క్రికెట్ వరల్డ్ కప్ 2023: భారత్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ఏంటి... ఇంగ్లండ్‌తో జరిగే పోరులో విజయం సాధిస్తుందా?

భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లక్నో స్టేడియంలో కోచ్ ద్రావిడ్, భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ
    • రచయిత, నితిన్ శ్రీ వాత్సవ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

వరల్డ్ కప్ 2019 విజేత ఇంగ్లండ్ ఇప్పుడు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. నాలుగు మ్యాచ్‌లు గెలిచి, ఐదు విజయం కోసం భారత్ ఎదురుచూస్తుంటే, ఈ మ్యాచ్ గెలిచి, మళ్లీ సత్తా చాటాలని ఇంగ్లాండ్ సిద్ధం అవుతుంది.

మరికొద్ది సేపట్లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే, భారత జట్టు వరుస విజయాల వెనక డ్రెస్సింగ్ రూంలో జరిగే వ్యూహాలే కారణమా? ఆ డ్రెస్సింగ్ రూం రహస్యమేంటి?

కొన్ని నెలలుగా జట్టులో చోటుచేసుకుంటున్న మార్పులన్నింటికీ డ్రెస్సింగ్ రూం కేంద్రంగా కనిపిస్తోంది.

సెప్టెంబర్ నెలలో ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌‌తో మొదలైన ఈ మార్పు ఫలితం మనం చూస్తున్నాం.

భారత జట్టులో ఆటగాళ్ల మధ్య ఐకమత్యం

ఫొటో సోర్స్, BCCI

ఫొటో క్యాప్షన్, డ్రెస్సింగ్ రూంలో చర్చలు

డ్రెస్సింగ్ రూం...

మ్యాచ్ జరిగిన తర్వాత అంతా డ్రెస్సింగ్ రూంలో సమావేశమై, ఆటతీరు, ఫీల్డింగ్‌లో జరిగిన పొరపాట్లతోపాటు అత్యుత్తమంగా ఆడిన క్రీడాకారులను అభినందించడం, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మొదలైంది.

ఇందుకోసం జట్టు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ను ఎంచుకున్నారు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ నిర్ణయం సానుకూల ఫలితాలను ఇస్తోంది.

ఉదాహరణకు ధర్మశాలలో న్యూజిలాండ్‌లో మ్యాచ్‌ పూర్తయ్యాక దిలీప్ జట్టును డ్రెస్సింగ్ రూంలో సమావేశపరిచి, వారి ఆటతీరుని విశ్లేషిస్తూ, “అత్యుత్తమ ఫీల్డింగ్‌తో న్యూజిలాండ్‌కు 14 పరుగులు చేరకుండా, అడ్డుకోగలిగారు” అంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, బీబీసీ టీఎంఎస్ బ్రాడ్‌కాస్ట్ టీం సభ్యులైన జొనాథన్ ఎగ్న్యూ తన విశ్లేషణలో, “డ్రెస్సింగ్‌ రూంలో ఏదైతే చర్చ జరుగుతుందో, ఆ ఫలితం మైదానంలో ఆటగాళ్ల ఆటతీరులో కనిపిస్తోంది” అన్నారు.

“మీకు గుర్తుంటే, ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. క్లీవ్ లోయిడ్, వివ్ రిచర్డ్‌ల సారథ్యంలో జట్టులోని సభ్యులంతా ఐకమత్యంతో ఉండేవారు. వన్డే క్రికెట్ అయినా టెస్ట్ క్రికెట్ అయినా మైదానంలో వారి జట్టు ఆటతీరు చూస్తే, ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని పెంచి, విజయం సాధించడానికి వారెంతలా కలిసికట్టుగా ఆడేవారో మనం గమనించొచ్చు. అదే విధంగా ఇప్పుడున్న భారత జట్టులో కూడా ఆటగాళ్ల మధ్య ఉన్న ఐకమత్యం స్పష్టంగా తెలుస్తోంది” అన్నారు.

ఓ వీడియోను చూపిస్తూ “మహ్మద్ షమీ మెడ చుట్టూ చేతులు వేసి బుమ్రా సరదాగా ఉన్న దృశ్యాలు చూసినా, విజయం సాధించిన సంతోషంతో రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్‌ను కౌగిలించుకున్న దృశ్యాన్ని చూసినా, జట్టు సభ్యులు ఎంత కలిసికట్టుగా ఉన్నారో తెలుస్తుంది” అన్నారు.

మ్యాచ్ ఆడటానికి డ్రెస్సింగ్ రూంకు చేరుకున్న ఆటగాళ్లకు “యూ ఆర్ ది బెస్ట్”, “క్రికెట్ ఈజ్ మై ఫస్ట్ లవ్” అన్న కొటేషన్లు రాసి ఉన్న పోస్టర్లు గోడలపై కనిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టి.దిలీప్, రోహిత్ శర్మల మధ్య చర్చలు

నాకౌట్ స్టేజ్..

టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్రికెట్ ఎనలిస్ట్‌గా పని చేసి ప్రస్తుతం మిడ్ డే న్యూస్ పేపర్‌లో వరల్డ్ కప్ -2023 వార్తలను కవర్ చేస్తున్న సంతోష్ సూరి, “నాకౌట్ స్టేజ్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే, రాహుల్ ద్రావిడ్ లాంటి సరైన, సమర్థవంతమైన కోచ్ అవసరం. ఆటలో అనుభవం ఉన్నవాడిగా ఆయన వ్యూహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో మనం చూస్తున్నాం” అని అన్నారు.

2021లో రవిశాస్త్రి నుంచి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. “జట్టులోని సభ్యులందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆటగాళ్లకు మానసిక, శారీరక ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది” అన్నారు.

భారత జట్టు యాజమాన్యం నిర్ణయాలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి. ధర్మశాలలో న్యూజిలాండ్‌లో మ్యాచ్ పూర్తయ్యాక కూడా, మరొక రోజు జట్టు సభ్యులు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించారు.

అదే సమయంలో రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌లు తదుపరి మ్యాచ్ కోసం వ్యూహాల్లో నిమగ్నం అయ్యారు.

ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకౌట్ స్టేజ్‌లో మానసికంగా ధృఢంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లక్నో మైదానంలో ఇంగ్లండ్ జట్టు

ఈరోజు మ్యాచ్‌లో ఏం జరగనుంది?

టోర్నమెంట్ మొదలుకాక ముందు భారత్, ఇంగ్లండ్‌లే ఫైనల్‌లో తలపడతాయని అంతా అనుకున్నారు. కానీ, టోర్నమెంట్ మొదలయ్యాక ఆ పరిస్థితి మారింది. భారత్ విజయ పరంపర కొనసాగిస్తుంటే, ఇంగ్లండ్ వరుస పరాజయాలతో వెనుకబడింది.

చివరి మూడు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. “చూస్తుంటే ప్రపంచకప్‌లో క్వాలిఫై అవడం కష్టతరంగా అనిపిస్తోంది కానీ మా ఆత్మగౌరవం కోసం ఆడతాం” అని ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మాట్ట్ అన్నారు.

జట్టులోని బలమైన ఆటగాళ్లైన సామ్ కర్రన్, జోస్ బట్లర్, బెన్ స్ట్రోక్స్‌ వంటి వాళ్లు కూడా రాణించలేకపోవడంతో ఇంగ్లండ్‌ పరాజయాలను చవిచూస్తోంది.

“ప్రస్తుత పరిస్థితేమీ బాలేదు. దీనికి మేమంతా బాధపడుతున్నాం కానీ, ఏం చేయగలం?” అన్నారు ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్ మార్కస్.

మరోవైపు భారత జట్టుపై అంచనాలు పెరుగుతున్నవేళ ఒత్తిడి కూడా పెరుగుతోంది. గురవారమే లక్నో నుంచి ధర్మశాలకు సగం జట్టు చేరుకుంది. మైదానంలో కోచ్ ద్రవిడ్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు నెట్ ప్రాక్టిస్ చేస్తున్నారు. రెండు రోజులుగా కోచ్ ద్రవిడ్ పిచ్‌ను పరిశీలించి, బృందంతో చర్చలు జరుపుతున్నారు.

గతేడాది, ఇదే స్టేడియంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో తడబడి 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, చివరకు ఓటమిపాలైంది.

ఈరోజు జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేశాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు ఆడే అవకాశం లభించింది.

పిచ్‌ గనుక స్పిన్‌కు అనుకూలంగా ఉంటే ఆర్ అశ్విన్‌కు ఈరోజు మ్యాచ్ ఆడే అవకాశం రావొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)