కరోనావైరస్: 'త్వరలో మరో ఉద్దీపన ప్యాకేజీ'- కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ ఇంటర్వ్యూ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ ఆర్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ), ప్రొఫెసర్ కేవీ సుబ్రమణియన్ ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో రెండు క్లిష్టమైన అంశాలపై స్పష్టత ఇచ్చారు.
అందులో మొదటిది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నడిపేవారికి ద్రవ్య లభ్యతను పెంచేలా ప్రభుత్వం ఒక ఉద్దీపన ప్యాకేజీ అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ పరిశ్రమల రికవరీ, పునరుద్ధరణ ఈ ప్యాకేజీ లక్ష్యంగా ఉంటుంది.
కానీ, అది ఎప్పుడు వస్తుందో స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది రెండోది.
“మేం దానిని ఇప్పుడు ప్రకటించామా, లేక రెండు మూడు రోజుల క్రితం ప్రకటించామా అనేది విషయం కాదు. ఎందుకంటే, లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలను తిరిగి కొనసాగించలేం. ఒక మంచి, సమగ్రమైన ప్యాకేజీ సిద్ధం చేయడానికి లాక్‌డౌన్ మాకు సమయం ఇచ్చింది. అంతే కాదు, మాకు సలహాలు పోటెత్తుతున్నాయి. వాటన్నిటినీ చేరిస్తే అవి దాదాపు 200 స్లైడ్స్‌లో నిండిపోతాయి. అందుకే వాటి అధ్యయనానికి, విశ్లేషణకు సమయం పడుతుంది. మనం లాక్‌డౌన్ నుంచి బయటపడే సమయానికి, మేం ఆ ప్యాకేజీని సిద్ధం చేసి ఉండాలి” అని సుబ్రమణియన్ చెప్పారు.

ఉద్యోగాలు, ఉపశమనం
ప్రశ్న- లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు లేదా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంగతేంటి?
“నిరుద్యోగం అనేది అమెరికాలో కూడా చారిత్రక స్థాయికి చేరింది. అది భారతదేశంలోని సమస్య మాత్రమే కాదు. 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రబలినప్పుడు జరిగిన పరిశోధనలో ఎక్కడ ప్రాణాలు నిలిచాయో, ఆ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడగానే ఉద్యోగాలు, శ్రేయస్సు అక్కడికి తిరిగి వచ్చాయని నిరూపితమైంది. మనం ఆర్థికంగా దెబ్బ తినబోతున్నాం అనేది అనివార్యం. ఇక్కడ లాక్‌డౌన్ లేదనే అనుకుందాం. ప్రజలు ఇప్పటికీ ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉండేవారు. ఆ ప్రభావం కనిపించేది. దీర్ఘకాలిక స్థితి గురించి మట్లాడితే.. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోగానే, ఆరోగ్యంగా తమను తాము కాపాడుకున్న వారికి ప్రయోజనాలు అందుతాయి”.
సీఈఏ వివరాల ప్రకారం “బలహీన వర్గాల కోసం మేం ఇప్పటికే, అంటే మార్చి 26న చర్యలు ప్రకటించాం. అంతే కాదు, అప్పటి నుంచీ బయటపడ్డ మరో ఆసక్తికరమైన విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేరిక కార్యక్రమం, జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిపించాం. ఆ ఖాతాలలో మొత్తం బ్యాలెన్స్ 15 వేల కోట్లకు పెరిగింది. మేం బదిలీ చేస్తున్న నగదు సాయం తీసుకోడానికి జనం బ్యాంకులకు రావడం లేదు. అవసరమైన ధాన్యం, పప్పులు లాంటివి అందిస్తూ మా ప్యాకేజీ ద్వారా బలహీన వర్గాల ప్రాథమిక అవసరాలు చూసుకుంటున్నాం. ప్రజలు ఎక్కువ కష్టాల్లో ఉన్నట్టయితే తమ ఖాతాలో ఉన్న నగదు విత్‌డ్రా చేసుకునేవారు.”.
“మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కొన్ని వేల మంది మాత్రమే ఆ సమస్య ఎదుర్కుంటున్నారు. అది సరైనదే అని నేను చెప్పడం లేదు. కానీ అలాంటి స్థితిలో 10 వేల మంది ఉన్నా, మొత్తం జనాభాలో అది చాలా చిన్న భాగమే అవుతుంది” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువగా ఖర్చు చేయడం లేదు
ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు తగినంత ఖర్చు చేయడం లేదని ప్రభుత్వంపై మరో విమర్శ కూడా వస్తోంది.
“కోవిడ్-19 తర్వాత ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ దేశ జీడీపీలో 0.8 శాతం మాత్రమేనని” భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలందించడానికి ప్రొఫెసర్ సుబ్రమణియన్ ఏ సంస్థ నుంచి సెలవుపై వచ్చారో ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చెందిన శేఖర్ తోమర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్(సీఏఎఫ్ఆర్ఏఎల్)కు చెందిన అనురాగ్ బాలాజీ, గౌతమ్ ఉదుపాలు విమర్శించారు. ప్రపంచ సగటు 5 శాతం ఉందని అంటున్నారు.
అయితే, ఈ విమర్శ సరైనది కాదని ప్రొఫెసర్ సుబ్రమణియన్ అంటున్నారు.
“ప్రపంచం సగటు ఖర్చు 5 శాతం ఉందనేది అబద్ధం. మేం దానిని అధ్యయనం చేశాం. దీనిని మనం పోల్చి చూస్తున్నప్పుడు, మిగతా అంశాలను కూడా పోల్చాలి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జీడీపీ నిష్పత్తిలో పన్నుల వాటా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దేశాలను అమెరికా, బ్రిటన్‌లతో పోల్చలేం. అది ఖర్చుచేసే మన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. క్రెడిట్ రేటింగ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, పెన్షన్ ఫండ్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుడులు వాటిపైనే ఆధారపడి ఉంటాయి”.

ఫొటో సోర్స్, Getty Images
2024 నాటికి భారత్ 5 ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థగా మారగలదని ఇప్పటికీ ఆశలు పెట్టుకోవచ్చా?
ప్రశ్న: 2024 నాటికి 5 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ ర్యాంకులో చేరాలని కోరుకోవడమే కాదు, 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. ఆ లక్ష్యాలపై ఈ మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుంది?
“మా దృష్టి కచ్చితంగా కోవిడ్-19 ప్రభావం నుంచి ఆరోగ్యంగా, తక్కువ ప్రభావంతో బయటపడాలనే దానిపైనే ఉంది. అనిశ్చితి ఉన్న ప్రపంచంలో కొన్నిసార్లు రీ-సెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ, చేతిలో ఉన్న లక్ష్యంపై దృష్టి పెడదాం” అని ప్రొఫెసర్ సుబ్రమణియన్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ ముందు అనిశ్చితి
ప్రశ్న- 2020 ఫిబ్రవరి 1న కరోనా మహమ్మారి భారత్‌పై ప్రభావం చూపక ముందే, జాతీయ అర్థ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన మొదటి మందస్తు అంచనాల్లో 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠానికి (5 శాతానికి) పడిపోయిందని చెప్పారు. అంతకు ముందు త్రైమాసికాలలో కూడా మందగమనం కనిపించింది. అది తిరిగి పుంజుకుంటుందని సీఈఏ ఆర్థిక సర్వే అంచనా వేసినప్పటికీ, ఇప్పటికే మందగించిన ఆర్థికవ్యవస్థ దేశం కోలుకునే అవకాశాన్ని మరింత హరిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది?
“పరిస్థితులు అంత ఘోరంగా లేవు. నిజానికి ఫిబ్రవరిలో మనం కోలుకున్నామనే సంకేతాలు కూడా కనిపించాయి. అవును, మన ఆర్థిక రంగం మిగతా దేశాల కంటే బలహీనంగా ఉండచ్చు. కానీ, దానికి మొండి బకాయిలు, ఆశ్రిత రుణాలే కారణం. చాలా వాటితో పోలిస్తే దీర్ఘకాలంలో చూసినప్పు మనకు మరింత మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మన వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి. అవును, అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల క్రెడిట్ రేటింగ్స్, అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థలంత మెరుగ్గా ఉండవు. అది ఒక ప్రభావం చూపుతుంది. కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ఎదుర్కొనే అంశాలను మనం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయినా కోవిడ్ ముందు మన ఆర్థికవ్యవస్థ స్థితి కారణంగా మన చేతులు కట్టేసి ఉన్నట్లు నేను అనుకోవడం లేదు” అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, TWITTER
ముందున్న మార్గం
ప్రశ్న- మే 3 తర్వాత ఈ లాక్‌డౌన్ ఎత్తివేసినపుడు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలని మీరు సూచిస్తారు?
"మనం లాక్‌డౌన్‌ను దశలవారీగా, జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుంది. మనం కచ్చితంగా పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. హాట్‌స్పాట్లకు ఎక్కువ కాలం లాక్‌డౌన్ అవసరం. పరస్పర భాగస్వామ్యం మరింత అవసరమయ్యే పరిశ్రమలు, రంగాలు ఎక్కువకాలం వేచి చూడాల్సి ఉంటుంది. సామాజిక దూరం నిబంధనలను మనం కఠినంగా పాటించాలి. ఒక రంగం నుంచి ఆర్థికవ్యవస్థకు అందే సహకారాన్ని బట్టి సడలింపులు ఉండాలి".
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








