వినాయక చవితి: హైదరాబాద్‌లో భారీ విగ్రహాలకు, బహిరంగ మండపాలకు అనుమతి లేదన్న తెలంగాణ ప్రభుత్వం

వినయాక చవితి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదారబాద్‌లో ఈ ఏడాది వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనం ఉండడం లేదు. బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం తెలిపారు.

''ఇంట్లోనే వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలి. కరోనావైరస్ కారణంగా బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు వద్దు. ఎక్కడా వినాయక మండపాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవు. ప్రజలు సహకరించాలి'' అని ఆయన చెప్పారు.

అయితే, భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి కోరిక మేరకు, బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించినట్టు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి భగవంత రావు బీబీసీకి తెలిపారు. ''ప్రధాన రహదారులపై కాకుండా, కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, బస్తీల్లో విగ్రహాలు పెట్టుకోవచ్చు. కాకపోతే కోవిడ్ నిబంధనలు పాటించాలి'' అని మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు హామీ ఇచ్చినట్టు భగవంత రావు సోమవారం సాయంత్రం తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సాధారణంగా హిందువులు వినాయక చవితి ఇళ్లల్లో మట్టి ప్రతిమ పెట్టుకుని, పూలు, పండ్లు, ఆకులు (పత్రి)తో అలంకరించి, పిండి వంటలతో పూజిస్తారు. అయితే స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఏకం చేసే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయకచవితి నిర్వహించే ఆనవాయితీ ముంబయిలో బాలగంగాధర తిలక్ ఆధ్వర్యంలో ప్రారంభం అయింది.

అదే తరహాలో హైదరాబాద్‌లో 1980లలో ఈ సామూహిక వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం ప్రారంభమయ్యాయి. సంఘ్ పరివార్ భావజాలం ఉన్న వ్యక్తులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అనే సంస్థగా ఏర్పడి ఈ సామూహిక ఉత్సవాలను పలు చోట్ల ప్రారంభించడం, అప్పటికే ఉన్న చోట్ల ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.

వినయాక చవితి

సామూహిక ఉత్సవాలు మొదలయ్యాక మొదటిసారి..

విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా చేసిన జి.రాఘవరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి గత పోటీ చేసిన డా. భగవంతరావులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా ఉంటారు. ప్రతి ఏటా ఉత్తర భారతం నుంచి స్వామీజీలను పిలిపించి వారి చేత ప్రసంగాలు ఇప్పిస్తారు.

ఈ సంస్థ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా, కాలనీ వాసులు, వీధుల్లో, అపార్టుమెంటుల్లో, ఆఫీసుల్లో వేలాది వినాయక మండపాలు హైదరాబాద్‌లో వెలుస్తుంటాయి. వారి వారి సంప్రదాయల ప్రకారం పూజలు చేస్తారు. రకరకాల రూపాల్లో వినాయకులను ప్రతిష్టిస్తారు. నిమజ్జనం ఊరేగింపు భారీగా చేస్తారు. వినాయక విగ్రహాలతో పాటూ, హోరెత్తించే పాటలు, డీజేలూ, రకరకాల అలంకరణలతో హైదరాబాద్ నిండిపోతుంది. దాదాపు 24 గంటల పైగా ఈ కార్యక్రమం సాగుతుంది. వేలాది విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.

ఈ సామూహిక ఉత్సవాలు ప్రారంభమైన నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి కరోనా కారణంతో బహిరంగ ఉత్సవాలను నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు నగరంలో మండపాలకు అనుమతులు ఇవ్వబోమని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు.

''మీ ఆరోగ్యం కోసమే మేము శ్రద్ధ తీసుకుంటున్నాం. దయచేసి మొహర్రం మాతం ఇంటి దగ్గరే జరుపుకోండి. అలాగే వినాయక పూజ కూడా ఇంటి దగ్గరే చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బయటి ప్రదేశాల్లో విగ్రహ స్థాపనకు కానీ, ఇతర కార్యక్రమాలకు కానీ అనుమతిలేదు'' అంటూ ఆయన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు.

వినయాక చవితి

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి స్పందన ఏమిటి?

అయితే, ఈ నిర్ణయంతో విభేదిస్తోంది భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి. ఈ అంశంపై వారు సోమవారం హైదరాబాద్‌కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో సమావేశమైన తరువాత ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి భగవంత రావు చెప్పారు. ప్రధాన రహదారులపై కాకుండా, కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, బస్తీల్లో విగ్రహాలు పెట్టుకోవచ్చనే విషయంలో అంగీకారం కుదిరిందని ఆయన అన్నారు.

''కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి'' అనేది తమ విధానంగా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి భగవంత రావు బీబీసీతో చెప్పారు.

మరోవైపు హైదరాబాద్ వినాయక ఉత్సవాల్లో అత్యంత పేరున్న బాలాపూర్ మండపం, ఖైరతాబాద్ మండపాలు విగ్రహాల ఎత్తు తగ్గించాయి. బాలాపూర్ గ్రామంలో ఈసారి కేవలం ఆరు అడుగుల విగ్రహమే పెట్టాలనీ, వేలం నిర్వహించకూడదనీ నిర్ణయం తీసుకున్నారు.

ఖైరతాబాద్‌లో ఉత్సవాలకు ఇది 66వ ఏడాది. ఎప్పుడూ 60 అడుగుల ఎత్తుండే విగ్రహం ఈసారి 9 అడుగుల ఎత్తు మేరకే ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ సమితి నిర్ణయించింది. ఈసారి విగ్రహాన్ని కూడా మట్టితో తయారు చేసి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా పేరు పెట్టనున్నారు.

ధన్వంతరి వైద్యానికి దేవుడని హిందువుల నమ్మకం. కరోనా నేపథ్యంలో వారీ పేరు పెట్టారు. ఈ ఏడాది దర్శనానికి భక్తులు మండపం దగ్గరకు రావద్దనీ, ఆన్‌లైన్‌లో దర్శన ఏర్పాటు చేస్తామనీ సమితి ప్రకటించింది.

గతంలో 2009లో వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ గల్లంతయినప్పుడు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఊరేగింపులను స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నారు. అప్పుడు వైయస్ ఛాపర్ ప్రమాదంతో, మెల్లిగా ఆటపాటలతో వినాయకులను ఊరేగించే బదులు, ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని, విగ్రహాలను తెచ్చి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసి వెళ్లిపోయారు. ఆవేళ కొన్ని గంటల్లోనే ఈ నిమజ్జనం ముగిసిపోయింది. మళ్లీ ఇప్పుడు అసలు నిమజ్జనం ఊరేగింపు లేకుండా హైదరాబాద్‌లో వినాయక చవితి ఇంటికే పరిమితం కానుంది.

వినయాక చవితి

ఏపీలో పరిస్థితి ఏమిటి?

అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణేశ్ మండపాల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు.

అయితే, వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించవ్దదని కోరారు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన రెడ్డి. ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్న చిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు, అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

''ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా?'' అని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభిప్రాయాలు ఇప్పుడు కూడా తీసుకోవాల్సిందిగా చెప్పిన ఆయన, ఈ విషయంలో ప్రభుత్వం హిందూ మత పెద్దలతో సంప్రదించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)