యుక్రెయిన్ సంక్షోభం: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా?

స్టాక్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్ మీద రష్యా దాడి జరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రష్యా, యుక్రెయిన్ సంక్షోభం వల్ల గత కొద్ది రోజుల్లో ఇన్వెస్టర్లు కోట్ల రూపాయలు నష్ట పోయారు.

గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా 2020-21లో రికార్డు స్థాయిలో సుమారు కోటిన్నర డి-మ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.

ఇలా గత ఏడాదిన్నరలో తొలిసారి స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన వాళ్లు నిన్న మొన్నటి దాక లాభాలు మాత్రమే చూశారు. ఇందుకు కారణం సుమారు ఏడాదిన్నరగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీస్తూ ఉండటమే.

ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు భారీగా నష్ట పోవడాన్ని చూస్తున్నారు. ఇంత వరకు లాభాలను చూసిన వీరు ఈ నష్టాలను చూసి భయపడుతూ ఉండొచ్చు.

మరి ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఉంచాలా తీసేయాలా? కొత్తగా పెట్టుబడులు పెట్టాలా? ఇలాంటి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వీటికి టాటా క్యాపిటల్, ఐసీఐసీఐ డైరెక్ట్ వంటి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఎలాంటి సలహాలు ఇస్తున్నాయో చూద్దాం.

వీడియో క్యాప్షన్, ఎల్ఐసీ ఐపీవోలో షేర్లు పొందడం ఎలా

ఇన్వెస్ట్ చేసిన స్టాక్‌లో నష్టం వస్తుంటే ఏం చేయాలి?

యుద్ధం వంటి భయానక పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కూడా నష్టపోతూ ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంగారు పడి వెంటనే వాటిని అమ్మాల్సిన పని లేదు.

ముందుగా ఆ స్టాక్ ఫండమెంటల్స్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు ఎంత బలంగా ఉన్నాయో చెక్ చేయండి. ప్రస్తుత సంక్షోభం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వ్యాపారానికి ఏమైనా నష్టం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి.

షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో కంపెనీ మీద ఆ సంక్షోభం ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ ఎనాలిసిస్‌లో నష్టం లేదని తెలిస్తే ఆ కంపెనీ స్టాక్‌లో మీ డబ్బును అలాగే ఉంచొచ్చు.

పొర్ట్‌ఫోలియోను మార్చాలా?

స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి రివ్యూ చేయండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఫండమెంటల్స్ బలహీనంగా ఉన్న కంపెనీలు ఉంటే ఆ షేర్లను తొలగించాలి. ఆ డబ్బును తీసి సేఫ్‌గా ఉండే ఇతర కంపెనీల షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలి.

ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్ వంటి రంగాలను సేఫ్ సెక్టార్స్‌గా చూడొచ్చు. ఉన్న డబ్బునంతా షేర్లలోనే ఉంచకుండా మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు వంటి వాటిలోనూ ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా రిస్క్ అనేది తగ్గుతుంది.

2020 మార్చి 9వ తేదీన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం వద్ద షేర్లను చూస్తున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టొచ్చా?

డబ్బులు పెట్టొచ్చు. కాకపోతే మీ పెట్టుబడి ఎంత? ఎంత వరకు నష్టాన్ని భరించగలరు? ఎంత కాలం మార్కెట్‌లో ఉండగలరు? వంటి అంశాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి. కంపెనీ స్టాక్స్‌ను చాలా జాగ్రత్తగా చూసి ఎంచుకోవాలి.

పైన చెప్పినట్లు కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయో లేదో తప్పకుండా చూడాలి. అలా బలంగా ఉన్నాయని మీరు గట్టిగా నమ్మితే ఆ కంపెనీ స్టాక్‌లో కొనసాగడమే కాదు మరిన్ని షేర్లు కూడా కొనుగోలు చేయొచ్చు.

మార్కెట్ పడినప్పుడు మంచి క్వాలిటీ కంపెనీల షేర్లు తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి కొత్తగా మార్కెట్‌లో డబ్బులు పెట్టాలనుకునే వాళ్లకు కూడా ఇది అవకాశమే.

ఉన్న డబ్బునంతా ఒకేసారి పెట్టాలా? లేక సిప్ చేయాలా?

మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (సిప్) రూపంలోనూ మదుపు చేయొచ్చు.

మీరు ఎంత రిటర్న్ ఆశిస్తున్నారు? ఎంత వరకు రిస్క్ తీసుకోగలరు? అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది.

కానీ స్టాక్ మార్కెట్లు పడిపోతున్న తరుణంలో ఒకేసారి డబ్బునంతా ఇన్వెస్ట్ చేయడం కన్నా విడతల వారీగా పెట్టుకుంటూ పోవడం మేలు.

వీడియో క్యాప్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసే మార్గాలివి

నేను కొన్నా ఎందుకు పెరగడం లేదు?

స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి. ఈరోజు డబ్బులు పెట్టి రేపు లాభాలు రావాలంటే కష్టం. మీరు కొన్నాక కూడా కంపెనీ షేర్లు నష్టపోవచ్చు. కాబట్టి వీటికి ముందుగానే సిద్ధం కావాలి. కనీసం రెండు మూడేళ్లు ఎదురు చూడగలగాలి.

చీప్‌గా వస్తున్న షేర్లను కొనొచ్చా?

చీప్‌గా వస్తున్నాయి కదాని ప్రతి షేరునూ కొనకూడదు. ప్యానిక్ సెల్లింగ్‌లో భాగంగా కొంత మంది అమ్ముతూ పోతారు. ఇందుకు కారణం మరిన్ని నష్టాలు వస్తాయనే భయం.

అలాగే ప్యానిక్ బైయింగ్‌లో భాగంగా కొందరు షేర్లను కొంటూ పోతుంటారు. దీనికి కారణం మంచి కంపెనీ స్టాక్ తక్కువ ధరకే దొరకుతుందనే ఆశ. ఇక ఇంతకంటే తక్కువకు మళ్లీ దొరకదనే భయం. ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బైయింగ్ ఈ రెండూ మంచిది కాదు.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

పడిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పెరుగుతాయా?

ఇప్పుడు యుక్రెయిన్, రష్యా సంక్షోభం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఇప్పుడే కాదు గతంలో అనేక సార్లు అనేక సంక్షోభాలు వచ్చినప్పుడు మార్కెట్లు పడిపోయాయి.

ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు దాని తీవ్రత ఎంత? భారత్‌ మీద దాని ప్రభావం ఏమేరకు ఉంటుంది? స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో భారత ఆర్థికవ్యవస్థ మీద ఆ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి అంశాల ఆధారంగా స్టాక్ మార్కెట్లు రియాక్ట్ అవుతూ ఉంటాయి.

1992 నాటి హర్షద్ మెహతా స్కాం నుంచి మొన్నటి కరోనా సంక్షోభం వరకు ఎన్నోసార్లు సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. కానీ మార్కెట్లు అక్కడే ఉండిపోలేదు. మళ్లీ పెరిగాయి.

2020 జనవరి 3న సుమారు 12,226 పాయింట్ల వద్ద ఉన్న నిఫ్టీ, కరోనా సంక్షోభం వల్ల అదే ఏడాది ఏప్రిల్ 3 నాటికి 8083 పాయింట్లకు పడిపోయింది. కానీ ఆ తరువాత ఏడాదిలోనే 15 వేల మార్క్‌ను చేరుకుంది నిఫ్టీ. కాబట్టి స్వల్ప కాలంలో కాకుండా దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి.

(గమనిక: ఇక్కడి సమాచారం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడుల నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహా మేరకు తీసుకోగలరు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)