కరోనావైరస్: మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందా?

సరైన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్-19 మృతులకు అంత్యక్రియలు నిర్వహించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరైన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్-19 మృతులకు అంత్యక్రియలు నిర్వహించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మృతులకు సంబంధించి విషాదకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారి కోసం విలపించే ఆత్మీయులు ఎవరూ వారి మృతదేహాల సమీపంలో కనిపించటం లేదు.

ఆ దృశ్యాలు మరణం గురించి మాత్రమే కాదు.. మృతుల గురించి కూడా భయాలను రాజేస్తున్నాయి. వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచి కూడా వైరస్ సోకుతుందన్న భయాలు అవి.

కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి మృతదేహాల నుంచి వైరస్ సంక్రమిస్తుందా? అంత్యక్రియలు నిర్వహించటం సురక్షితమేనా? వైరస్ మృతులను ఖననం చేయాలా? దహనం చేయాలా?

మృతదేహాల నుంచి కోవిడ్-19 వ్యాపిస్తుందా?

కోవిడ్-19 మృతదేహాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందనే భయం అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ ప్రధానంగా మనుషుల ఉమ్మి, తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.

అయితే.. ఈ వైరస్ కొన్ని రకాల ఉపరితలాల మీద కొన్ని రోజుల వరకూ సజీవంగా ఉండగలదు.

‘‘ఇప్పటివరకూ అయితే మృతదేహాల నుంచి సజీవంగా ఉన్నవారికి వైరస్ సంక్రమిస్తున్నట్లు ఆధారాలేమీ లేవు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పాన్-అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి విలియం అడుక్రో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఇస్తాంబుల్‌లో అనుమానిత కోవిడ్-19 మృతుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇస్తాంబుల్‌లో అనుమానిత కోవిడ్-19 మృతుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం.

మృతదేహాల్లో వైరస్ బతకగలదా?

‘‘మృతదేహాల నుంచి వైరస్ సోకపోయినప్పటికీ.. మనం వైరస్ వ్యాప్తి నిరోధక, నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుంది. మృతులు మనకు ఎంతటి ఆత్మీయులైనా వారి మృతదేహాలను ముద్దాడటం వంటివి చేయకూడదు’’ అని ఆయన పేర్కొన్నారు.

రక్తస్రావ కలిగించే ఎబోలా, మార్బర్గ్ వంటి జ్వరాలు, కలరా కేసుల్లో మినహా మృతదేహాల నుంచి సాధారణంగా ఇన్‌ఫెక్షన్ సంక్రమించదని డబ్ల్యూహెచ్ఓ మార్చిలో విడుదల చేసిన సిఫారసులు చెప్తున్నాయి.

‘‘మహమ్మారి ఇన్‌ఫ్లుయెంజా రోగుల ఊపిరితిత్తుల విషయంలో శవపరీక్ష సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే.. ఆ ఊపిరితిత్తుల నుంచి మాత్రమే ఇన్‌ఫెక్షన్ సోకగలదు. లేనిపక్షంలో మృతదేహాల నుంచి ఇన్‌ఫెక్షన్ అంటదు’’ అని వివరించాయి.

కానీ.. తీవ్ర శ్వాస వ్యాధులతో చనిపోయిన వారి ఊపిరితిత్తులు, ఇతర శరీర అవయావాల్లో సజీవ వైరస్‌లు ఇంకా ఉండగలవు. శవపరీక్ష ప్రక్రియల్లో ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంది.

కోవిడ్-19 మృతుల బందువులు, స్నేహితులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత శిక్షణ, రక్షణ ఉన్న వృత్తినిపుణులు కోవిడ్-19 బాధితుల మృతదేహాలన అంత్యక్రియలకు సిద్ధం చేసేలా చూసుకోవాలి.

ఈక్వెడార్‌లో మార్చురీలలో ఖాళీ లేక రోడ్లపైనే మృతదేహాలను వదిలేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈక్వెడార్‌లో మార్చురీలలో ఖాళీ లేక రోడ్లపైనే మృతదేహాలను వదిలేస్తున్నారు.

అంత్యక్రియలను నిర్వహించవచ్చా?

కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 మృతుల సంఖ్య విపరీతంగా ఉండటంతో అంత్యక్రియల విషయంలో సంక్షోభం తలెత్తింది.

సామాజిక దూరం మార్గదర్శకాలను అనుసరించటం కోసం పలు దేశాల్లో అంత్యక్రియల నిర్వహణను నిషేధించారు. ఇతర దేశాల్లో చాలా పరిమితమైన హాజరుతో అనుమతిస్తున్నారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు కొన్ని ఆంక్షలను పాటిస్తూ కోవిడ్ మృతుల భౌతికకాయాలను సందర్శించవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది.

‘‘మృతదేహాన్ని తాకటం కానీ ముద్దాడటం కానీ చేయకూడదు. మృతదేహాన్ని సందర్శించిన తర్వాత తమ చేతులను సోపు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఒకరికొకరు కనీసం ఒక మీటరు దూరంలో ఉండాలన్న భౌతిక దూరం ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి’’ అని ఆ మార్గదర్శకాలు చెప్తున్నాయి.

శ్వాస సంబంధిత సమస్యల లక్షణాలు ఉన్న వారు ఈ అంత్యక్రియలకు హాజరుకాకూడదు. ఒకవేళ హాజరవ్వాల్సివస్తే వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి కనీసం ఫేస్ మాస్క్ ధరించాలని సూచించింది.

అలాగే పిల్లలు, 60 ఏల్లు దాటిన పెద్దవాళ్లు, ఇతరత్రా అనారోగ్యాలతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. మృతదేహాన్ని నేరుగా తాకకూడదు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అంత్యక్రియలపై అనేక ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అంత్యక్రియలపై అనేక ఆంక్షలు విధించారు.

మృతదేహాలను సమాధి చేయాలా, దహనం చేయాలా?

సమాధి చేయటం, దహనం చేయటం రెండూ చేయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది.

‘‘ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధుల వల్ల చనిపోయిన వారిని దహనమే చేయాలనే భావన జనంలో ఉంది. కానీ అది నిజం కాదు. అంతిమ సంస్కారాలు సంస్కృతికి సంబంధించిన విషయం. వనరుల అందుబాటుకు సంబంధించిన విషయం’’ అని వివరించింది.

మృతదేహాలను సమాధి చేయటం లేదా చితిమీదకు చేర్చటం వంటి పనులు చేసేవారు గ్లవ్స్ ధరించాలి, అనంతరం ఆ గ్లవ్స్‌ను తొలగించి పారవేశాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

మృతదేహాన్ని మోసుకెళ్లే వ్యక్తులు కూడా ప్రొటెక్టివ్ సూట్, ఇతర రక్షణ సామగ్రి ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతదేహాన్ని మోసుకెళ్లే వ్యక్తులు కూడా ప్రొటెక్టివ్ సూట్, ఇతర రక్షణ సామగ్రి ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

కోవిడ్-19 మృతుల శరీరాలను హడావుడిగా ఖననం చేయాల్సిన అవసరం లేదని కూడా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

మృతులకు చెందిన వస్తువులను కూడా దగ్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని గ్లవ్స్ ధరించి తాకాలని, డిటర్జెంట్‌తో కానీ 70 శాతం ఇథనాల్ ద్రావణంతో కానీ, బ్లీచ్‌తో కానీ పూర్తిగా ప్రక్షాళన చేయాలి.

మృతుల దుస్తులను మెషీన్‌లో డిటర్జెంట్‌తో 60 నుంచి 90 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతకవచ్చు. లేదంటే పెద్ద డ్రమ్ములో వేడి నీళ్లు, సోపులో నానబెట్టి కర్రతో తిప్పుతూ ఉతకవచ్చు.

బ్రెజిల్‌లో మరణాలు పెరగడంతో సామూహిక ఖననాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌లో మరణాలు పెరగడంతో సామూహిక ఖననాలు చేస్తున్నారు.

గౌరవాన్ని కాపాడాలి...

ఈ ప్రక్రియలో ‘‘మృతుల మర్యాదను, వారి సంస్కృతి, సంప్రదాయాలను, వారి కుటుంబాల గౌరవాన్ని కాపాడాలి’’ అని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది.

కానీ మహమ్మారి కారణంగా తీవ్ర భయాందోళనలు వ్యాపిస్తుండటంతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ పాటించటం కష్టంగా మారాయి.

కోవిడ్ మృతుల సంఖ్య ఈక్వెడార్‌లోని గేయాస్ ప్రావిన్స్‌లో కేవలం కొన్ని వారాల్లోనే 10,000 దాటిపోవటంతో ఇక్కడ ‘‘పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది’’ అని ఈక్వెడార్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యునరల్ సర్వీసెస్ అధిపతి మెర్విన్ టెరాన్ బీబీసీ ముండోతో చెప్పారు.

లాటిన్ అమెరికాలో బ్రెజిల్ తర్వాత కోవిడ్-19 ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశం ఈక్వెడార్. పరిస్థితులు చేయిదాటి పోవటంతో ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయింది. మార్చురీలు నిండిపోవటంతో శవపేటికలు, మృతదేహాలను రోజుల తరబడి వీధుల్లోనే వదిలేశారు.

మృతదేహాల్లో కూడా వైరస్ ఉండే ప్రమాదం ఉంది, అందువల్ల అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మృతదేహాల్లో కూడా వైరస్ ఉండే ప్రమాదం ఉంది, అందువల్ల అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

మృతదేహాలను భద్రపరచటానికి అవసరమైన ఎయిర్‌ కండిషనింగ్ కానీ, తగిన సదుపాయాలు కానీ లేనీ గిడ్డంగులకు శవాలను తరలిస్తున్నారు.

‘‘చావు వాస్తవికతను చూడటం అలవాటైన మాకే.. ఒక మృతదేహాన్ని గుర్తించటానికి ఆ గిడ్డంగులకు వెళ్లటం చాలా కష్టంగా మారింది. 24 గంటల తర్వాత ఆ మృతదేహాలకు నీరు చేరి పాడవుతున్నాయి’’ అని టెరాన్ చెప్పారు.

అమెరికా లోని న్యూయార్క్‌లో, బ్రెజిల్‌ లోని మానస్‌లో, టర్కీలోని ఇస్తాంబుల్‌లో సామూహిక సమాధుల ఫొటోలు పతాక శీర్షికలకు ఎక్కాయి.

కానీ.. ఈ కరోనావైరస్ కాలంలో మృతులకు గౌరవప్రదమైన తుదివీడ్కోలు ఇవ్వటానికి కఠోరమైన మరణ వాస్తవికత అడ్డుపడకూడదని డబ్ల్యూహెచ్ఓ అంటోంది.

‘‘అధికారులు ఒక్కో కేసు ప్రాతిపదికగా పరిస్థితిని పర్యవేక్షించాలి. కుటుంబానికి గల హక్కులకు, మరణానికి కారణాన్ని శోధించాల్సిన అవసరం, ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదాల మధ్య సంతులనం సాధించాలి’’ అని ఆ సంస్థ పేర్కొంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)