ఆంధ్రప్రదేశ్: వేరుసెనగ పంట కోసం గొయ్యి తవ్వితే కోటి రూపాయల వజ్రం దొరికింది - ప్రెస్ రివ్యూ

వజ్రం

ఫొటో సోర్స్, Getty Images

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలో గురువారం ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైందని ‘సాక్షి’ ఓ కథనం ప్రచురించింది.

వేరుసెనగ పంట కోసం పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుస్తున్న రాయి కంటపడింది. దాన్ని ఆయన ఇంటికి తీసుకువెళ్లారు.

అది వజ్రం అని తెలియడంతో వజ్రాల వ్యాపారులు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ పోటీలో 25 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.20 కోట్లకు రైతు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ. 37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు.

ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్

అనాథాశ్రమంలో 48 మందికి కరోనా

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని అనాథాశ్రమంలో గురువారం 250 మందికి పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

వీరిని ఆశ్రమాల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో వృద్ధులు, మానసిక వికలాంగులే అధికంగా ఉండటంతో వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు.

నిర్వాహకులు చెప్పేది రోగులు అర్థం చేసుకోలేకపోతున్నారని సకాలంలో మందులు వేసుకోక వ్యాధి తీవ్రత పెరుగుతోందని వైద్య సిబ్బంది తెలిపారు.

మరోవైపు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రఖ్యాత మేడారం సమ్మక్క ఆలయ పూజారి సిద్ధబోయిన సమ్మారావు (30) గురువారం కరోనాతో మృతి చెందారు.

ఉల్లిపాయలు
ఫొటో క్యాప్షన్, ఉల్లిపాయలు

ఉల్లిగడ్డలతో బ్లాక్‌ఫంగస్‌ రాదు: ఎయిమ్స్

ఉల్లిగడ్డలపై ఉండే నల్లని మసితో బ్లాక్ ఫంగస్ వాప్తి చెందదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల్లో నిజం లేదని ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) చెప్పినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని ఎయిమ్స్‌ స్పష్టం చేసింది.

‘‘ఉల్లిగడ్డల మీద కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుంది. అది బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయదు’’.

ఇక ఫ్రిజ్‌లో ఏదైనా ఎక్కువరోజులు నిల్వ ఉంచితే అందులో ఉండే ఉష్ణోగ్రత కారణంగా అందులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇది కూడా మ్యూకోర్మైకోసిస్‌కు కారణం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థులు

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఈనాడు తెలిపింది.

జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామంటూ ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండటం.. కేసుల సంఖ్య దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించే అవకాశముండటంతో పరీక్షల నిర్వహణపై చర్చించారు.

కర్ఫ్యూ అమలయ్యే సమయంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడే అవకాశముందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వాయిదా వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జులైలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)