పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు యూఎన్‌కు స్పష్టం చేసిన అమెరికా

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడానికి కావాల్సిన ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది. వివిధ దేశాలు ఈ చర్యపై విచారం వ్యక్తం చేశాయి.

వాతావరణ మార్పు ఒప్పందం నుంచి వైదొలగాలంటే ఏడాది ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఈ ప్రక్రియ 2020లో అమెరికా ఎన్నికల తర్వాత ముగుస్తుంది.

ఈ ఒప్పందం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి 188 దేశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.

అమెరికా చర్యను ఫ్రాన్స్, జపాన్ ఖండించాయి. పారిశ్రామికీకరణ పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతను తగ్గించడానికి అమెరికాతో పాటు, 187 దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నాయి.

పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే తీసుకున్నారు. అయితే, అమెరికాలోని వందలాది స్థానిక ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు 'వీ ఆర్ స్టిల్ ఇన్ మూవ్‌మెంట్' అని ఉద్యమిస్తూ ఉద్గారాలను తగ్గించి పునరుత్పాదక ఇంధనం కోసం ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

ట్రంప్ ప్రభుత్వం ఒప్పందం నుంచి వైదొలడం ద్వారా జరిగే నిధుల అంతరాన్ని పూరించడానికి తాను కృషి చేస్తున్నానని పారిశ్రామికవేత్త మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ 'వీ ఆర్ స్టిల్ ఇన్ మూవ్‌మెంట్' వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

వాతావరణమార్పులు

ఫొటో సోర్స్, AFP

ఇప్పుడే ఎందుకు?

డోనల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే పారిస్ వాతావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలగుతామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే తన హామీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఐరాస నిబంధనల ప్రకారం 2019 నవంబర్ 4 వరకు ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించడం ట్రంప్ ప్రభుత్వానికి సాధ్యం కాదు.

ఈ వైదొలిగే ప్రక్రియ వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితానికి లోబడి ఉంటుంది. ఒకవేళ ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే గెలిచిన వ్యక్తి నిర్ణయం మార్చుకోవచ్చు.

అయితే, ఈ సమయంలో వాతావరణ పరిరక్షణపై ట్రంప్ పరిపాలన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ యూరోపియన్ అఫైర్స్.. డిసెంబర్ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందని పేర్కొంది. ఇతర దేశాలు దీన్ని అనుసరించడానికి నైతిక, రాజకీయ మద్దతు లభిస్తుందని సూచించింది.

ఈ నివేదిక రష్యా, టర్కీలను ఇందుకు ఉదాహరణగా చూపించింది. ఈ రెండు దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ దాన్ని ఆమోదించడానికి నిరాకరించాయి.

వాతావరణమార్పులు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా చర్యపై ప్రతిస్పందనలు

ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణవేత్తలు ఖండించారు. ప్రపంచ నేతలు దీనిపై విచారం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ''దీనిపై మేం చింతిస్తున్నాం. వాతావరణం, జీవవైవిధ్యంపై ఫ్రాంకో-చైనీస్ భాగస్వామ్యాన్ని ఇది మరింత అవసరమయ్యేలా చేసింది'' అని పేర్కొన్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ బుధవారం బీజింగ్‌లో సమావేశం కానున్నారు, అక్కడ వారు ''పారిస్ ఒప్పందం'' ప్రకటనపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగడం తమను నిరుత్సాహానికి గురిచేసిందని జపాన్ అధికారి ప్రతినిధి యోషిహిడే సుగా ఒక ప్రకటనలో తెలిపారు.

''వాతావారణ మార్పు సమస్యలపై మేం క్రీయాశీలకంగా వ్యవహరిస్తాం. అదే సమయంలో అమెరికాతోనూ ఈ విషయంపై కలిసి పనిచేస్తాం'' అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికాలోని డెమొక్రటిక్ నేతలు, పర్యావరణవేత్తలు ఈ నిర్ణయాన్ని ఖండించారు.

ట్రంప్ చర్యను ''మా పిల్లల భవిష్యత్తును అమ్మే వినాశకరమైన నిర్ణయం'' అని డెమోక్రాటిక్ స్పీకర్ నాన్సీ పెలోసి విమర్శించారు.

వాతావరణ ప్రచారకుడు అల్ గోర్ కూడా ఈ చర్యను ఖండించారు.

అయితే, రిపబ్లికన్ కాంగ్రెస్ నేత గ్యారీ పామర్ దీన్ని స్వాగతించారు, ''వాతావరణ మార్పులను పరిష్కరించలేని ఈ మితిమీరిన నియంత్రణ, భారమైన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాల్సిన సమయం ఆసన్నమైంది'' అని ట్వీట్ చేశారు.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఎందుకు వైదొలగాలనుకుంటుంది?

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో సోమవారం మాట్లాడుతూ, ''ఈ ఒప్పందం తమ దేశంపై అనవసర ఆర్థిక భారాన్ని మోపుతోంది'' అని పేర్కొన్నారు.

ఈ ఒప్పందం వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆయన ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.

''ఈ ఒప్పందానికి బదులుగా అమెరికా అన్ని ఇంధన వనరులు, సాంకేతికతలను సమర్ధంగా ఉపయోగించి వాస్తవిక, ఆచరణాత్మక నమూనాను అనుసరిస్తుంది'' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికాను ఎనర్జీ సూపర్ పవర్‌గా మారుస్తామని ట్రంప్ గతంలోనే హామీ ఇచ్చారు.

గ్యాస్, చమురు, బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలుష్య చట్టాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు.

దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలను సైతం ఆయన తప్పుపట్టారు. ఈ చర్యలు అమెరికా శక్తి వనరులపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)