వాయు కాలుష్యం: హైదరాబాద్‌లో ఉంటే.. రోజుకు రెండు సిగరెట్లు తాగినట్లే

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ఉధృతమవుతోంది. ప్రస్తుతం నగరంలో గాలి పీల్చుకునే వారు రోజుకు సగటున 12 సిగరెట్లు తాగినంత కాలుష్యాన్ని పీలిస్తున్నారు.
మరి మీ నగరంలో వాయు కాలుష్య స్థాయిని బట్టి మీరు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారో తెలుసుకోవాలంటే మీ నగరం మీద క్లిక్ చేసి చూడండి.
నవంబర్ ఐదో తేదీ ఉదయానికి దిల్లీ నగరాన్ని చిక్కటి ధూళి దుప్పటిలా కమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారే సమయానికి, సాయంత్రం పొద్దు పోయాక.. కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారింది. ఆరుబయట కళ్లతో చూడగలగటం కూడా కష్టంగా మారింది. దృశ్యగోచరతా తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, AFP
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. నవంబర్ 5న దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో.. ఊపిరితిత్తుల్లోకి లోతుగా ప్రవేశించగల ప్రమాదకరమైన సూక్ష్మ కణ పదార్థాల స్థాయి (పార్టిక్యులేట్ మేటర్ - పీఎం 2.5) ఒక ఘనపు మీటరుకి 268 మైక్రోగ్రాములకు పెరిగింది.
పీఎం 2.5 విషయంలో ప్రామాణిక గాలి నాణ్యత ఘనపు మీటరుకి 15 మైక్రోగ్రాములు. ఇది 81 మైక్రోగ్రాములు దాటినట్లయితే గాలి నాణ్యత క్షీణించినట్లు పరిగణిస్తున్నారు.
మరికొన్ని నివేదికలైతే.. దిల్లీ వాయు కాలుష్యం తీవ్రత రోజుకు 45 సిగరెట్లు తాగటంతో సమానంగా ఉందని చెప్తున్నాయి. వాస్తవమేమిటో తెలుసుకోవటానికి ఈ సమాచారాన్ని మేం పరిశీలించాం.
మీ నగరంలో గత వారంలో వాయు కాలుష్యం వల్ల మీరు ఎన్ని సిగరెట్లు తాగి ఉంటారన్నది తెలుసుకోవటానికి మీ నగరం మీద క్లిక్ చేయండి.
ఈ డాటాను ప్రతి వారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. పీఎం 2.5 స్థాయి సమాచారం అప్‌డేట్ చేస్తుంటుంది.
గణించే పద్ధతి
చైనాలో సగటున ఘనపు మీటరుకు 52 మైక్రో గ్రాముల పీఎం 2.5 పీల్చుకోవటం వల్ల ప్రతి ఏటా 16 లక్షల మంది చనిపోతున్నారని బర్కిలీ ఎర్త్ నివేదిక ఒకటి వెల్లడించింది.
ధూమపానం వల్ల 16 లక్షల మంది చనిపోతారనుకుంటే.. అందుకు 1.1 ట్రిలియన్ సిగరెట్లు పడతాయని లెక్కించారు. చైనా జనాభా 135 కోట్లు కనుక.. ఒక్కొక్కరికి సంవత్సరానికి 764 సిగరెట్లు లెక్క వస్తుంది. అంటే ఒక్కొక్కరికి రోజుకు 2.4 సిగరెట్లు.
మరో విధంగా చెప్తే.. ఒక సిగరెట్ వల్ల వాటిల్లే నష్టం.. ఒక రోజులో ఘనపు మీటరుకు 22 మైక్రో గ్రాముల పీఎం 2.5తో సమానం.

ఫొటో సోర్స్, Getty Images
బీజింగ్‌లో ఒక ఏడాదిలో పీఎం 2.5 స్థాయి సగటున ఘనపు మీటరుకు సుమారు 85 మైక్రో గ్రాములుగా ఉంటుంది. అంటే.. రోజుకు 4 సిగరెట్లతో సమానం. అలాచూసినపుడు.. దిల్లీలో వాయు కాలుష్యం ఘనపు మీటరుకు 546 మైక్రో గ్రాములుగా ఉంటే.. అది రోజుకు 25 సిగరెట్లు తాగటంతో సమానమవుతుంది.
భారతదేశంలోని 33 నగరాల్లో వారం రోజుల పాటు పీఎం 2.5 స్థాయి ఏ రోజు ఎంత ఉందన్న డాటాను మేం సేకరించాం. దానిని ఘనపు మీటరుకు 21.6 మైక్రో గ్రాములతో భాగించి.. అది ఎన్ని సిగరెట్లకు సమానమన్నది లెక్కించాం.
ఇక్కడ చూపిన అంకెలు.. మీరు రోజులో ఎంత ఎక్కువ భాగం బయటి గాలి పీల్చుకుంటూ గడుపుతారన్న అంచనాను బట్టి లెక్కించినవి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








