హైదరాబాద్ - విశాఖ: సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్ అంటే ఏంటి, అక్కడే మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పహల్గాం దాడి తర్వాత కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
ఈ తరహా మాక్ డ్రిల్స్ దేశంలో 1971 పాకిస్తాన్ యుద్ధానికి ముందు చివరిసారిగా జరిగాయి.
మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ప్రకటనలో, దేశ రాజధాని దిల్లీని కేటగిరీ 1గా, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖలను కేటగిరీ 2గా గుర్తించారు.
అసలు ఈ కేటగిరీలు ఏంటి? దేశంలోని 244 జిల్లాలకే సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్‌గా ఎందుకు గుర్తింపు ఉంది?
ఇంతకీ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్ అంటే ఏంటి?


సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏమిటి?
సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్(పౌర రక్షణ జిల్లాలు) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన డిస్ట్రిక్ట్స్.
యుద్ధాలు, దాడులు, ప్రకృతి విపత్తులైన వరదలు, భూకంపాల వంటి అత్యవసర సమయాల్లో పౌరులను సన్నద్ధం చేసేందుకు, ఆ సమయాల్లో పౌరుల రక్షణకు అవసరమైన ఏర్పాట్లు కలిగిఉన్న జిల్లాలనే సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్ అంటారు.
యుద్ధ సమయంలో వైమానిక దాడుల హెచ్చరికలు, బ్లాక్ అవుట్ కసరత్తులు, అత్యవసర ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడం వంటి కార్యకలాపాలు ఈ కేంద్రాలు నిర్వహిస్తాయి. ఈ పనులన్నింటిలో రక్షణ దళాలకు, సాధారణ పౌరులకు సహాయంగా నిలిచేందుకు సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్‌గా పేరుపొందిన జిల్లాల్లోని పౌరులు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు.
అలా శిక్షణ పొందిన వారు యుద్ధం, విపత్తుల సమయంలో తమ సన్నద్ధతను తెలియపరుస్తూ.. మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.

సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ వర్గీకరణ..
కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశంలో 244 సివిల్ ఢిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. (ఈ సంఖ్య సరిహద్దుల మార్పులు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ఆధారపడి మారే అవకాశం ఉంది.)
సివిల్ ఢిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ఎంపికలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని విశాఖలోని ఎన్డీఆర్ఎఫ్ విశాఖ టీం కమాండెంట్ ఈశ్వరరావు, జిల్లా ఎన్సీసీ కమాండెంట్ తపస్ మండల్ బీబీసీతో అన్నారు.
వీటితో పాటు సివిల్ డిఫెన్స్ బృందాలు ఏం చేస్తాయో వారు వివరించారు.

సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ కేటగిరీలు..
కేటగిరీ-1: అత్యంత సున్నితమైన ప్రాంతాలు, దాడులకు ఎక్కువ అవకాశం ఉన్నవి (ఉదాహరణకు దిల్లీ, తారాపూర్ అణు కేంద్రం). అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్న ప్రాంతాలు కూడా. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్ వంటి సరిహద్దు రాష్ట్రాలు. యుద్ధ సమయాల్లో ఈ ప్రాంతాలు వ్యూహాత్మకంగా చాలా కీలకం.
దిల్లీ జాతీయ రాజధాని కావడం, తారాపూర్ అణుకేంద్రాన్ని శత్రుదేశాలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉండటం వల్ల కేటగిరీ-1లో ఉంచారు.
కేటగిరీ-2: ఒక మోస్తరు ముప్పు ఉన్న ప్రాంతాలు, పెద్ద నగరాలు, వ్యూహాత్మక కేంద్రాలు. ఇందులో ఏపీ నుంచి విశాఖపట్నం, తెలంగాణ నుంచి హైదరాబాద్ ఉన్నాయి.
విశాఖపట్నంలో నౌకాదళ కేంద్రం ఉండటంతో పాటు తీరప్రాంత నగరం కావడం, హైదరాబాద్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాజధాని నగరం కావడం, రక్షణ రంగ సంస్థలుండటం, పారిశ్రామిక నగరంతో పాటు టెక్నాలజీ హబ్‌గా ఉండటం కూడా ఒక కారణం.
మొత్తం 244 డిస్ట్రిక్ట్స్‌లో ఈ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి.
కేటగిరీ-3: తక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాలు, సాధారణంగా గ్రామీణ లేదా వ్యూహాత్మక ప్రాముఖ్యం తక్కువగా ఉన్న ప్రాంతాలు. ఈ కేటగిరీలో దాడుల ముప్పు తక్కువగా ఉండే ప్రాంతాలు ఉంటాయి. ఈ జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ కార్యకలాపాలు పరిమితంగా ఉంటాయి, కానీ అవసరమైతే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటాయి.

వలంటీర్లుగా ఎవరు చేరవచ్చంటే..
సివిల్ డిఫెన్స్‌లో వలంటీర్లుగా చేరిన వారు యుద్ధ సమయంలో, ప్రకృతి విపత్తు సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో పౌరుల రక్షణ కోసం పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర హోంశాఖ గుర్తించిన సివిల్ డిస్ట్రిక్ట్స్ పరిధిలో నివాసం ఉండే వారే అయా జిల్లాల్లో వలంటీర్లుగా చేరవచ్చు.
18 నుంచి 65 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు చేరవచ్చు. శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పని చేయగల సామర్థ్యం ఉన్నవారు.
కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. కానీ, విద్యార్హత కంటే సేవ చేయాలనే ఆసక్తి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్‌లోనే నివాసం ఉండాలి. స్థానికంగా నివసించడం వల్ల అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం వీలవుతుంది.
వివిధ వృత్తుల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా చేరవచ్చు. (విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య నిపుణులు, ఇంజినీర్లు, రిటైర్డ్ సైనికులు, కార్మికులు, వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు.)
రిటైర్డ్ సైనికులు, ఎన్సీసీ క్యాడెట్‌లకు ప్రాధాన్యం ఉంటుంది. భారత పౌరసత్వం ఉన్నవారు, నేరచరిత్ర లేనివారు (పోలీసు వెరిఫికేషన్ జరుగుతుంది).

ఎలా చేరాలంటే..
ఆయా జిల్లాల్లోని సివిల్ డిఫెన్స్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా రాష్ట్ర హోం శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ అయిన తర్వాత, వలంటీర్లకు సివిల్ డిఫెన్స్ శిక్షణ ఇస్తారు. శిక్షణలో ప్రథమ చికిత్స నైపుణ్యాలు, అత్యవసర సమయంలో ప్రజలను తరలించడం, ఎయిర్ సైరన్స్, బ్లాక్ అవుట్ సమయంలో స్పందించడం, అగ్నిమాపక పరికరాల వినియోగం వంటి శిక్షణ ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














