ముస్లిం యువకుడిని కాపాడిన పోలీసు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లారు... ఎందుకు?
- రచయిత, సునీల్ కటారియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక వైరల్ వీడియో.. రాత్రికిరాత్రి తనను సోషల్ మీడియా హీరోను చేస్తుందని ఉత్తరాఖండ్ ఎస్సై గగన్‌దీప్ ఊహించి ఉండరు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం రాంనగర్‌లోని గర్జియా దేవాలయం వద్ద జరిగిన ఘటనలో హిందూ అతివాద గుంపు నుంచి ఒక ముస్లిం యువకుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ గగన్‌దీప్ కాపాడారు. దేవాలయంలో ముస్లిం యువకుడు తన స్నేహితురాలితో ఉండగా పట్టుకుని హిందూ అతివాద కార్యకర్తలు దాడిచేశారు. గగన్ దీప్ వారి బారినుంచి ఆ ముస్లిం యువకుడిని కాపాడారు. దెబ్బలకు కాచుకుంటూ మరీ పక్కకు తీసికెళ్లి కాపాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు గగన్‌దీప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు.
కానీ, ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఏడు నెలల క్రితమే గగన్‌దీప్ ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నైనితాల్ జిల్లా రాంనగర్‌లో హిందూ ముస్లిం వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో గగన్‌దీప్‌కు అక్కడకు వెళ్లారు.
కానీ ఈ సంఘటన.. 27 ఏళ్ల గగన్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది.

ఫొటో సోర్స్, FB / GAGANDEEPSINGH
సోషల్ మీడియా గగన్‌కు నీరాజనాలు పలికింది. కానీ.. ప్రస్తుతం ఆయన మీడియాను దగ్గర రానీయడం లేదు. అతడిని ఇంటర్వ్యూ చేయడానికి బీబీసీ ప్రయత్నించగా, తాను పై అధికారుల అనుమతి తీసుకోవాలని అన్నారు.
అయితే.. గగన్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని బీబీసీకి చెప్పిన నైనితాల్ సీనియర్ ఎస్పీ జనమేజయ ఖండూరి హామీ ఆ రోజు నెరవేరలేదు.
ఆయన హామీ మేరకే, గగన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు బీబీసీ ఉత్తరాఖండ్ వెళ్లింది. నైనితాల్ ఎస్పీ సతి కూడా గగన్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
కానీ మేం ఆయన్ను కలవగానే, గగన్‌దీప్ తనకు అందుబాటులోకి రాలేదని, తను ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ముందు రోజు.. జాతీయ మీడియాలో వెలిగిన ఒక పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదా? ఆశ్చర్యమేసింది. మరోవైపు గగన్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటుచేయాలని అడిగేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

''నేను గగన్‌దీప్‌తో మాట్లాడాను. కానీ మీడియాతో మాట్లాడ్డానికి ఆయన సుముఖంగా లేడు. ఆయనకు కౌన్సెలింగ్ అవసరం అనుకుంటున్నాం'' అని ఎస్.ఎస్.పి. జనమేజయ అన్నారు.
రాంనగర్ సంఘటన గగన్‌దీప్‌కు అభినందనలతోపాటు విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. ఇలాంటి ఒత్తిడిని గగన్ గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. అల్లరి మూకలను ఎదుర్కోవడం పోలీస్ ట్రైనింగ్‌లో నేర్చుకున్నాడు కానీ ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం ఆయనకు కొత్త.
బాలీవుడ్ తారలు ఫర్హాన్ అక్తర్, అదితీ హైదరి, రిఛా ఛడ్డా మరికొందరు గగన్‌దీప్‌పై ప్రశంసల కురిపించారు. గగన్‌దీప్ మీడియా దృష్టిని ఆకర్షించడం పట్ల అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు వారి ప్రవర్తన చెబుతోంది.
రాంనగర్‌లోని దేవాలయ ప్రాంగణంలో ముస్లిం అబ్బాయి, ఒక హిందూ అమ్మాయితో కలిసి ఉండగా పట్టుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ థుక్రాల్ మీడియాతో మాట్లాడుతూ, ''లవ్ జిహాద్ లాంటి ఘటనలను ఉపేక్షించరాదు. రాంనగర్ ఘటన శాంతిభద్రతల సమస్య'' అన్నారు.
గర్జియా దేవాలయ ప్రాంగణం ప్రశాంతంగానే ఉంది. కానీ అక్కడి ప్రజల మొహాల్లో ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది.

''మీడియా.. ఈ సంఘటనకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కార్యకర్త ఆ యువకుడిని రెండు చెంపదెబ్బలు కొట్టాడు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. అసలు వాళ్లు దేవాలయం వద్ద ఏంచేస్తున్నారో అడగండి. ఆలయ ప్రాంగణంలో తప్పుడు పనులు చేయడానికే వచ్చారు. కానీ పోలీసులు ఇవేవీ పట్టించుకోరు'' అని అన్నారు.
కొందరు స్థానికులతో బీబీసీ మట్లాడింది. ప్రశాంత వాతావరణాన్ని భ్రష్టుపట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ ఘటన జరిగిందని వారన్నారు.
''రాంనగర్‌లోని ప్రశాంతతను భగ్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. 'లవ్ జిహాద్' సాకుతో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డాక మధ్యలో వీరంతా ఎవరు? వారి ప్రేమకు 'లవ్ జిహాద్' అని ఎందుకు పేరు పెడుతున్నారు?'' అని కైజర్ రాణా అనే స్థానికుడు అభిప్రాయపడ్డారు.

''మతం ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు. మనుషుల్లో జంతు ప్రవృత్తిని ఉసిగొల్పుతున్నారు. తన ప్రాణాలు లెక్కచేయకుండా ఆ ముస్లిం యువకుడిని గగన్‌దీప్ కాపాడాడు. ఇలాంటి వారు దేశానికి అవసరం'' అని అజిత్ సాహ్ని అనే స్థానికుడు అన్నారు.
తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పోలీసులు చెబుతున్నా, వాస్తవానికి పరిస్థితి అలా లేదు.
డీజీపీ కార్యాలయ మీడియా సమన్వయకర్త ప్రదీప్ గోడ్బోలే గగన్‌దీప్ పట్ల సానుకూలంగా స్పందించారు. గగన్‌దీప్‌ను రాష్ట్రప్రభుత్వం సత్కరించకపోయినా, పోలీసు డిపార్ట్‌మెంట్ మాత్రం, గగన్ లాంటి ఆఫీసర్లు అన్ని ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, FB / GAGANDEEPSINGH
గగన్ జాడ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో మే 28న తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను గగన్ మార్చారు.
తన వాట్సాప్ స్టేటస్‌లో.. ''ఇతరుల కంటే నేను మెరుగ్గా ఉన్నానా లేదా అన్నది ప్రధానం కాదు. నా పని నేను సక్రమంగా చేశానా లేదా అన్నది ముఖ్యం'' అని ఉంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









