సోయజ్ రాకెట్‌లో సాంకేతిక లోపం.. వ్యోమగాములకు తప్పిన ప్రమాదం

సోయజ్ రాకెట్‌లో సాంకేతిక లోపం

ఫొటో సోర్స్, NASA/bbc

రష్యా తయారీ సోయజ్ రాకెట్ కజకిస్తాన్‌ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరినపుడు రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది.

అందులో ఉన్న సిబ్బంది ‘బాలిస్టిక్ డిసెంట్ మోడ్’లో తిరిగి వెనక్కి రావలసివచ్చిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ట్విటర్‌లో తెలిపింది. అంటే రాకెట్ మామూలుగా ల్యాండ్ అయ్యే కోణం కన్నా నిలువు కోణంలో ల్యాండ్ అయిందని వివరించింది.

కజకిస్తాన్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:40 గంటలకు సోయజ్ రాకెట్ నింగికెగసింది. ఆరు గంటలు ప్రయాణించి ఐఎస్ఎస్‌కు చేరుకోవాల్సి ఉంది.

అంతరిక్ష శాస్త్రవేత్తలైన హేగ్, ఒవిచిన్‌లు ఈ రాకెట్‌లో స్పేస్ స్టేషన్‌కు బయలుదేరారు. అనేక పరిశోధనాత్మక ప్రయోగాలు చేస్తున్న వీరు స్పేస్ స్టేషన్‌లో ఆరు నెలల పాటు ఉండాల్సి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

విశ్లేషణ: పాత కాలపు రాకెట్ల సామర్థ్యంపై చర్చ

జొనాథన్ అమోస్, బీబీసీ సైన్స్ ప్రతినిధి

అంతరిక్ష యానానికి ఉపయోగిస్తున్న అత్యంత పాత రాకెట్లలో సోయజ్ ఒకటి. అయితే.. చాలా సురక్షితమైనది కూడా. తాజాగా ఈ రాకెట్ ఐఎస్ఎస్‌కు పయనమైనపుడు.. దాని ‘దశ’ల్లో లోపం తలెత్తినట్లు కనిపిస్తోంది. నింగిలోకి వెళుతున్న రాకెట్.. ఇంధనం మండిపోయిన తర్వాత ఖాళీ భాగాలను జారవిడవటం ఈ ‘దశ’ల్లో జరుగుతుంది.

రాకెట్ బయలుదేరినపుడే ఏదో సమస్య తలెత్తిందని అందులో ఉన్న వ్యోమగాములకు అర్థమైంది. ఎందుకంటే.. రాకెట్ నింగిలోకి వెళుతున్నపుడు వారు తమ సీట్లలో వెనక్కు నెట్టివేస్తున్నట్లు అనిపించాలి. కానీ.. తాము భార రహిత స్థితిలో ఉన్నట్లు అనిపిస్తోందని వారు రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సిబ్బందికి నివేదించారు.

సోయజ్ రాకెట్‌లో సాంకేతిక లోపం

ఫొటో సోర్స్, NASA/twitter

ఇటువంటి పరిస్థితి తలెత్తితే తప్పించుకోవటానికి ఉద్దేశించిన వ్యవస్థలను అప్పటికే పరీక్షించి సిద్ధంగా ఉంచటంతో వ్యోమగాములు తిరిగి భూమికి రాగలిగారు. అయితే.. భూమి మీదకు దిగేటపుడు ఆ క్యాప్స్యూల్ చాలా వేగంగా పయనించటం వల్ల వ్యోమగాములు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు.

రష్యా అంతరిక్ష పరిశోధన రంగం ప్రస్తుత పరిస్థితి, గత కాలపు ప్రమాణాలను కొనసాగించటంలో ఆ దేశానికి గల సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. తాజా సంఘటన మీద దర్యాప్తులో ఏమి తేలినప్పటికీ.. ఆ ఆందోళనలను ఈ సంఘటన మరింత బలపరుస్తుంది. ప్రత్యేకించి అమెరికా కొత్త రాకెట్ వ్యవస్థలను ఆచరణలోకి తీసుకురావలసిన అవసరాన్ని ఉద్ఘాటిస్తుంది. బోయింగ్, స్పేస్‌ ఎక్స్ సంస్థలు రూపొందించిన ఈ కొత్త అంతరిక్ష వాహనాలు వచ్చే ఏడాది రంగంలోకి దిగనున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)