హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు.. అవి 'అనుచిత వ్యాఖ్యలే'నన్న విరాట్ కోహ్లీ.

హార్దిక్ పాండ్యా, కరణ్ జోహర్, కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Twitter/@HARDIKPANDYA

ఫొటో క్యాప్షన్, హార్దిక్ పాండ్యా, కరణ్ జోహర్, కేఎల్ రాహుల్

'కాఫీ విత్ కరణ్ షో'లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను విచారణ పూర్తయ్యే వరకు టీమ్ నుంచి సస్పెండ్ చేశారు.

దీంతో ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో పాల్గొనరు.

కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (సీఓఏ) ఛైర్మన్ వినోద్ రాయ్, ''విచారణ పూర్తయ్యేవరకు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నాం'' అని పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

'కాఫీ విత్ కరణ్ షో'లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ల తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. బుధవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది.

దీనిపై వారిద్దరూ బోర్డుకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా ద్వారా కూడా క్షమాపణలు తెలిపారు.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, TWITTER/HARDIK PANDYA

సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాండ్యా, రాహుల్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.

బీసీసీఐ లీగల్ టీమ్ కూడా వారిద్దరిపై ఒక స్వతంత్ర న్యాయాధికారి ద్వారా విచారణ జరిపించాలని అభిప్రాయపడింది.

పాండ్యా, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వివాదంపై స్పందించారు. హార్దిక్ పాండ్యా, రాహుల్‌లు మహిళల గురించి చేసిన "అనుచిత" వ్యాఖ్యలను తన జట్టులోని ఆటగాళ్ళు సమర్థించరని అన్నారు.

"ఆ ఇద్దరు ఆటగాళ్ళకు ఎక్కడ తప్పు జరిగిందో, అది ఎంత పెద్ద తప్పో అర్థమైంది" అని కోహ్లీ అన్నారు.

పాండ్యా, రాహుల్ అందుబాటులో లేకపోయినా, జట్టు సర్దుకుపోయే ప్రయత్నం చేస్తుందని చెప్పిన కోహ్లీ, "పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండకపోవచ్చు. మారిన పరిస్థితులను బట్టి నడుచుకోవాల్సిందే" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)