పోల్చినపుడు కేరళలో పరిస్థితి విభిన్నమైనది. శబరిమలలో మహిళలను నిషేధించలేదు. కేవలం కొన్ని వయసుల వారి మహిళల ప్రవేశానికి అనుమతించరు. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కు చెందిన పార్టీలు అక్టోబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ పందాళం నుంచి తిరువనంతపురం వరకూ లాంగ్ మార్చ్ ప్రారంభిస్తాయి'' అని బీజేపీ కేరళ విభాగం మాజీ అధ్యక్షుడు వి.మురళీధరన్ తెలిపారు.
ఈ పరిస్థితి ''ఆసక్తికరంగా'' ఉందని ద హిందు దినపత్రిక తిరువనంతపురం అసోసియేట్ ఎడిటర్ సి.కె.గౌరీదాసన్ నాయర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నాయి. ఇప్పుడు తను ఇటువంటి తీరు చేపట్టకపోతే క్రెడిట్ అంతా బీజేపీకి వెళుతుందన్నది కాంగ్రెస్ వైఖరిగా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. నేడు వీధుల్లో ఆందోళన చేస్తున్న వారు కాంగ్రెస్ వారా లేక బీజేపీ వారా అన్నది మనకు తెలియదు. కాంగ్రెస్ దెబ్బతింటుందని నాకు అనిపిస్తోంది. ఇది చిత్రమైన విషయం. కీలకమైన సాధారణ జనంలో బీజేపీ పట్టు పెంచుకోవచ్చు. ఏం చెప్పలేం. విభజన మరింతగా పెరగవచ్చు'' అని కూడా నాయర్ అభిప్రాయపడ్డారు.
కేరళలో సీపీఎం ప్రధానంగా హిందూ పార్టీ అన్నది బాగా తెలిసిన విషయమే. మైనారిటీ ఓట్లలో (జనాభాలో క్రిస్టియన్లు, ముస్లింలు దాదాపు 46 శాతం మంది ఉన్నారు) ప్రధాన భాగం.. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) వెనుకే ఉన్నారు. 2016లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. మైనారిటీల్లోని ఒక వర్గం సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కు ఓటు వేసింది. బీజేపీ పెరుగుదలను యూడీఎఫ్ అడ్డుకోజాలదన్న అనుమానం ఉండటమే దీనికి కారణం. అప్పుడు బీజేపీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకోగలిగింది.
- పీరియడ్స్‌లో గుడికి వెళ్తే తప్పేంటి?
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- నేను వేశ్యగానే ఉంటా : వ్యభిచార వృత్తిలో కొనసాగే హక్కు కోసం పోరాడిన మహిళ
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








