టర్మ్ పాలసీ తీసుకునే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలేంటి ?

వృద్ధుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం...

2010 తర్వాత బీమా రంగంలో వచ్చిన ముఖ్యమైన మార్పులలో టర్మ్ పాలసీలు ఒకటి. ఆన్‌లైన్ దరఖాస్తు నుంచీ పాలసీ తీసుకునే ప్రక్రియ మొత్తాన్ని సరళీకరించారు.

ఎల్ఐసీ వారి జీవన్ ఆనంద్ తరహా సంప్రదాయ పాలసీల నుంచీ ఒక కొత్త ఆలోచనతో వచ్చిన టర్మ్ పాలసీలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే ఆపత్కాలంలో ఆ కుటుంబానికి బాసటగా నిలిచే ఆర్థిక వనరు టర్మ్ పాలసీ. వార్షిక ప్రీమియం కంటే ఎన్నో రెట్లు బీమా కవరేజ్ ఉండే టర్మ్ పాలసీ ఉద్యోగి కుటుంబానికి మొదటి రక్షణ కవచం అనడం అతిశయోక్తి కాదు.

ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తి కచ్చితంగా టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఈ పాలసీ ఉద్యోగులకు దొరికినంత సులభంగా వ్యాపారులకు, వేరే వృత్తుల వారికీ దొరకదు.

టర్మ్ పాలసీ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఉద్యోగి జీవిత కాలంలో పాలసీ నుంచి ఎలాంటి లాభం పొందలేరు అనేది ప్రధానమైనది. ఈ వాదనలో కొంత నిజం ఉంది. కానీ, టర్మ్ పాలసీ లక్ష్యం ఉద్యోగి కుటుంబానికి ఆసరాగా నిలబడటం.

ఎల్ఐసీతోపాటు ఇప్పుడు అనేక సంస్థలు పోటీపడి టర్మ్ పాలసీలు అందిస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్ఐసీతోపాటు ఇప్పుడు అనేక సంస్థలు పోటీపడి టర్మ్ పాలసీలు అందిస్తున్నాయి

టర్మ్ పాలసీ ఎందుకంటే?

ముఖ్యమైనం విషయం ఏంటంటే, ఎలాంటి బీమా (జీవిత/ఆరోగ్య) పాలసీ లక్ష్యమైనా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా చూడటమే.

ఇవి సేవింగ్స్ స్కీములు కాదు అన్నది అందరూ గుర్తుంచుకోవాలి.

మరి ఆరోగ్యవంతుడైన మనిషికి టర్మ్ పాలసీ ఎందుకు అన్నది మరో ప్రశ్న. టర్మ్ పాలసీ అనేది ముప్పై-నలభై సంవత్సరాలకు సంబంధించిన విషయం.

కాబట్టి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలసీ గురించి నిర్ణయానికి రావడం సబబు కాదు.

నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత టర్మ్ పాలసీ దొరకడం కూడా కష్టమే. దరఖాస్తు చేసుకున్న అందరికీ పాలసీ దొరుకుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు.

అన్ని బీమా పాలసీల్లాగే టర్మ్ పాలసీ కూడా చిన్న వయసులో తీసుకోవడం ద్వారా ప్రీమియంలో గణనీయమైన రాయితీ పొందవచ్చు.

టర్మ్ బీమా పాలసీ

ప్రీమియం ఎలా నిర్ణయిస్తారు?

ఉద్యోగి ఆరోగ్య స్థితిని బట్టి టర్మ్ పాలసీ వార్షిక ప్రీమియాన్ని పరిగణిస్తారు. ఉదాహరణకు మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలున్న వారికి వార్షిక ప్రీమియం అధికంగా ఉంటుంది.

అన్ని ప్రముఖ కంపెనీలు ఆరోగ్య పరీక్షల తర్వాత మాత్రమే టర్మ్ పాలసీ దరఖాస్తును తీసుకుంటాయి. టర్మ్ పాలసీ కాలపరిమితి ఐదేళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్య ఎంతైనా ఉండొచ్చు.

కానీ, కాల పరిమితి ఎక్కువ ఉన్న పాలసీ తీసుకోవడం ద్వారా వార్షిక ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ముప్పై ఏళ్ల వయసున్న వ్యక్తి కోటి రూపాయల బీమా కవరేజి కావాలనే ధ్యేయంతో ఉంటే, పదేళ్ల కాలపరిమితికి వార్షిక ప్రీమియం లక్ష రూపాయల దాకా వస్తుంది.

అదే వ్యక్తికి నలభై ఏళ్ల కాల పరిమితికి వార్షిక ప్రీమియం ముప్పై వేలలోపు వస్తుంది.

టర్మ్ పాలసీ

ఫొటో సోర్స్, Getty Images

పాలసీ కవరేజ్ ఎంత ఉండాలి?

ఈరోజు మనం తీసుకునే కవరేజ్ పది లేదా ఇరవై ఏళ్ల తర్వాత మన అవసరాలకు సరిపోతుందా? ఉద్యోగం వచ్చిన కొత్తల్లో తీసుకున్న కవరేజ్ జీవిత భాగస్వామి, పిల్లలతో కలిపి వచ్చే ఖర్చులకు సరిపోతుందా? ఎలాంటి అదనపు రైడర్స్ తీసుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ సహజంగా వచ్చేవే.

ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు. ఈ కింద చెప్పిన రెండు పద్దతుల ద్వారా పాలసీ కవరేజ్ ఎంత ఉండాలి అని తెలుసుకోవచ్చు:

1. మన అవసరాలకు ప్రస్తుతం పెడుతున్న ఖర్చు ఆధారంగా కవరేజ్ ఎంత ఉండాలో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నెలవారి ఖర్చు రూ.20వేలు అనుకుందాం. అంటే ఏడాదికి రూ. 2,40,000. ఇరవై ఏళ్ల కాలపరిమితితో 6% ద్రవ్యోల్బణాన్ని కలిపి లెక్కిస్తే ఇంచుమించు రూ. 1 కోటి దాకా కవరేజ్ ఉండే పాలసీ తీసుకోవాలి.

2.పైన చెప్పిన పద్దతిలో నెలవారి ఖర్చుకు బదులుగా ఉద్యోగి మూలవేతనం ఆధారంగా కవరేజ్ గణించవచ్చు. సాధారణంగా మూలవేతనం ఉద్యోగి ఆర్థిక స్థితిగతులను సూచిస్తుంది. అందువల్ల ఈ విధంగా లెక్కించిన కవరేజ్ కూడా ఉద్యోగికి తగినట్టుగా ఉంటుంది

వీడియో క్యాప్షన్, లబ్.. డబ్బు: జీవితానికి భరోసా బీమా

ఇక రైడర్ల విషయనికి వస్తే ఈ క్రింది అంశాలు ఖచ్చితంగా ఆలోచించాలి:

1. వాహన ప్రమాదానికి రైడర్:

వాహనాల వల్ల కలిగే ప్రమాదాలకు సంబంధించిన రైడర్. ఈ రైడర్ వల్ల లభించే అదనపు రక్షణతో పోల్చుకుంటే ఈ రైడర్‌ పెద్ద ఖరీదైన విషయం కాదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా పాలసీలలో ఈ రైడర్ అందుబాటులో ఉంది.

2. దీర్ఘకాలిక వ్యాధుల రైడర్:

దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఈ రైడర్ చాలా ముఖ్యమైనది. దీనిని తీసుకున్న వారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్య ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోతే కవరేజ్ నుంచి కొంత మొత్తం అవసరాలకు వాడుకోవచ్చు.

3. జీవిత భాగస్వామికి కవరెజ్:

ఈ రైడర్ ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నారు. ఈ రైడర్ తీసుకున్న వారి జీవిత భాగస్వామికి కూడా కవరెజ్ ఇస్తారు. సహజంగా ఉద్యోగస్తులకు మాత్రమే టర్మ్ పాలసీ ఇస్తారు. కానీ, ఈ రైడర్ ద్వారా జీవిత భాగస్వామి ఉద్యోగం చేయకున్నా టర్మ్ పాలసీ కవరేజ్ పొందవచ్చు.

ఇక పాలసీ తీసుకునే సమయంలో ఈ క్రింది విషయాలు పరిగణలోకి తీసుకోవాలి:

1. మన అవసరాలకు తగిన కవరేజ్

2. కవరేజ్ తగినట్టు వార్షిక ప్రీమియం

3. క్లెయిం సెటిల్మెంట్ రేట్

4. రైడర్ల వల్ల వచ్చే అదనపు ఖర్చు

ప్రతి పాలసీకి పైన చెప్పిన వివరాలన్నీ పాలసీబాజార్ లాంటి వెబ్ సైట్లలో సులభంగా అందుబాటులో ఉన్నాయి.

అన్నీ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి మనకు కావలసిన పాలసీ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)