వేదాంత ప్రాజెక్టులు: ఒక కంపెనీ.. నాలుగు వివాదాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫైసల్ మహ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని తూత్తుకుడిలో గత వారం జరిగిన నిరసన ప్రదర్శనలు, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి ఘటనలతో వేదాంత కంపెనీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.
అయితే బ్రిటన్‌కు చెందిన వేదాంత కంపెనీకి వివాదాలు కొత్తేం కాదు. లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నమోదైన ఈకంపెనీకి అనుబంధంగా ఉండే భారతీయ కంపెనీ పేరే స్టెర్లైట్.
కోర్బాలో ప్రమాదం
స్టెర్లైట్ కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఒక అల్యూమినియం పరిశ్రమ నడుపుతుంది. ఈ ఫ్యాక్టరీలో 2009లో ఒక ఘోర ప్రమాదం జరగగా 42 మంది కార్మికులు మృతి చెందారు.
ఈ ప్రమాదానికి సంబంధించి బాల్కో వేదాంత, చైనా కంపెనీ షైన్‌దోంగ్ ఎలక్ట్రిక్ పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్, జీడీసీఎల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం బఖ్షీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని బహిర్గతం చేయలేదు.
ఈ ప్రభుత్వరంగ కంపెనీని 2001లో వేదాంత కొనుగోలు చేసినప్పటి నుంచే దీనిపై చాలా వివాదాలున్నాయి.
భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)కు చెందిన రిఫైనరీ, స్మెల్టర్, గనులను అన్నింటినీ కలిపి భారత ప్రభుత్వం నుంచి వేదాంత కంపెనీ దాదాపు రూ. 551 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ఈ ప్రభుత్వరంగ కంపెనీ విలువ అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అనే వాదనలున్నాయి.
ఈ కంపెనీని అమ్మేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఆ సమ్మె దాదాపు 60 రోజులు కొనసాగింది.

ఫొటో సోర్స్, Getty Images/STRDEL
నియమ్‌గిరి, ఒడిషా
ఒడిషాలోని ఆదివాసీ ప్రాంతమైన నియమ్‌గిరిలో మైనింగ్ వివాదాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. డోంగరియా కోంద్ ఆదివాసులు గ్రామసభల్లో తమ అభిప్రాయం ప్రకారం తీర్మానాలు చేయొచ్చని కోర్టు తీర్పు చెప్పింది.
దాంతో 12 గ్రామసభలు ఏకగ్రీవంగా వేదాంత తలపెట్టిన బాక్సైట్ గనులను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం 2013 జులై-ఆగస్ట్ నెలల్లో ఈ గ్రామసభలు జరిగాయి.
నియమ్‌గిరికి సమీపంలోని లాంజీగఢ్‌లో వేదాంత కంపెనీ 10 లక్షల టన్నుల సామర్థ్యంతో రిఫైనరీని ఏర్పాటు చేసింది. నియమ్‌గిరి మైనింగ్‌కు సంబంధించి ప్రభుత్వ ఆమోదం లభించడానికి ముందే ఆ కంపెనీ తన రిఫైనరీ సామర్థ్యాన్ని మరింత పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
తూత్తుకుడి, తమిళనాడు
తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టెర్లైట్ రాగి ప్లాంటుకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. గత వారం జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మృతి చెందారు.
ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం తమకు ప్రమాదకరంగా మారిందంటూ, తమ మనుగడకే ముప్పు ఏర్పడిందంటూ స్థానికులు నిరసన ప్రదర్శనలకు పూనుకున్నారు.
పర్యావరణానికి సంబంధించిన పలు నియమాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు 2013లో స్టెర్లైట్ ఇండస్ట్రీస్‌పై 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
ఈ ప్లాంటు నుంచి వెలువడుతున్న పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉందని మద్రాస్ హైకోర్టు సైతం 2010లో వ్యాఖ్యానించింది.
ఆ తర్వాత, ఈ ప్లాంటును మూసెయ్యాలని కోర్టు ఆదేశించింది. దీనిపై కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images
సెసా గోవా, గోవా
అక్రమ మైనింగ్ కార్యకలాపాల విషయంలో ఏర్పాటైన షాహ్ కమిషన్ 2012లో దోషులుగా నిర్ధారించిన కంపెనీల్లో 'సేసా గోవా' ఒకటి.
వేదాంతకు చెందిన సేసా గోవా మైనింగ్ కంపెనీ ఇనుప ఖనిజాన్ని వెలికితీస్తుంది.
ఒక అంచనా ప్రకారం, అక్రమ మైనింగ్ వ్యవహారాల మూలంగా ఖజానాకు 35,000 కోట్ల నష్టం వాటిల్లింది.
దాంతో ఇదివరకు ఇచ్చిన మైనింగ్ లీజులన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం వేలం ద్వారానే మైనింగ్‌కు అనుమతి ఇవ్వగలుగుతాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








