న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పులు: ఆత్మీయులను కోల్పోయిన వారి అంతరంగం

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES
- రచయిత, జే సావేజ్
- హోదా, బీబీసీ న్యూస్, క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదులో కాల్పుల ఘటన బాధితుల గాధలు ప్రపంచంలో ఉన్న ఆందోళనలకు అద్దం పడుతున్నాయి. యుద్ధం, పేదరికం, ఆర్థిక అసమానతలే వీటి వెనకున్న కారణాలు.
ఈ భూమి మీద ఓ సురక్షితమైన, ప్రశాంత ప్రదేశంలో కొత్త జీవితం ప్రారంభించామని న్యూజీలాండ్‌లో చాలామంది భావించేవారు. కానీ, గత శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో ఆ నమ్మకం చెదిరిపోయింది.
"మా పిల్లలను మంచిగా పెంచడానికి మాకో అందమైన దేశం దొరికిందని చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు జరిగిన ఘటన నన్ను చాలా బాధిస్తోంది" అని ఈ దాడుల్లో నుంచి బయటపడిన మజరుద్దీన్ సయ్యద్ అహ్మద్ తెలిపారు.
50 మంది ప్రాణాలను బలిగొన్న ఆ వారంలో క్రైస్ట్‌చర్చ్ మొత్తం తామంతా ఈ సమయంలో ఒక్కటిగా ఉన్నామని బలమైన సందేశం ఇచ్చింది. సమాజంలో అంతకు ముందు పట్టించుకోని ఓ వర్గంవైపు వారి దృష్టిని ఈ ఘటన మరలేలా చేసింది.
ద్వేషభావం ప్రజ్వరిల్లడం, అది ఉద్రిక్తరూపం దాల్చడం ఎంత సులభమో కూడా గుర్తుచేసింది. తమ ప్రపంచం ఎంత సున్నితమైనదో గత శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్నవారి జీవితాలను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, HANDOUT
చావు నుంచి దూరంగా...
44ఏళ్ల ఖాలిద్ ముస్తఫా, ఆయన కుమారుడు 16ఏళ్ల హమ్జా సిరియా నుంచి వచ్చిన శరణార్ధులు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలసి వారు సిరియా యుద్ధం నుంచి తప్పించుకుని ఇక్కడకు వచ్చారు. న్యూజీలాండ్ శరణార్థుల పునరావాస కార్యక్రమం ప్రకారం తమను అనుమతించడానికి ముందు జోర్డాన్‌లో కొద్ది రోజులున్నారు.
న్యూజీలాండ్ సురక్షిత ప్రాంతం అని వారు అనుకుని దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు. మొదటి దాడి జరిగిన డీన్స్ ఎవెన్యూలో అల్ నూర్ మసీదు దగ్గర వీరంతా మరణించారు.
అబో అలీ 1990లో సిరియా నుంచి న్యూజీలాండ్ వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారే తన కుటుంబాన్ని కలుసుకున్నా, మంచి జీవితం దొరికినందుకు వారంతా సంతోషంగా ఉన్నారు.
"వాళ్లు అక్కడ మృత్యువు నుంచి తప్పించుకుని వచ్చి ఇక్కడ చనిపోయారు" అని అలీ బీబీసీతో అన్నారు.
హమ్జా తమ్ముడు జైద్ కూడా అప్పుడు మసీదు దగ్గరే ఉన్నారు. గాయాలతో బయటపడ్డారు. తన సోదరుడు, తండ్రిల అంత్యక్రియలకు ఆయన ఆపరేషన్ తర్వాత చక్రాల కుర్చీలో హాజరయ్యారు.
"నేను కూడా మీతో పాటే చనిపోయి ఉండాల్సింది. మీతో పాటే ఇక్కడే నన్ను కూడా సమాధి చేసి ఉండాల్సింది" అని ఆయన సమాధుల దగ్గరే కూర్చుని రోదిస్తున్నారు.
సిరియాలోని ముస్లిం వర్గాల్లో ఈ వార్త చాలా వేగంగా వ్యాపించిందని అబో చెప్పారు. "కానీ న్యూజీలాండ్ ప్రజల మద్దతు చూసిన తర్వాత ప్రత్యేకించి అక్కడి క్రైస్తవులు మాకు అందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము."

ఆమె కలలు నిజం చేయడమే నా కల
24ఏళ్ల ఆన్సీ అలీబావా న్యూజీలాండ్‌కు రావడమే ఓ అనూహ్యం. కేరళలో పుట్టిన ఆన్సీ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి సౌదీ అరేబియాలో పనిచేస్తూ మరణించిన తర్వాత 18 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించారు.
మొదటిసారి కలిసినప్పుడు ఆమె తన కుటుంబాన్ని చక్కపెడుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయా అని ఆమె భర్త అబ్దుల్ నాజర్ అన్నారు.
ఓ సంవత్సరం తర్వాత తమ కలలను నిజం చేసుకోవడానికి వీరిద్దరూ విదేశాలకు వెళ్లారు. "ఆమె కలలను సాకారం చేయడమే నా కల" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
న్యూజీలాండ్‌లో వారు ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తొస్తే ఆయనకు మాటలు రావడం లేదు.
గత శుక్రవారం కూడా ఎప్పటిలాగే వీరిద్దరూ అల్ నూర్ మసీదుకు వెళ్లి, స్త్రీ, పురుష లైన్లలోకి వెళ్లి కూర్చున్నారు.

తుపాకుల మోతలు మొదలవ్వగానే నాజర్ ఆ తోపులాటలో ఓ ఇంటి కంచెపై పడ్డారు. ఆయన కూడా ఉగ్రవాదేమోననే అనుమానంతో ఆ భవన యజమాని ముందు ఆయనను లోపలకి రానివ్వలేదు.
కాసేపటికే మళ్లీ తన భార్యను వెతకడానికి బయటకు వెళ్లిపోయారు. రోడ్డుపై కదలకుండా పడి ఉన్న తన భార్యను చూశారు. కానీ అక్కడకు అప్పటికే చేరిన పోలీసులు ఆయనను కూడా దగ్గరకు రానివ్వలేదు.

నా భర్త - ఎంత మంచివారో
మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ షాపు ఇండియన్ గ్రిల్ ముందు పుష్పగుచ్ఛాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. స్నేహితులంతా ఇమ్రాన్ భాయ్ అని ప్రేమగా పిలుచుకునే ఖాన్ లిన్‌వుడ్ మసీదులో జరిగిన కాల్పుల్లో మరణించారు.
భారత్‌కు చెందిన ఇమ్రాన్ క్రైస్ట్‌చర్చ్‌లో అందరికీ బాగా తెలుసు.
"ఇంతటి భారీ సంఖ్యలో పువ్వులు, సందేశాలు చూస్తుంటే ఆయనంటే ఇక్కడివారందరికీ ఎంత ప్రేమాభిమానాలున్నాయో అర్థమవుతోంది. ఇష్టమే అని తెలుసు కానీ మరీ ఇంతగా అని నాకు తెలియదు" అని ఇమ్రాన్ భార్య ట్రేసీ అన్నారు.

ఈ దేశం చాలా సురక్షితం
న్యూజీలాండ్ ఎంత సురక్షితమో, కొత్తవారిని ఎంతగా తమలో కలుపుకుంటుందో వచ్చిన కొత్తలో నాకు అర్థం కాలేదని భారత్‌లో పుట్టి, సౌదీలో పెరిగిన మజరుద్దీన్ సయ్యద్ అహ్మద్ చెప్పారు.
"మీరంతా విమానాశ్రయాలకు వెళ్లాలంటే భయపడతారు. కానీ మాకు మాత్రం ఎయిర్‌పోర్టులంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ దేశం మొత్తం సురక్షితమే" అని విదేశాల్లోని స్నేహితులతో ఆయన తరచూ చెప్పేవారు.
లిన్‌వుడ్ మసీదు పేదలకు ఇల్లు లాంటిది అని సయ్యద్ అంటున్నారు. కానీ ఇలాంటి ప్రదేశంలో ఈ దారుణం జరిగిందంటే ఆయన నమ్మలేకపోతున్నారు. మూడు రౌండ్ల తుపాకీ కాల్పులు వినగానే తాను బిగుసుకుపోయానని ఆయన చెబుతున్నారు.
అబ్దుల్ అజీజ్ అనే మరో వ్యక్తి కాల్పులు జరుపుతున్న వ్యక్తిపైకి క్రెడిట్ కార్డు స్వైపింగ్ మెషీన్ విసిరి తనను కాపాడారు.

ఫొటో సోర్స్, EPA
దారుణ వ్యక్తిత్వం అది
డజన్ల కొద్దీ బాధితులు న్యూజీలాండ్ నుంచి బయటకొచ్చి తమ జీవితాలు ప్రారంభించారు.
64 ఏళ్ల లిండా ఆర్మ్‌స్ట్రాంగ్ ఆక్లాండ్ సమీపంలోని వైహెక్ ఐలాండ్ సమీపంలో నివసించేవారు. ఓ చిన్న గుడిసె, దానిలో ఓ చిన్న మరుగుదొడ్డి మాత్రమే ఆమెకు ఉండేవి.
2011లో ఆక్లాండ్‌లోని శరణార్ధుల కేంద్రంలో అక్కడివారితో మాట్లాడే సమయంలో ఆమెకు ఇస్లాంపై ఆసక్తి పెరిగింది.

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
తన అత్త ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించేవారని, చాలా మొండిగా ఉండేవారని ఆమె చెప్పేవారు. మసీదుకొచ్చినా ఆమె అలాగే ఉండేవారు.
ప్లాస్టిక్ ప్లేట్ల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, దాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె పునర్వినియోగ ప్లేట్లను తీసుకొచ్చారు.
డబ్బులు లేకపోయినా ఆమె ఇంత ఉదారంగా ఉండేవారు. ప్రతి నెలా సిరియా శరణార్థులకు కొంత సొమ్ము విరాళంగా ఇచ్చేవారు.

ఫొటో సోర్స్, Reuters
"నిజానికి ఆమె వారినెప్పుడూ కలుసుకోలేదు. ఎవరి ద్వారానో వారి కష్టాలను తెలుసుకుని, నేనేం చేయగలను అని ఆలోచించి, ఈ విధంగా స్పందించారు" అని గాసీ చెప్పారు.
"కాల్పులు జరిగిన రోజు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె వెనక కూర్చున్నారు. కానీ ఇతరులను కాపాడటానికి అదేమీ ఆమెకు అడ్డుకాలేదు. తన స్నేహితుడిపైకి దూసుకొస్తున్న బులెట్‌కు అడ్డుగా నిలబడి తన ప్రాణాలను త్యాగం చేసి వారిని కాపాడారు" అని గాసీ చెప్పారు.

మా సోదరుడు కనిపించడం లేదు
ఈవారంలో క్రైస్ట్‌చర్చ్ ప్రజలంతా 2011 లో సంభవించిన భూకంపంలో 185 మంది మరణం మిగిల్చిన విషాదాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఇది కూడా అలాంటి బాధే, కాకపోతే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఓ మనిషి దురాగతం వల్ల కలిగిన బాధ. భూకంపం మిగిల్చిన ఆస్తి నష్టాన్ని కొద్దికాలానికి పూడ్చుకోవచ్చు. కానీ ఇది అలాంటిది కాదు.
బాధితుడు జకారియా భూయా కూడా ఈ పనిలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వచ్చి స్థిరపడిన జకారియా... భూకంపం తర్వాత నగర నిర్మాణ పనులకోసం ఇక్కడకి వచ్చారు. శుక్రవారం నాడు 33వ పుట్టిన రోజు చేసుకునేందుకు ఆయన అల్ నూర్ మసీదుకు వచ్చారు.
చాలా తక్కువ ఖర్చుతో తన జీవితాన్ని గడుపుతూ, సాధ్యమైనంత డబ్బును తన కుటుంబం కోసం ఇంటికి పంపడానికి ప్రయత్నించేవారు అని ఆయన పనిచేసే కంపెనీ ఏఎంటీ మెకానికల్ యాజమాన్యం తెలిపింది.
క్రైస్ట్‌చర్చ్‌లో ఆయనకు ఎవరూ లేరు. అందుకే ఇన్ని రోజులు గడిచినా ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. అందుకే ఆయన స్నేహితులు మసీదు ముందు ఓ నిరసన చేస్తున్నారు.

అతను నా జీవితాన్నే మార్చేశాడు
4 లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరంలో అందరికీ బాధితుల్లో ఎవరో ఒకరు తెలిసే ఉంటుందంటే ఆశ్చర్యం కాదు.
గుండె జబ్బు, తదనంతర ఇబ్బందుల కారణంగా కార్డియాలజిస్ట్ అంజాద్ హమీద్ సూచనలతో పదవీ విరమణ చేశారు 67ఏళ్ల పీటర్ హిగ్గిన్స్.
"ఆ ఆగంతకుడు నా జీవితాన్నే మార్చేశాడు" అని పాలస్తీనియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన 57 ఏళ్ల డాక్టర్ హమీద్ చెబుతారు.
ఈ విషాదం ఇక్కడ నివసించే ముస్లింలందరి గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసింది.
మరణించినవారిలో మొదటగా గుర్తించినది 72 ఏళ్ల క్లారె నీధమ్ మృతదేహాన్ని అని 70 ఏళ్ల దావూద్ నబీ చెప్పారు. క్లారె తరచూ స్వచ్ఛందంగా ఏదో ఒక రూపంలో విరాళాలు ఇచ్చేవారు. దానాల కోసం కొనే వస్తువులను బాగా బేరమాడి కొనేవారు.
అఫ్ఘానిస్తాన్‌లో పుట్టినా చాలాకాలం నుంచ న్యూజీలాండ్‌లోనే ఉంటున్నారు నబీ. అంతేకాదు, ఆయన స్థానికి అఫ్ఘాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇతర శరణార్థి బృందాలకు సహాయం చేస్తుంటారు కూడా.
డేవ్ పామర్‌కు నివాళులర్పించడానికి వచ్చిన ఫరీద్ అహ్మద్ భార్య కూడా ఈ దాడిలో మరణించారు. కానీ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని తాను క్షమిస్తున్నానని ఆయన అంటున్నారు.
ఫరీద్ అహ్మద్, లిండా ఆర్మ్‌స్ట్రాంగ్‌లు ప్రదర్శించిన సహనం, మానవత్వం పూర్తిగా కాల్పులు జరిపిన వ్యక్తి ధోరణికే కాదు, సోషల్ మీడియాలో వారి పేరు మీదుగా ప్రచారమైనట్లు చెబుతున్న సమాచారానికి పూర్తిగా భిన్నమైనది.
శ్వేతజాతీయ ఆధిపత్య స్వభావం కలిగిన వ్యక్తినని చెప్పుకున్న 28 ఏళ్ళ ఆస్ట్రేలియా పౌరుడు బ్ిరెంటన్ టరాంట్ మీద హత్యారోపణలతో కేసు నమోదైంది.
అతను కాల్పుల ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో చూపించాడు. ఆ దాడికి కారణాలను వివరిస్తూ 65,000 పదాల వర్డ్ డాక్యుమెంట్‌ను కూడా అతనే పోస్ట్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
అందులో, కొన్ని ప్రత్యేక సామాజిక సమూహాల దృష్టిని ఆకట్టుకునేందుకు సంకేత భాషను ఉపయోగించారు. ఆల్ట్-రైట్ అనుకూల 8చాన్‌లో దాన్ని పోస్ట్ చేశారు. అలాంటి గుంపులలో ద్వేషాన్ని, అసహనాన్ని ఎంత సులభంగా రగిలించవచ్చో అది నిరూపించింది.
చివరకు, ఒక వ్యక్తి కేవలం 17 నిమిషాల్లో అల్ నూర్‌లో రక్తపాతం సృష్టించాడు. కొత్త జీవితాన్ని ఎంతో భద్రంగా ప్రారంభించిన డజన్ల కొద్దీ మందిని నేల కూల్చాడు.
ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను రేకెత్తించింది. ప్రజా సమూహాలలో తీవ్రవాద ఛాయల కోసం మరింత నిశితమైన నియంత్రణ అవసరమా? అయితే, ఇది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు.
"ఛాందసవాదుల బృందాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని మేం చెప్పాం. కానీ, ప్రభుత్వం దానికి సరిగ్గా స్పందించలేదు" అని న్యూజీలాండ్ ఇస్లామిక్ విమెన్స్ కౌన్సిల్‌కు చెందిన అంజుమ్ రహమాన్ అన్నారు. ఈ వివక్ష గురించి ఆలోచించాలని వరసగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు.
ఆమె మీడియాను కూడా తీవ్రంగా విమర్శించారు. "మీరంతా ఎక్కడున్నారు" అని ఆమె మీడియా వారిని ప్రశ్నించారు. ఈ విషయం మీద అంతర్జాతీయ స్థాయిలో పరిశీలన జరగలేదని ఆమె వాపోయారు.
న్యూజీలాండ్ మానవహక్కుల ప్రధాన కమిషనర్ పాల్ హంట్, "మానవహక్కుల పరిరక్షణలో ఈ దేశానికి మంచి రికార్డు ఉంది. అయితే, కొన్ని చోట్ల 'ఇస్లాం భయాలు', జాతివివక్ష, విద్వేషపూరిత నేరాలు జరుగుతున్నాయి" అని అన్నారు.
'అతడు లక్ష్యం విఫలమైంది'
ఆ గన్ మ్యాన్ కనుక తాను జరిపే దాడితో న్యూజీలాండ్ చీలిపోతుందని ఆశించి ఉంటే, ఆ విషయంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. అతడి పేరు ఎన్నటికీ తన నోటితో పలకనని చెప్పిన ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్, న్యూజీలాండ్ తుపాకి చట్టాలను అత్యంత కఠినతరం చేస్తామని, ఈ దాడిలో ఉపయోగించిన ఆయుధాల రకాలను నిషేధిస్తున్నామని ప్రకటించారు.
ఇప్పటికే చాలా మంది స్వచ్ఛందంగా తుపాకులు వెనక్కి ఇవ్వడం ప్రారంభించారు. స్థానికులు పదే పదే ఒకే మాట చెబుతున్నారు. అది: ఇలాంటి విషాదం పునరావృతం కాకుండా చూసేందుకు ఒక్కటిగా ఉంటాం.
ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన సయ్యద్ మహ్మద్, "నా ఇద్దరు పిల్లలకు 'కివీ (న్యూజిలాండ్ వలస ప్రజలకు నిర్దేశించిన) విలువలు తెలుసు. అందుకు నాకు సంతోషంగా ఉంది" అని అన్నారు.
అయితే, ఆయన తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. "న్యూజీలాండ్ మాత్రమే కాదు ప్రపంచమంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ భూమి మీద మారుమూలన ఉన్న ప్రశాంత ప్రదేశాలకూ దాడులు విస్తరిస్తున్నాయి" అని ఆయన హెచ్చరించారు.
ఇంకా, "ఇలాంటి ఘటన ఈ దేశంలో జరగడానికి వీల్లేదు. దీన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. మనం చంద్రుడి మీదకు, శుక్రుడి మీదకు వెళ్తున్నాం. మన ఇంటి పక్కనే మన పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ ద్వేషపూరిత ఘటనలను ఎదుర్కోవడమన్నది ప్రతి ఒక్కరి బాధ్యత" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా పాకిస్తాన్లో చర్చిని తగులబెట్టారనే ప్రచారం నిజమేనా...
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- గంగా మైదానంలో ‘హిందుత్వ’ పరిస్థితి ఏమిటి
- ‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- వైరల్ ఫొటో: ‘స్కూల్ టూర్ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే... అక్కడ నానమ్మ కనిపించింది’
- ఎవరెస్టు మీద బయటపడుతున్న పర్వతారోహకుల మృతదేహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








