ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఎందుకు హాజరవుతున్నారు?

ఫొటో సోర్స్, AFP/Getty Images
- రచయిత, సంజయ్ రమాకాంత్ తివారీ
- హోదా, బీబీసీ కోసం, నాగ్‌పూర్ నుంచి
భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ భావజాలానికి ప్రముఖ ప్రతినిధిగా ఉన్న డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ జూన్ 7న నాగ్‌పూర్‌లో జరుగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
ఈ వార్తతో సహజంగానే దేశంలోని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
నాగ్‌పూర్‌లోని రేషీమ్‌బాగ్ మైదానంలో జరుగనున్న సంఘ్ శిక్షా వర్గ్ మూడో వార్షిక కార్యక్రమం ముగింపు ఉత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. స్వయంసేవకుల శిక్షణకు సంబంధించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడంతో పాటు ఆ వేదికపై ప్రసంగం కూడా చేయబోతున్నారు.
ఈ కార్యక్రమంలో సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సహా ప్రస్తుత ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వమంతా పాల్గొంటుంది. ఇంకా సంఘ్‌కు సంబంధించిన ఎంపిక చేసిన ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు కూడా పాల్గొంటారు.
దేశం నలుమూలల నుంచి నాగ్‌పూర్‌కు వచ్చి 25 రోజుల పాటు తృతీయ వార్షిక సిలబస్ పూర్తి చేసుకున్న 600 మంది స్వయంసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Sanjay Ramakant Tiwari
ప్రణబ్, భాగవత్‌ల మధ్య నాలుగు సార్లు భేటీ
ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో ప్రణబ్ ఇప్పటి వరకూ మొత్తం నాలుగు సార్లు భేటీ అయ్యారని సంఘ్ ప్రతినిధులు తెలిపారు. ప్రణబ్ రాష్ట్రపతి పదవిలో ఉండగా మోహన్ భాగవత్ రెండు సార్లు దిల్లీలో ఆయనను కలుసుకున్నారు.
ఒక సందర్భంలో ఇరువురి మధ్య భేటీ జరగాల్సి ఉండగా, ప్రణబ్ ముఖర్జీ భార్య మృతి చెందడంతో దాదాపు రాష్ట్రపతి కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. కానీ సర్ సంఘ్‌చాలక్‌తో భేటీ మాత్రం జరిగింది. సంతాపం ప్రకటించిన తర్వాత కూడా చాలా సేపు వారి సమావేశం కొనసాగినట్టు సంఘ్ వర్గాలు తెలిపాయి.
అంతకు ముందటి భేటీ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి సంఘ్ భావజాలానికి సంబంధించిన పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాల విషయంలో ప్రణబ్‌కు కలిగిన సందేహాలపై కూడా రెండో సారి జరిగిన భేటీలో చర్చ జరిగింది.
ఇతర భావజాలం గలవారిని ఆహ్వానించే సంప్రదాయం గోల్వల్కర్ కాలం నుంచే ఉందని సంఘ్ చెబుతోంది. ఇతరుల లేదా విరోధుల భావజాలం గురించి చర్చ చేయడం మంచిదని ఆయన భావించేవారు.
అభిప్రాయభేదాలు లేదా విరుద్ధ భావాలు ఉన్నంత మాత్రాన అది శత్రుత్వం కాదని సంఘ్ వర్గాలు చెబుతుంటాయి. భిన్న భావాల విషయంలో చర్చలు జరపాలన్నది తమ అభిప్రాయం అని చెబుతారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
'తక్షణ పథకం ఏదీ లేదు'
అయితే ప్రణబ్ ముఖర్జీ విషయంలో సంఘ్ నాయకత్వానికి ఏవైనా ఆశలున్నాయా? లేదా ఏదైనా పథకం ఉందా?
ఈ ప్రశ్నకు జవాబిస్తూ సంఘ్‌కు సంబంధించిన ఓ సీనియర్ కార్యవర్గ సభ్యుడు, "ఆర్ఎస్ఎస్ సుదూర భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్ని కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఎవరో ఒకరితో కొన్ని సార్లు కలవడంతోనే వారి భావాల్లో వెంటనే మార్పు వస్తుందని గానీ, ఎవరైనా ఒకటి, రెండు సార్లు పర్యటించగానే కొత్తది ఏదైనా జరుగుతుందనో లేదా సంఘ్‌కు లాభం ఒనగూరుతుందనో ఆర్ఎస్ఎస్ ఆలోచించదు. ప్రణబ్‌ను ఆహ్వానించడమన్నది కూడా ఆకస్మిక నిర్ణయం కూడా ఏమీ కాదు" అన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ప్రణబ్ ముఖర్జీ ఇలా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది కాదనే ఒత్తిళ్లు కాంగ్రెస్ లోపలి నుంచి గానీ, వెలుపలి నుంచి గానీ వస్తాయన్న అంచనా ఆర్ఎస్ఎస్‌కు లేదా మరి?
"ప్రణబ్ ముఖర్జీ ఒక సీనియర్, ఆలోచనాపరుడైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు బాగా ఆలోచించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అలాంటి ఒత్తిళ్లేవీ ఆయనపై పనిచేయకపోవచ్చని నా అభిప్రాయం. ఇప్పుడైతే ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా కూడా లేరు" అని ఆర్ఎస్ఎస్ నేత చెప్పారు
రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం చివరి రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీకీ, ప్రణబ్ ముఖర్జీకి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆయనది తన తండ్రి లాంటి వ్యక్తిత్వం అని మోదీ ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారన్నది గమనార్హం.

ఫొటో సోర్స్, PMOIndia @Twitter
విరుద్ధ భావాల వారిని ఆహ్వానించే సంప్రదాయం
సంఘ్ నిర్వహించే శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ భావజాలంతో విభేధించే వారిని పిలిచే సంప్రదాయం దాదాపు దశాబ్ద కాలంగా ఉంది. విజయదశమి కార్యక్రమానికి మాత్రం చాలా కాలంగా అలాంటి వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు.
ఇంకా ఇతర సందర్భాల్లో కూడా ఇతర భావాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులనూ, తత్వవేత్తలనూ ఆహ్వానించారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, దళిత నేత దాదాసాహెబ్ రామకృష్ణ సూర్యభాన్ గవయి, వామపక్ష భావాలున్న కృష్ణ అయ్యర్, కొద్ది కాలం క్రితం సీనియర్ జర్నలిస్టు, ఆప్ నేత ఆశుతోష్ వంటి వారు సంఘ్ కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
మీనాక్షీపురంలో కొందరు హిందువులు తమ మతం మార్చుకొని ఇస్లాంను స్వీకరించిన సంఘటన తర్వాత, దళిత నేత గవయి స్వయంగా సంఘ్ కార్యక్రమంలో పాల్గొంటానని ప్రతిపాదించారనీ, ప్రసంగం కూడా చేశారని సంఘ్ వర్గాలు చెప్పాయి.
సంఘ్‌ను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష భావజాల ప్రతినిధి కృష్ణ అయ్యర్ వ్యతిరేకతలన్నింటినీ లెక్క చెయ్యకుండా అప్పటి సర్ సంఘ్‌చాలక్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.
చరిత్రలో సంఘ్ స్వయంసేవకుల శిబిరాలకు మహాత్మా గాంధీ, భీమ్‌రావ్ అంబేడ్కర్‌లు బహుమతులు ఇచ్చిన ఉదాహరణలు కూడా చెబుతారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








