కరోనావైరస్ లాక్ డౌన్: నైమిశారణ్య క్షేత్రంలో 45 రోజులుగా చిక్కుకుపోయిన ఆంధ్ర, ఒడిశా భక్తులు

- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్య క్షేత్రం నైమిశారణ్యలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన భక్తులు చిక్కుకుపోయి ఉన్నారు.
లఖ్‌నవూ నుంచి సుమారు 80 కి.మీ.ల దూరంలోని సీతాపుర్ జిల్లాలో గోమతి నది ఒడ్డున నైమిశారణ్య క్షేత్రం ఉంది.
ఇక్కడున్న అడవిలో ఒకప్పుడు వ్యాస మహా ముని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు రాశారని... ఎంతో మంది రుషులకు బోధనలు చేశారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన 70 మంది భక్తుల బృందం మార్చి 16న నైమిశారణ్య లోని ఉడియా ఆశ్రమానికి వచ్చారు.
భాగవతం కథ చెప్పేందుకు వీళ్లు ఇక్కడికి వచ్చారు. కథ మొదలైంది కూడా. కానీ, కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి మార్చి 22న జనతా కర్ఫ్యూ జరిగింది. ఆ తర్వాత లాక్‌డౌన్ అమలైంది.
ఈ భక్తులంతా ఇక్కడే చిక్కుకుపోయి, నెలన్నర రోజుల నుంచి ఉంటున్నారు.
సొంతంగా ఇక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి వారికి లేదు. ప్రభుత్వం కూడా ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు.
ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో, చివరికి గత సోమవారం కాలినడకనే స్వస్థలాలకు వెళ్లేందుకు వాళ్లు పయనమయ్యారు.
కానీ అధికారులు వాళ్లను ఆపారు. ఇంకొన్ని రోజులు ఓపికపట్టాలని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

చిక్కుకుపోయిన భక్తుల బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాళ్లు 18 మంది, ఒడిశాకు చెందినవాళ్లు 51 మంది ఉన్నారని మిశ్రిఖ్ ఉప జిల్లాధికారి రాజీవ్ పాండే బీబీసీతో చెప్పారు.
‘‘భాగవత కథ కోసం వీళ్లు ఇక్కడికి వచ్చారు. లాక్‌డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోయారు. వేరే చోట్ల ఉంచితే, వీరికి భాష సమస్య కూడా ఉంటుంది. అందుకే మఠంలోనే వీరికి అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశాం. ప్రస్తుతానికి ఏ ఇబ్బందీ లేదు. త్వరలోనే వాళ్లను వారివారి ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.
ఇక్కడ చిక్కుకుపోయిన భక్తుల్లో ఎక్కువ మంది వృద్ధులే.
ఈ బృందంలో ఒకరైన వ్యాస్ గౌడ్ జీ మహారాజ్ బీబీసీతో మాట్లాడారు.
‘‘మా ఇళ్లకు వెళ్లనివ్వాలని చాలా రోజుల నుంచి అధికారులను కోరుతున్నాం. మా బృందంలో చాలా మంది వృద్ధులు ఉన్నారు. కొందరికి మధుమేహం ఉంది. కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. రెండు నెలల నుంచి వాళ్లు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. అధికారుల తీరుపై నిరాశతోనే మేం కాలినడకన వెళ్లాలని తయారయ్యాం. కానీ, తహసీల్దారు, స్థానిక పోలీసులు మమ్మల్ని ఆపారు’’ అని చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
భక్తులను తరలించే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే బిహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కొందరిని తరలించామని కూడా రాజీవ్ పాండ్యే చెప్పారు.
‘‘ఈ భక్తులను పంపించేందుకు కూడా అనుమతివ్వాలని, వాహనాలను ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశాం. రెండు, మూడు రోజుల్లో అనుమతి వస్తుంది. వారిని వారి వారి ప్రాంతాలకు తరలిస్తాం’’ అని అన్నారు.
ఈ మఠంతోపాటు నైమిశారణ్యలోని ఇతర మఠాల్లోనూ వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇంకా ఉన్నట్లు సమాచారం.
వెళ్లాలనుకునే భక్తులందరినీ పంపిస్తామని, ఉండాలనుకునేవారి కోసం ఆహారం, వసతి ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- మడగాస్కర్‌లో ‘కోవిడ్-19కి మూలికల మందు’.. ప్రత్యేక విమానంలో తెప్పిస్తానంటున్న దేశాధ్యక్షుడు
- బాయ్స్ లాకర్ రూమ్: ఈ గ్రూప్‌లో ఏం జరిగింది? టీనేజ్ అబ్బాయిలు చేస్తున్న అకృత్యాలపై ఎవరేమన్నారు?
- కరోనావైరస్: 'తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. మద్యం షాపులు ఓపెన్' -కేసీఆర్
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- కరోనావైరస్: 'చైనీస్ వైరస్' అంటూ ట్రంప్ ట్వీట్.. చైనా ఆగ్రహం
- కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది?
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








